Stock market : ఒక్క వారంలోనే రూ. 16 లక్షల కోట్లు ఆవిరి! అదానీ షేర్లు అతలాకుతలం..

ఇన్వెస్టర్లకు భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. అదానీ గ్రూప్ షేర్లలో భారీ అమ్మకాలు, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం వంటి కారణాలతో మదుపర్లు ఏకంగా రూ. 16 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి.

Published on: Jan 24, 2026 4:03 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు భారీ ఎత్తున షేర్ల విక్రయానికి మొగ్గు చూపడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో మార్కెట్లు కుప్పకూలాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్క వారం వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.

స్టాక్​ మార్కెట్​ క్రాష్​తో భారీ నష్టాలు.. (REUTERS)
స్టాక్​ మార్కెట్​ క్రాష్​తో భారీ నష్టాలు.. (REUTERS)

రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి..

శుక్రవారం ట్రేడింగ్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మొదటిసారి 92 మార్కును తాకింది! ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని 91.90 వద్ద ముగిసింది.

రూపాయి బలహీనపడటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

అదానీ గ్రూప్ షేర్ల పతనం..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, అదానీ గ్రూప్ షేర్లలో మొదలైన అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది. అదానీ గ్రూపునకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి సమన్లు వచ్చే అవకాశం ఉందన్న వార్తలే ఇందుకు ప్రధాన కారణమని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీనివల్ల ఒక్క సెషన్‌లోనే అదానీ గ్రూప్ సంస్థలు సుమారు 12.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.

నిఫ్టీ50లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 10.65 శాతం నష్టపోయింది.

సూచీల పరిస్థితి ఇలా..

బీఎస్‌ఈ సెన్సెక్స్: శుక్రవారం 769.67 పాయింట్లు (0.94%) నష్టపోయి 81,537.70 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 835.55 పాయింట్ల వరకు పడిపోయింది. ఈ వారంలో మొత్తం మీద సెన్సెక్స్ 2,032.65 పాయింట్లు (2.43%) నష్టపోయింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ: 241.25 పాయింట్లు (0.95%) కోల్పోయి 25,048.65 వద్ద ముగిసింది. వారీ వారీగా చూస్తే నిఫ్టీ 645.7 పాయింట్లు (2.51%) పతనమైంది.

మార్కెట్ విలువ: శుక్రవారం ఒక్కరోజే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 6.95 లక్షల కోట్లు తగ్గి రూ. 451.56 లక్షల కోట్లకు చేరింది.

మొత్తం మీద ఈ వారంలో ఇన్వెస్టర్ల 16,28,561.85 కోట్ల సంపద ఆవిరైపోయింది.

నష్టపోయిన, లాభపడిన సంస్థలు..

అదానీ పోర్ట్స్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలు భారీ నష్టాలను నమోదు చేశాయి. రియాల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా వెనకపడ్డాయి.

అయితే టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ వంటి సంస్థలు స్వల్ప లాభాలను గడించాయి.

బంగారం, వెండి సరికొత్త రికార్డులు..

ఓవైపు స్టాక్ మార్కెట్లు నష్టపోతుంటే, మరోవైపు బంగారం- వెండి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న అంచనాల వల్ల దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇవి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

స్టాక్​ మార్కెట్​ పతానానికి కారణం ఏంటి? ఈ పతనం ఎప్పుడు ఆగుతుంది? పోర్ట్​ఫోలియోను చూడాలంటేనే భయపడుతున్న ఇన్వెస్టర్లకు ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది? నిపుణులు ఏమంటున్నారు? ఇక్కడ క్లిక్​ చేసి తెలుసుకోండి.