iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రోలో భారీ మార్పులు.. యాపిల్ కొత్త వ్యూహం ఇదే!

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో యాపిల్ వినూత్న డిజైన్‌ను తీసుకొస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. డిస్‌ప్లే కింద సెన్సార్లను అమర్చడం ద్వారా డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని తగ్గించి, ఫోన్ లుక్‌ను పూర్తిగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Jan 17, 2026 6:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాపిల్ తన ప్రతి కొత్త ఐఫోన్ జనరేషన్‌తో డిజైన్ పరంగా ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూనే ఉంది. ఐఫోన్ 14 ప్రోలో పాత నాచ్ స్థానంలో 'డైనమిక్ ఐలాండ్'ను ప్రవేశపెట్టగా, ఐఫోన్ 15 ప్రోలో ప్రీమియం టైటానియం ఫ్రేమ్‌ను వాడింది. ఇక ఐఫోన్ 17 ప్రో విషయానికొస్తే.. కెమెరా ప్యానెల్‌లో మార్పులతో పాటు మళ్లీ అల్యూమినియం బాడీని తీసుకొచ్చింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే, తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను యాపిల్ దశలవారీగా ఎలా అప్‌డేట్ చేస్తోందో అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది లాంచ్​ అయ్యే ఐఫోన్​ 18 సిరీస్​లో కూడా యాపిల్​ సంస్థ భారీ మార్పులు చేయబోతోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రో మోడల్స్​కి సంబంధించి ఇప్పుడు కొన్ని లీక్స్​ బయటకు వచ్చాయి.

ఐఫోన్​ 17 మోడల్స్​తో యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​.. (REUTERS)
ఐఫోన్​ 17 మోడల్స్​తో యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​.. (REUTERS)

ఐఫోన్ 18 ప్రోలో భారీ మార్పులు..!

ఈ ఏడాది రాబోయే ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్ సరికొత్త డిజైన్‌తో అలరించనున్నాయని తాజా లీకులు చెబుతున్నాయి. ప్రముఖ చైనీస్ లీకర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' సమాచారం ప్రకారం.. యాపిల్ ప్రస్తుతం డిస్‌ప్లే కింద కటౌట్ ఏరియాపై పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే, స్క్రీన్ పైన కనిపించే డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని మరింత తగ్గించి, ఫేస్ ఐడీకి సంబంధించిన కీలక సెన్సార్లను స్క్రీన్ లోపల అమర్చాలని కంపెనీ భావిస్తోంది.

ఇదే జరిగితే స్మార్ట్​ఫోన్ డిస్‌ప్లే మరింత క్లీన్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇక కొత్త టెక్నాలజీని ముందుగా 'ప్రో' మోడల్స్‌లోనే ప్రవేశపెట్టే తన పాత పద్ధతినే యాపిల్ ఈసారి కూడా కొనసాగించనుంది. ఐఫోన్ 18 స్టాండర్డ్ మోడల్, అలాగే ఐఫోన్ ఎయిర్ 2 ఫోన్లలో పాత డిజైనే ఉండే అవకాశం ఉంది. అంటే, అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ సిస్టమ్ కేవలం ప్రో వెర్షన్లకే పరిమితం కావచ్చు. ఫేస్ ఐడీకి ఆధారమైన ట్రూ డెప్త్ కెమెరా సిస్టమ్ మొత్తాన్ని స్క్రీన్ కిందకు తీసుకెళ్లడం ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తోనే మొదలయ్యేలా కనిపిస్తోంది.

విస్తరిస్తున్న ఐఫోన్ లైనప్..

యాపిల్ తన ఐఫోన్ శ్రేణిని మరింత పెంచుతోంది. ఇప్పటికే ఉన్న మోడల్స్​కు అదనంగా 'ఐఫోన్ ఎయిర్'ను చేర్చింది. అలాగే ఈ ఏడాది చివరిలో ‘ఐఫోన్ ఫోల్డ్’ కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు ప్రో మోడల్స్, ఒక స్టాండర్డ్ వెర్షన్, ఐఫోన్ ఎయిర్, ఫోల్డబుల్ డివైజ్‌తో యాపిల్ ప్రొడక్ట్ లిస్ట్ ఇప్పుడు చాలా పెద్దగా మారుతోంది.

అంతేకాకుండా, ఐఫోన్ విడుదలైన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2027లో ఐఫోన్ డిజైన్‌ను పూర్తిగా మార్చేయాలని యాపిల్ యోచిస్తున్నట్లు సమాచారం.

2017లో ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ ఎక్స్​ (10)ను విడుదల చేసినట్లుగానే.. 2027లో సరికొత్త బాడీ డిజైన్ తో ఐఫోన్ 20ని తీసుకురావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొత్తం మీద ఐఫోన్ 18 ప్రోలో రాబోయే ఈ మార్పులు భవిష్యత్తులో ఐఫోన్ల రూపురేఖలను ఏ విధంగా మార్చబోతున్నాయో వేచి చూడాలి.