వయస్సు దాచేస్తున్న టీనేజర్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ పహారా
ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు తప్పుగా నమోదు చేసి అడల్ట్ ఖాతాలు ఉపయోగిస్తున్న టీనేజర్లను గుర్తించేందుకు మెటా సరికొత్త ఏఐ సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తోంది. 13 నుంచి 17 ఏళ్ల వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దవారిగా చెలామణి అయ్యేందుకు తమ పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేస్తున్న టీనేజర్లకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' రంగంలోకి దిగింది. ఖాతాదారుల ప్రవర్తన, ఇతర సంకేతాలను విశ్లేషించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ప్రపంచ దేశాల ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మెటా ఈ దిశగా అడుగులు వేస్తోంది.

టీన్ అకౌంట్స్ రక్షణ వ్యవస్థ
ఈ సరికొత్త ఏఐ పరిజ్ఞానం ద్వారా 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వినియోగదారులు అడల్ట్ అకౌంట్లు వాడుతున్నట్లు తేలితే, వాటిని ఆటోమేటిక్‌గా 'టీన్ అకౌంట్' (Teen Account) కేటగిరీలోకి మారుస్తారు. ఇన్‌స్టాగ్రామ్ 2024 సెప్టెంబర్‌లోనే ఈ టీన్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించింది. దీనివల్ల తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, సున్నితమైన లేదా అశ్లీల కంటెంట్ చూడటంపై పరిమితులు విధించడంతో పాటు స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేలా రిమైండర్లు వస్తాయి. చిన్నపిల్లల ఖాతా సెట్టింగ్‌లు మార్చాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.
ఫేస్‌బుక్, థ్రెడ్స్‌కూ ఏఐ పరిజ్ఞానం
కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం కాకుండా ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి ఏఐ ఆధారిత వయస్సు గుర్తింపు వ్యవస్థను మెటా అందుబాటులోకి తెస్తోంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'థ్రెడ్స్' (Threads) పై కూడా దీనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని తల్లిదండ్రులకు ఈ నెలలోనే ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేక నోటిఫికేషన్లు పంపనుంది. టీనేజర్లను ఎలా గుర్తిస్తున్నాం, ఎలాంటి భద్రతా నిబంధనలు వర్తింపజేస్తున్నామనే వివరాలను అందులో తెలియజేయనుంది.
ఆస్ట్రేలియాలో ఆపిల్ ఏజ్ సిగ్నల్
మరోవైపు ఆస్ట్రేలియాలో ఆపిల్ (Apple) 'ఏజ్-రేంజ్ సిగ్నల్'ను మెటా స్వీకరిస్తోంది. స్మార్ట్‌ఫోన్లలో తల్లిదండ్రులు సెట్ చేసిన వయస్సు వివరాలను యాప్ డెవలపర్లతో యాప్ స్టోర్ పంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. అయితే యాప్ స్టోర్‌లు, డెవలపర్లు అందరూ విధిగా వయస్సు వివరాలను పంచుకునేలా గ్లోబల్ చట్టాలు రావాలని మెటా కోరుతోంది. యాప్ స్టోర్ల స్థాయిలోనే వయస్సు ధ్రువీకరణ, తల్లిదండ్రుల అనుమతి ప్రక్రియ పూర్తయితే ప్రతి యాప్ వేర్వేరుగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడింది.
13 ఏళ్ల లోపు పిల్లల ఖాతాలపై నిషేధం
మెటా నిబంధనల ప్రకారం 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ వాడటానికి అర్హులు కారు. అలాంటి ఖాతాలను గుర్తించి తొలగించేందుకు మెటా ప్రత్యేక సాంకేతికతపై నిధులను వెచ్చిస్తోంది. వివిధ దేశాల్లో వయస్సు ధ్రువీకరణకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు (Government IDs) అడిగే నిబంధనలు ఉన్న నేపథ్యంలో, గ్లోబల్ స్థాయిలో ఆన్‌లైన్ భద్రతను మరింత కఠినతరం చేస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


