...
...
Next Story

యాచకుడే, కానీ కోటీశ్వరుడు.. 3 ఇళ్లు, 3 ఆటోలు, కారు

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌ను యాచక రహిత నగరంగా మార్చే క్రమంలో అధికారులు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని గుర్తించారు. ఏళ్ల తరబడి భిక్షాటన చేస్తున్న మాంగీలాల్ అనే వ్యక్తికి మూడు ఇళ్లు, ఒక కారు, మూడు ఆటోలు ఉండటంతో పాటు అతను ఒక వడ్డీ వ్యాపారి అని తేలడం సంచలనం సృష్టిస్తోంది.

Published on: Jan 19, 2026, 16:18:23 IST
Advertisement

సాధారణంగా రోడ్డు పక్కన దీనస్థితిలో యాచిస్తున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. తమకు తోచిన సహాయం చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం చూస్తే మాత్రం.. మనం ఎవరికి సహాయం చేస్తున్నాం? అనే అనుమానం కలగక మానదు. ఇండోర్‌ను 'భిక్షాటన రహిత' నగరంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఒక 'కోటీశ్వరుడైన బిచ్చగాడు' అధికారుల కంటపడ్డాడు.

యాచకుడు కాదు.. కోటీశ్వరుడు

ఇండోర్ బిచ్చగాడి ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే: 3 ఇళ్లు, 3 ఆటోలు, కారు (AFP)
ఇండోర్ బిచ్చగాడి ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే: 3 ఇళ్లు, 3 ఆటోలు, కారు (AFP)

ఇండోర్‌లోని ప్రముఖ సరాఫా బజార్ ప్రాంతంలో మాంగీలాల్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి భిక్షాటన చేస్తున్నాడు. దివ్యాంగుడు కావడంతో, చేతులతో తోసుకుంటూ వెళ్లే బండిపై తిరుగుతూ అతను అందరినీ సహాయం కోరేవాడు. అతని పరిస్థితి చూసి జాలిపడ్డ జనం రోజుకు రూ. 500 నుండి రూ. 1000 వరకు ఇచ్చేవారు. అయితే, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పునరావాసం కోసం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

మాంగీలాల్‌కు ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏకంగా మూడు ఇళ్లు ఉన్నాయి. ఇందులో ఒకటి బహుళ అంతస్తుల భవనం కాగా, మరొకటి 600 చదరపు అడుగుల నివాసం. ఇక్కడితో ఆగకుండా.. అతనికి మూడు ఆటో రిక్షాలు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా ఉన్నాయి. వీటిని ఇతరులకు అద్దెకు ఇచ్చి ప్రతి నెలా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు.

అర్హత లేకున్నా ప్రభుత్వ పథకం!

ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, మాంగీలాల్ అత్యంత పేదలకు ఇచ్చే 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' (PMAY) కింద ఒక బెడ్‌రూమ్ ఇంటిని కూడా దక్కించుకోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. అసలు ఇన్ని ఆస్తులు ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పథకం ఎలా దక్కింది? ఎవరు సహకరించారు? అనే కోణంలో అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.

బిచ్చగాడు మాత్రమే కాదు.. పెద్ద వడ్డీ వ్యాపారి

ఇండోర్ నగరాన్ని భిక్షాటన రహితంగా మార్చే ఈ ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు వేలమంది యాచకులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిలో నిజమైన పేదలకు వసతి, ఉపాధి, పిల్లలకు విద్య కల్పిస్తున్నామని, మాంగీలాల్ వంటి వారి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నామని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks