1 లేదా 2 సంవత్సరాలు కెరీర్ బ్రేక్​ తీసుకున్నా.. PF ఖాతాలోని డబ్బుకు వడ్డీ వస్తుందా?

ఉద్యోగానికి విరామం ఇచ్చినప్పుడు పీఎఫ్ ఖాతాలోని డబ్బు ఏమవుతుందోనన్న ఆందోళన చాలామందిలో ఉంటుంది. కొత్త డిపాజిట్లు ఆగిపోయినా పీఎఫ్ సొమ్ముపై వడ్డీ వస్తుందా? ఉపసంహరణ నిబంధనలు, టాక్స్ మినహాయింపుల వంటి విషయాలపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 2, 2026, 12:18:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉన్నత చదువులు, కుటుంబ బాధ్యతలు, లైఆఫ్స్ లేదా ఆరోగ్య సమస్యల కారణంగా చాలామంది తమ కెరీర్‌లో ఏడాది లేదా రెండేళ్ల పాటు విరామం తీసుకుంటుంటారు. అయితే, ఇలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో జమ అయిన సొమ్ము ఏమవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచేస్తుంటుంది.

2ఏళ్ల పాటు కెరీర్​కి బ్రేక్ పడితే.. పీఎఫ్​ ఖాతాకు ఏమవుతుంది?
2ఏళ్ల పాటు కెరీర్​కి బ్రేక్ పడితే.. పీఎఫ్​ ఖాతాకు ఏమవుతుంది?

ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది నిపుణుల మాట. మీరు ఉద్యోగం చేయడం ఆపేసినంత మాత్రాన మీ పీఎఫ్ ఖాతా రద్దైపోదు. అందులోని బ్యాలెన్స్ సురక్షితంగానే ఉంటుంది. కొత్తగా ఎలాంటి డిపాజిట్లు జరగకపోయినా, గతంలో మీరు, మీ పాత యాజమాన్యం జమ చేసిన మొత్తానికి ఈపీఎఫ్ఓ వడ్డీని చెల్లిస్తూనే ఉంటుంది.

ఈపీఎఫ్​ఓ వడ్డీ ఎప్పటివరకు ఇస్తుంది?

ఉద్యోగం మానేసినప్పటికీ చందాదారునికి 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈపీఎఫ్ఓ వడ్డీని చెల్లిస్తూనే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

అయితే, ఒకవేళ మీరు 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చాక ఉద్యోగం నుంచి తప్పుకుంటే మాత్రం గరిష్టంగా 3ఏళ్ల పాటు మాత్రమే వడ్డీ ఇస్తారు. ఆ తర్వాత ఆ ఖాతా ‘ఇనాపరేటివ్’ ఖాతాగా మారి, వడ్డీ రావడం ఆగిపోతుంది.

ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. ఇటీవల, జులై 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 34 కోట్లకు పైగా సభ్యుల ఖాతాల్లో ఈ వడ్డీ సొమ్మును ప్రభుత్వం జమ చేసింది.

సమయం కంటే ముందే పీఎఫ్ విత్‌డ్రా చేస్తే నష్టమా?

గత నెలలో నోటిఫై చేసిన నూతన ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగం పోయిన వెంటనే సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతం సొమ్మును వరుసగా 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

గత నిబంధనలతో పోలిస్తే, ఇప్పుడు విత్‌డ్రా చేసుకునే అర్హత కలిగిన మొత్తంలో ఉద్యోగి విరాళం, యాజమాన్యం విరాళంతో పాటు వచ్చిన వడ్డీ కూడా కలిసి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ సొమ్ము చేతికి వస్తుంది.

అయితే, కెరీర్ బ్రేక్ సమయంలో పీఎఫ్ సొమ్మును తొందరపడి ఉపసంహరించుకుంటే పన్నుల భారం పడే అవకాశం ఉంది.

మీరు కనీసం 5 సంవత్సరాల పాటు నిరంతర సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేస్తే దానికి రూపాయి కూడా పన్ను పడదు.

5ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రిటైర్మెంట్, ఉద్యోగానికి రాజీనామా, అంగవైకల్యం, కంపెనీ మూతపడటం లేదా మరణం వంటి కారణాలతో పీఎఫ్ విత్‌డ్రా చేస్తే.. అసలు, వడ్డీతో సహా మొత్తం సొమ్ముకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఒకవేళ 5 ఏళ్ల సర్వీసు కాకుండానే విత్‌డ్రా చేసుకుంటే పన్ను చెల్లించాల్సి రావచ్చు.

పీఎఫ్ వడ్డీ లేదా క్లెయిమ్ ఆలస్యమైతే ఏం చేయాలి?

కొన్నిసార్లు ఈపీఎఫ్ఓ జమ చేసిన వడ్డీ సొమ్ము పాస్‌బుక్‌లో కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. అర్హత ఉన్న ఖాతాలకు వడ్డీ ఆలస్యమైనా సరే ఖచ్చితంగా జమ అవుతుంది కాబట్టి సభ్యులు కంగారుపడాల్సిన పనిలేదు.

మరోవైపు, మీరు ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా కోసం అప్లై చేస్తే.. కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే సాధారణంగా 7 నుంచి 10 పనిదినాల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ 20 రోజులు దాటినా సెటిల్ కాకపోతే, నేరుగా epfigms.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తు పూర్తిస్థాయిలో సరిగ్గా ఉంటే పీఎఫ్ ఉపసంహరణ, పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను 20 రోజుల్లోగా ఈపీఎఫ్ఓ పరిష్కరించాల్సి ఉంటుంది. తగిన కారణం లేకుండా గడువులోగా క్లెయిమ్ పూర్తి చేయడంలో సంబంధిత అధికారి విఫలమైతే, బాధితుడికి 12 శాతం వార్షిక వడ్డీతో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సదరు కమిషనర్ జీతం నుంచి రికవరీ చేసే నిబంధన కూడా ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More