యాపిల్ లవర్స్‌కి షాక్.. ఈ ఏడాది ఐఫోన్ 18 లాంచ్ లేనట్టేనా?
యాపిల్ తన ఐఫోన్ లాంచ్ షెడ్యూల్‌లో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. 2026లో స్టాండర్డ్ ఐఫోన్ 18 విడుదల కాకపోవచ్చు. దీనివల్ల ఐఫోన్ 17 సుమారు 18 నెలల పాటు మార్కెట్‌లో స్టాండర్డ్ మోడల్‌గా కొనసాగే అవకాశం ఉంది.
ప్రతి ఏటా సెప్టెంబర్ నెల రాగానే టెక్ ప్రపంచమంతా యాపిల్ కొత్త ఐఫోన్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంది. దశాబ్ద కాలంగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది దిగ్గజ టెక్ సంస్థ. అయితే, 2026లో ఈ ఆనవాయితీకి బ్రేక్ పడేలా కనిపిస్తోంది! యాపిల్ తన అప్ కమింగ్ మోడల్ 'ఐఫోన్ 18' స్టాండర్డ్ వెర్షన్‌ను 2026లో కాకుండా, 2027లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రో మోడల్స్ యథాతథం.. మార్పు కేవలం బేస్ మోడల్‌కే!
నివేదికల ప్రకారం.. యాపిల్ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లను మాత్రం అనుకున్న సమయానికే, అంటే 2026 సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. కేవలం సాధారణ ఐఫోన్ 18 లాంచ్‌ను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా యాపిల్ ప్రతి ఏడాది కొత్త మోడల్‌ను పరిచయం చేస్తుంది. గతంలో ఐఫోన్ 4, 4ఎస్ మధ్య మాత్రమే 15 నెలల గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే, ఐఫోన్ 17 దాదాపు 18 నెలల పాటు మార్కెట్‌లో యాపిల్ ప్రధాన 'స్టాండర్డ్' మోడల్‌గా కొనసాగుతుంది. ఇది యాపిల్ చరిత్రలోనే ఒక అరుదైన పరిణామం కానుంది.
కొన్ని వార్తల ప్రకారం.. 2027 మార్చ్- మే నెలలో ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ 18ఈ, సెకండ్ జనరేషన్ ‘ఐఫోన్ ఎయిర్’లను కలిపి విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో ఐఫోన్ 16ఈ విషయంలోనూ యాపిల్ ఇటువంటి విభిన్న సమయాల వ్యూహాన్నే అనుసరించింది.
ఐఫోన్ 18ని యాపిల్ ఎందుకు వాయిదా వేస్తోంది?
ఈ ఆలస్యం వెనుక ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి:
ఖర్చుల నియంత్రణ: ఐఫోన్ 18 కోసం యాపిల్ కొత్త 2-నానోమీటర్ ప్రాసెసర్‌ను ఉపయోగించనుంది. దీని తయారీ ఖర్చు చాలా ఎక్కువ. లాంచ్‌ను కొంచెం వాయిదా వేయడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.
మార్కెట్ మేనేజ్‌మెంట్: ప్రస్తుతం యాపిల్ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. అన్నింటినీ ఒకేసారి కాకుండా, విడతల వారీగా విడుదల చేయడం ద్వారా అమ్మకాలను ఎక్కువ కాలం కొనసాగించవచ్చని యాపిల్ ప్లాన్ చేస్తోంది.
అయితే ఈ విషయాలపై యాపిల్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఐఫోన్ ప్రియులు ఈ లీక్స్‌ను ప్రస్తుతానికి ఒక అంచనాగా మాత్రమే చూడాలి.
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ ధరలు..
యాపిల్ నుంచి రాబోయే ఐఫోన్ 18 సిరీస్ ధరల గురించి కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. 2026లో విడుదల కానున్న ఐఫోన్ కొత్త మోడళ్ల ధరలను పెంచే ఆలోచనలో యాపిల్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్‌తో ధరలను సవరించిన కంపెనీ, మరోసారి ధరల పెంపుతో కస్టమర్లను దూరం చేసుకోవాలని భావించడం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
2025లో విడుదలైన ఐఫోన్ 17 ప్రో ధరలు పెరిగినప్పటికీ, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రారంభ ధరను యాపిల్ 1,199 డాలర్ల వద్దే స్థిరంగా ఉంచింది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కంటే తన ఫోన్ ధర తక్కువగా ఉండాలనే వ్యూహంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రాబోయే రోజుల్లో శాంసంగ్ వంటి ప్రత్యర్థి బ్రాండ్లు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలను పెంచితే, యాపిల్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.
మన దేశంలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఇప్పటికే సామాన్యులకు భారంగా మారాయి. గత మోడళ్లతో పోలిస్తే ధరల్లో వచ్చిన మార్పులు ఇలా ఉన్నాయి:
ఐఫోన్ 17: బేస్ వేరియంట్ (256జీబీ) ధర రూ. 82,900గా ఉంది. ఇది ఐఫోన్ 16 ప్రారంభ ధర (రూ. 79,900) కంటే ఎక్కువ.
ఐఫోన్ 17 ప్రో: దీని ధర భారీగా పెరిగి రూ. 1,34,900కి చేరింది. గతంలో ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900 మాత్రమే ఉండేది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్: గతేడాది రూ. 1,44,900గా ఉన్న దీని ధర, ఇప్పుడు రూ. 1,49,900కి పెరిగింది.
భారత మార్కెట్‌లో ఇప్పటికే ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్ ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 సిరీస్ ధరలను పెంచితే కొనుగోలుదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉందని యాపిల్ భావిస్తోంది. అందుకే కస్టమర్ల ఆసక్తిని నిలుపుకోవడానికి ధరలను స్థిరంగా ఉంచే ఛాన్స్ ఉంది.
అయితే, ధరల వ్యూహంపై యాపిల్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. లాంచ్ సమయానికి ఉండే అంతర్జాతీయ పరిణామాలు, విడిభాగాల లభ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఐఫోన్ ప్రియులు మాత్రం ధరలు పెరగకూడదని కోరుకుంటున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


