పోర్ట్‌ఫోలియో చూడాలంటేనే గుండె దడదడ! ఈ స్టాక్ మార్కెట్ పతనం ఎప్పుడు ఆగుతుంది?
2026 ప్రారంభంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం దలాల్ స్ట్రీట్‌లో కనిపించడం లేదు. ఈ జనవరిలోనే నిఫ్టీ భారీగా కిందకు పడిపోవడం, ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కుప్పకూలడం మదుపర్లను కలవరపెడుతోంది. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు, రికవరీ ఎప్పుడు ఉండొచ్చనే విశ్లేషణను ఇక్కడ చూడండి..
అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చితే దేశీయ స్టాక్ మార్కెట్ గతేడాది సరిగ్గా రాణించలేదు. నిఫ్టీ, సెన్సెక్స్‌లు స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, స్మాల్‌క్యాప్- మిడ్‌క్యాప్‌లు నెగిటివ్ రిటర్నులు ఇచ్చాయి. వీటి మధ్య కొత్త ఆశలతో 2026లోకి ప్రవేశించిన మదుపర్లకు ఆరంభ లాభాలు ఊరటనిచ్చాయి. కానీ మొదటిలో మదుపర్లలో కనిపించిన ఆశావాదం కొద్ది వారాల్లోనే ఆవిరైపోయింది.

ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ సుమారు 3 శాతం మేర నష్టపోగా.. బ్లూచిప్ షేర్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ దాదాపు 8 శాతం, మిడ్ క్యాప్ 5 శాతం మేర పడిపోయాయి. రోజూ ఏదో ఒక వార్తతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను చూడాలంటేనే భయపడుతున్నారు. అసలు ఈ నష్టాలకు కారణాలంటే? స్టాక్ మార్కెట్ పతనం ఎప్పుడు ఆగుతుంది?
స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలేంటి?
1. అమెరికాతో కుదరని వాణిజ్య ఒప్పందం-
భారత్-అమెరికా మధ్య చాలా కాలంగా సాగుతున్న వాణిజ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇదే విషయంపై భారత్‌పై ఇప్పటికే 50శాతం వరకు టారిఫ్‌లు ఉన్నాయి. ఒప్పందం కుదురితే ఈ సుంకాలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు భావించారు. కానీ గత కొన్ని నెలలుగా భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం వాయిదా పడుతూ వస్తోంది.
ఈ ఒప్పందం మార్చి నాటికి పూర్తవుతుందని వార్తలు వస్తున్నా, ఇరు దేశాల నుంచి స్పష్టత లేదు. మార్కెట్లకు ఇలాంటి 'అస్పష్టత' ఏమాత్రం నచ్చదు.
2. కార్పొరేట్ లాభాల మందగమనం-
కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం మరో ప్రధాన కారణం. గత కొన్ని త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయ వృద్ధి నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక ఫలితాల సీజన్ ముగిసేవరకు మదుపర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. పూర్తిస్థాయిలో లాభాల రికవరీ రావడానికి మరికొన్ని త్రైమాసికాలు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
3. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు-
వెనెజువెలాలో అమెరికా చర్యలు, గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో, సప్లై- చైన్ వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలుగుతుందో అన్న భయాలు నెలకొన్నాయి.
4. ఎఫ్ఐఐలు, రూపాయి-
పైన చెప్పిన అన్ని అంశాలు ఇండియాలో విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నాయి. అదే సమయంలో రూపాయి కూడా బలహీనపడుతూ వస్తుండటంతో పరిస్థితులు మరింత క్లిష్ఠంగా మారాయి. స్టాక్ మార్కెట్ పతనమవుతోంది.
స్టాక్ మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుంది?
మార్కెట్ రికవరీ సమయాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమే! కానీ కోలుకోవడం మాత్రం ఖాయం అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రధాన బలం దేశీయ సంస్థాగత మదుపర్ల (డీఐఐ) నుంచి అందుతున్న పెట్టుబడులు.
మింట్ నివేదిక ప్రకారం.. 2025లో విదేశీ మదుపర్లు రూ.1.66 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నా, దేశీయ మదుపర్లు ఏకంగా రూ.7.44 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి మార్కెట్ కుప్పకూలకుండా కాపాడారు.
మార్కెట్ మళ్లీ పుంజుకోవాలంటే ప్రధానంగా రెండు అంశాలు జరగాలి:
విదేశీ పెట్టుబడుల (ఎఫ్ఐఐ) ప్రవాహం మళ్లీ మొదలవ్వాలి.
కంపెనీల ఆదాయ వృద్ధి వేగం పుంజుకోవాలి. వీటితో పాటు యూనియన్ బడ్జెట్, అమెరికా వాణిజ్య ఒప్పందం కూడా మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ఇన్వెస్టర్లు మార్కెట్ గమనాన్ని ప్రతిక్షణం ఊహించి ఆందోళన చెందడం కంటే, 'క్వాలిటీ' షేర్లను ఎంచుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థతో పాటు మార్కెట్లు కూడా వృద్ధి చెందుతాయని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
మీ వద్ద ఉన్న షేర్ల విషయంలో మీకు అనుమానం ఉంటే ఈ ప్రశ్నలు వేసుకోండి:
కంపెనీ పునాదులు బలహీనంగా ఉన్నాయా?
కంపెనీ లాభాల్లో ఏవైనా ప్రతికూల మార్పులు వచ్చాయా?
ఆదాయం పెరగకుండానే పీఈ రేషియో విపరీతంగా పెరిగిందా?
కొనేటప్పుడు విశ్లేషణలో ఏమైనా పొరపాటు జరిగిందా?
వీటికి సమాధానం 'అవును' అయితే.. ఆ షేర్లను వదిలించుకోవడం మేలు. ఒకవేళ సమాధానం 'కాదు' అయితే, వాటిని అలాగే ఉంచుకోవచ్చు. మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరలో దొరికినప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.

E-Paper












