కష్టాల కడలి దాటి.. ప్రపంచ కప్ ఫైనల్‌కు! భారత మహిళల క్రికెట్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
ఒకప్పుడు డార్మిటరీల్లో నేల మీద పడుకోవడం, కిట్లు లేక టీమ్ మొత్తం 3 బ్యాట్లతో ఆడటం నుంచి నేడు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం వరకు.. మన భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది! సౌతాఫ్రికాతో ప్రపంచ కప్ ఫైనల్ నేపథ్యంలో మహిళల జట్టుపై స్పెషల్ స్టోరీని ఇక్కడ చూడండి..
డార్మిటరీల్లో టాయిలెట్లు లేక ఇబ్బందులు పడటం, ప్రయాణాలకు డబ్బులు దొరక్క అల్లాడటం, క్రికెట్ కిట్‌లను పంచుకోవడం నుంచి, ఇప్పుడు.. నిండిన స్టేడియాల్లో ఆడటం, ప్రపంచ కప్ టైటిల్‌ను అందుకోవడం వరకు భారత మహిళల క్రికెట్ అసాధారణమైన ప్రయాణం చేసింది!

డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. మహిళల క్రికెట్‌కు మార్గదర్శకులుగా నిలిచిన శాంతా రంగస్వామి, నూతన్ గవాస్కర్ ఆ ఆటలో వచ్చిన అద్భుతమైన మార్పులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు కష్టాలు, నిర్లక్ష్యం ఎదుర్కొన్న ఈ క్రీడ.. ఇప్పుడు గుర్తింపు, ఆశల కొత్త శకంలోకి ప్రవేశించిందని చెబుతున్నారు.
ఆర్థిక కష్టాలు, పోరాటం..
"డబ్బు లేదు, స్పాన్సర్లు లేరు, విదేశీ పర్యటనలు అంటే ఒక అగ్ని పరీక్షలా ఉండేవి. అయినా సరే, ప్రదర్శన కొనసాగాలని బలంగా నమ్మిన ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు," అని ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూసీఏఐ) వ్యవస్థాపకుల్లో ఒకరైన నూతన్ గవాస్కర్ (మాజీ కార్యదర్శి) తెలిపారు. ఈ డబ్ల్యూసీఏఐ 1973లో ఏర్పడింది.
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెల్లెలు అయిన నూతన్.. ఆటగాళ్లు ఒకప్పుడు కేవలం పట్టుదల, దేశంపై ప్రేమతోనే ఆడారని గుర్తు చేసుకున్నారు.
"మహిళల క్రికెట్ వృత్తిపరమైన క్రీడ కాదని మాతో చెప్పారు. మమ్మల్ని ప్రొఫెషనల్స్‌గా పరిగణించనందున డబ్బు కూడా ఉండేది కాదు," అని ఆమె తెలిపారు.
అంతర్జాతీయ పర్యటనలకు నిధులు సేకరించడం ఒక పెద్ద పోరాటమని ఆమె వివరించారు. న్యూజిలాండ్‌లో ప్రయాణం చేసినప్పుడు ఆటగాళ్లు అక్కడి ఎన్‌ఆర్‌ఐ కుటుంబాల ఇళ్లలో బస చేయడం నుంచి.. ఇంగ్లాండ్ పర్యటనకు విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి నటి మందిరా బేడీ తన వాణిజ్య ఆదాయాన్ని విరాళంగా ఇవ్వడం వరకు అనేక కష్టాలు పడ్డారని తెలిపారు.
"కొన్నిసార్లు ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎయిర్ ఇండియా సంస్థ టికెట్లను స్పాన్సర్ చేసేది," అని ఆమె అన్నారు.
పరికరాల కొరత, పంచుకున్న వసతులు..
క్రికెట్ పరికరాల కొరత తీవ్రంగా ఉండేదని, బ్యాట్‌లను కూడా పంచుకోవాల్సి వచ్చేదని నూతన్ చెప్పుకొచ్చారు. 1970లు, 80ల నాటి ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటూ.. అంతర్రాష్ట్ర మ్యాచ్‌ల్లో కొన్ని జట్ల వద్ద కేవలం మూడు బ్యాట్‌లు మాత్రమే ఉండేవని నూతన్ తెలిపారు.
"వ్యక్తిగత కిట్‌లు కొనడం చాలా ఖరీదైన విషయం. అది ఒక లగ్జరీ! జాతీయ పోటీల్లో నేను దీన్ని చూశాను. మొదట బ్యాటింగ్ చేసే ఇద్దరికి రెండు బ్యాట్లు, మూడో నంబర్ బ్యాట్స్వుమన్కి మరో బ్యాట్ ఉండేది. ఓపెనర్ అవుట్ కాగానే, నాలుగో నంబర్ బ్యాట్స్‌వుమన్ ఆమె బ్యాట్‌ను, లెగ్ గార్డ్స్‌ను తీసుకునేది," అని వివరించారు.
క్రికెటర్లు 36 నుంచి 48 గంటల పాటు సాధారణ కంపార్ట్‌మెంట్లలో రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ రైలు ఛార్జీలు కూడా తమ సొంత జేబుల్లోంచి పెట్టుకునేవారు! “రూమ్‌లలో అటాచిడ్ టాయిలెట్లు ఒక గొప్ప విలాసంలా ఉండేవి! తరచుగా కేవలం నాలుగు వాష్‌రూమ్లు ఉన్న డార్మిటరీల్లో 20 మంది బస చేయాల్సి వచ్చేది. అవి కూడా సరిగ్గా శుభ్రంగా ఉండేవి కావు. స్థానిక అసోసియేషన్లు తక్కువ బడ్జెట్‌తో టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల పెద్ద ప్లాస్టిక్ పాత్రలో పప్పు వడ్డించేవారు,” అని పేర్కన్నారు.
కష్టాలకు దక్కిన ఫలితం..
భారత మహిళల జట్టుకు తొలి టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించిన శాంతా రంగస్వామి.. ఆ తొలి సంవత్సరాలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాయని అన్నారు.
"రిజర్వేషన్ లేని కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించడం నుంచి డార్మిటరీల్లో నేలపై పడుకోవడం వరకు, మేము మా సొంత పరుపులను కూడా మోయాల్సి వచ్చేది. క్రికెట్ కిట్‌లను వీపుపై బ్యాక్‌ప్యాక్‌ల మాదిరిగా, ఒక చేతిలో సూట్‌కేస్‌ను మోసేవాళ్లం," అని ఆమె తెలిపారు.
నేటి భారత మహిళల క్రికెట్ జట్టు విజయం దశాబ్దాల పట్టుదలకు ఫలితమని రంగస్వామి గట్టిగా నమ్ముతున్నారు.
"నేటి తరం ఆటగాళ్లకు అన్ని సదుపాయాలు లభిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారు దానికి అర్హులు. దాదాపు 50 ఏళ్ల క్రితం మేము వేసిన పునాది ఇప్పుడు ఫలాలను ఇస్తోంది," అని ఆమె అన్నారు.
నూతన్, రంగస్వామి వంటి మార్గదర్శకులకు, ఆ నిరాడంబరమైన ప్రారంభం నుంచి నేటి ప్రపంచ కప్ ఫైనల్ వరకు భారత మహిళల క్రికెట్ ఎదగడం అనేది కేవలం క్రీడా పురోగతి మాత్రమే కాదు, తరాల కల నెరవేరడం కూడా!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


