...
...
Next Story

ఇండిగో విమానాల్లో పెను గందరగోళం: ‘కెప్టెన్ మిస్సింగ్, ప్రయాణీకుల హాహాకారాలు’

బుధవారం కనీసం 150 విమానాలను ఇండిగో రద్దు చేయగా, ఆ గందరగోళం గురువారం కూడా కొనసాగింది. సిబ్బంది కొరత కారణంగా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో తీవ్ర ఆపరేషనల్ అంతరాయాలను ఎదుర్కొంది. గంటల తరబడి రన్‌వేపైనే విమానాలు నిలిచిపోవడం వంటి ఘటనలతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated on: Dec 04, 2025 08:53 AM IST
Advertisement

బుధవారం కనీసం 150 విమానాలను ఇండిగో (IndiGo) రద్దు చేయగా, ఆ గందరగోళం గురువారం కూడా కొనసాగింది. ప్రయాణీకులు విమానాల ఆలస్యం, ప్రయాణ ప్రణాళికల్లో అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో... కొత్త కఠినమైన సిబ్బంది రోస్టరింగ్ నిబంధనల (Crew Rostering Rules) కారణంగా ఏర్పడిన సిబ్బంది కొరతతో గణనీయమైన ఆపరేషనల్ అంతరాయాలతో సతమతమవుతోంది.

ఎయిర్‌పోర్టుల్లో అలజడి

ఇండిగో కౌంటర్ల ముందు ప్రయాణికులు (HT_PRINT)
ఇండిగో కౌంటర్ల ముందు ప్రయాణికులు (HT_PRINT)

గురువారం ఉదయం ఇండిగో విమానాలలో బుక్ చేసుకున్న ప్రయాణీకులు సుదీర్ఘ ఆలస్యాలను ఎదుర్కొన్నారు. దీంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

నలంద క్యాపిటల్‌లో ఇన్వెస్టర్‌ అయిన ఆనంద్ శ్రీధరన్ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని పంచుకున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు తన ఇండిగో విమానం బయల్దేరాల్సి ఉండగా, కెప్టెన్ మిస్సవడంతో అది నిరవధికంగా ఆలస్యం అయిందని ఆయన తెలిపారు.

“అధికారికంగా బోర్డు మీద ఫ్లైట్ సమయానికి వెళ్తుందని చూపిస్తోంది. కానీ సిబ్బంది మాత్రం కెప్టెన్ మిస్సయ్యారు, అందుకే ఫ్లైట్ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు” అని శ్రీధరన్ 'ఎక్స్' (X) లో రాశారు. “ప్రయాణీకులు కేకలు వేస్తున్నారు. మరికొందరు ఆ కేకలు వేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియో తీస్తున్నారు” అని రాశారు.

అరగంట తర్వాత మిస్సైన కెప్టెన్‌ను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. అయితే అప్పటికే మొదటి ఆఫీసర్ (First Officer) కనిపించకుండా పోయారు. ఇది మరింత ఆలస్యానికి దారితీసింది.

“పెళ్లిళ్లకు, వైద్య పరీక్షలకు వెళ్లేవారు చిక్కుకుపోయారు. కస్టమర్ సపోర్ట్ అందుబాటులోకి రావడానికి 20 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. అనేక రద్దుల తర్వాత చివరకు నేను విమానం ఎక్కాను. కానీ క్యాబిన్ సిబ్బంది వెనుకబడి పోయారు. వారు వచ్చే వరకు విమానం రన్‌వేపైనే గంటకు పైగా కూర్చోవాల్సి వచ్చింది” అని ఆరయన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండిగో క్షమాపణలు: శుక్రవారం కూడా కష్టాలే

ఈ తీవ్ర అంతరాయంపై విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. అయితే, రాబోయే 48 గంటల్లో కార్యకలాపాలను స్థిరీకరించడానికి "కొన్ని సర్దుబాటు చర్యలను" ప్రారంభించినందున, శుక్రవారం కూడా మరిన్ని రద్దులకు సిద్ధంగా ఉండాలని ప్రయాణీకులను హెచ్చరించింది.

రోజువారీగా సుమారు 2,300 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతున్న ఇండిగో... గత రెండు రోజులుగా "ఊహించని అనేక ఆపరేషనల్ సవాళ్లు" తమ నెట్‌వర్క్‌లో గణనీయమైన అంతరాయాన్ని సృష్టించాయని బుధవారం తెలిపింది. ఈ అసౌకర్యానికి ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పింది.

"చిన్న సాంకేతిక లోపాలు, శీతాకాలానికి సంబంధించిన షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, అప్‌డేట్ చేసిన సిబ్బంది రోస్టరింగ్ నిబంధనల (Flight Duty Time Limitations) అమలు.. అన్నీ కలిసికట్టుగా ఊహించలేని విధంగా మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపాయి" అని ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిన్న ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ సహా వివిధ విమానాశ్రయాలలో 100కు పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. పీటీఐ (PTI) అందించిన సమాచారం ప్రకారం, బెంగళూరు విమానాశ్రయంలో కనీసం 42 విమానాలు, ఢిల్లీలో 38, ముంబైలో 33, హైదరాబాద్‌లో 19 విమానాలు రద్దు అయ్యాయి.

గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న ఇండిగో

బుధవారం నుంచి గూగుల్‌లో "IndiGo" అనే పదం బాగా ట్రెండింగ్‌లో ఉంది. డిసెంబర్ 3, బుధవారం నుంచి దీనిపై శోధన ఆసక్తి నిలకడగా పెరుగుతోంది. గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రశ్నలలో "IndiGo విమానాలు ఈరోజు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి", "ఇండిగో పైలట్ సమ్మె", "ఇండిగో విమానాలు రద్దు" వంటివి ఉన్నాయి.

అండమాన్, నికోబార్ దీవుల నుంచి అత్యధిక శోధన ఆసక్తి వచ్చింది. గోవా, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe