...
...
Next Story

అప్పట్లో రూ. 1.8లక్షల ప్యాకేజీ- ఇప్పుడు రూ. 75లక్షలు! 9ఏళ్లల్లోనే అద్భుతం చేసిన యువకుడి కథ..

సాధారణ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు.. ఐటీ రంగంలో సరైన నిర్ణయాలు, నైపుణ్యాలతో ఏకంగా రూ. 75 లక్షల వార్షిక వేతనాన్ని సాధించాడు. రెడిట్‌లో వైరల్ అయిన ఈ స్ఫూర్తిదాయక కెరీర్ ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకోండి..

Published on: Aug 18, 2026, 06:45:25 IST
Advertisement

రూ. 75 లక్షల వార్షిక ప్యాకేజీని అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. చాలా మంది నిపుణులు ఈ మైలురాయిని చేరుకోవడానికి ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. మరికొందరు తమ కలల వేతనాన్ని అందుకోలేక నిరాశ చెందుతుంటారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక రెడిట్‌లో ఓ యువకుడి కెరీర్ జర్నీ నెట్టింట తెగ వైరలవుతోంది. ఐటీ లేదా ప్రముఖ ఐఐటీ కాలేజీల్లో చదవకుండానే, సాధారణ టైర్-3 కాలేజీ నుంచి వచ్చి ఏడాదికి రూ. 75 లక్షల ప్యాకేజీ సాధించిన వైనం ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తోంది.

9ఏళ్లల్లో రూ. 1.8లక్షల నుంచి రూ. 75లక్షల ప్యాకేజీకి ఎదిగిన యువకుడు!
9ఏళ్లల్లో రూ. 1.8లక్షల నుంచి రూ. 75లక్షల ప్యాకేజీకి ఎదిగిన యువకుడు!

తొలి రోజుల్లో కేవలం రూ. 1.84 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభించానని చెబుతున్న ఈ యువకుడు.. తొమ్మిదేళ్ల కాలంలో ఈ అద్భుత విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నాడో ఇక్కడ చూసేయండి..

రూ. 1.84 లక్షల తొలి జీతం..

బీఎస్​సీ అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అతనికి తొలి వేతనం ఏడాదికి రూ. 1.84 లక్షలు మాత్రమే! తొలి నాలుగేళ్ల పాటు ఆయన జీతంలో వృద్ధి చాలా మందకొడిగా సాగింది. కోవిడ్ మహమ్మారి వ్యాపించే సమయానికి ఆయన వార్షిక వేతనం రూ. 4.5 లక్షలుగా ఉంది.

కరోనా కాలం టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. ఈ సమయంలో ఆయన ‘బిగ్ ఫోర్’ సంస్థలోకి మారి రూ. 8 లక్షల ప్యాకేజీని అందుకున్నారు. ఇది మునుపటి జీతం కంటే దాదాపు 78 శాతం ఎక్కువ కావడం విశేషం.

ఉద్యోగ మార్పులు.. పెరిగిన వేతనం..

పని చేసే వాతావరణం నచ్చకపోవడంతో మరో ఏడాది తర్వాత ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్నారు. ఒకే అవకాశంతో సంతృప్తి చెందకుండా, పలు ఆఫర్లను చేతిలో ఉంచుకుని కంపెనీతో చర్చలు జరిపారు. ఫలితంగా రూ. 17.4 లక్షల ప్యాకేజీ సాధించారు.

స్టార్టప్‌లో చేరిన ఏడాది తిరక్కుండానే ఆయనకు లేఆఫ్ షాక్ తగిలింది. రూ. 42.2 లక్షల వేతనం పోవడంతో కెరీర్ ముగిసిపోయిందని ఆయన కుంగిపోలేదు. ఆ సమయాన్ని తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ఇంటర్వ్యూలకు సిద్ధం కావడానికి అద్భుతంగా ఉపయోగించుకున్నారు.

ఈ కష్టకాలం ఆయనకు మరో మెరుగైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మరో స్టార్టప్‌లో అద్భుతమైన రోల్ దక్కించుకున్న ఆయన, ఏకంగా రూ. 75 లక్షల ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. మునుపటి జీతంతో పోలిస్తే ఇది దాదాపు 77 శాతం వృద్ధి.

ఈ ప్రయాణం మనకు నేర్పే పాఠం ఏంటి?

కేవలం అదృష్టం వల్లే ఆ యువకుడికి ఈ వేతనం రాలేదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, కంపెనీ మారేటప్పుడు తెగింపు ప్రదర్శించడం, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. ఉద్యోగం కోల్పోవడం కెరీర్‌కు ముగింపు కాదని, గట్టిగా ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఈ యువకుడి ప్రయాణం నిరూపిస్తోంది.

(గమనిక- ఇది సోషల్​ మీడియా పోస్టు ఆధారంగా రూపొందించిన కథనం. సదరు వ్యక్తి చెబుతున్నవాటిని వెరిఫై చేయలేకపోయాము.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks