iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో స్మార్ట్ఫోన్లు.. ఇండియాలో ప్రీ-ఆర్డర్లు ఎప్పుడు? డెలివరీ ఎప్పుడు?
యాపిల్ తన నూతన ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్, మొదటి ఫోల్డెబుల్ ఐఫోన్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ-ఆర్డర్లు, డెలివరీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దిగ్గజ యాపిల్ సంస్థ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 18 ప్రో, కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా వస్తున్న ఫోల్డెబుల్ ఐఫోన్‌లను సెప్టెంబర్ 9న లాంచ్ చేయనున్నట్లు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ నివేదించింది. అయితే దీనిపై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయని నిపుణులు పేర్కొన్నారు.

అధికారిక ప్రకటన ఎప్పుడంటే..
యాపిల్ తన సెప్టెంబర్ ఈవెంట్‌కు సుమారు రెండు వారాల ముందు తేదీని ప్రకటిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25 లేదా 26 తేదీలలో లాంచ్ ఈవెంట్ తేదీని వెల్లడించే అవకాశం ఉందని ఫోర్బ్స్ తెలిపింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈ ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
ప్రీ-ఆర్డర్లు, విక్రయాల తేదీలు (అంచనా)..
యాపిల్ సాధారణంగా లాంచ్ ఈవెంట్ జరిగిన తర్వాత వచ్చే శుక్రవారం నుంచి ప్రీ-ఆర్డర్లను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 9న ఈవెంట్ జరిగితే సెప్టెంబర్ 11న ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కావాలి. అయితే సెప్టెంబర్ 11న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై జరిగిన ఉగ్రదాడికి 25 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా, ప్రీ-ఆర్డర్ తేదీని శనివారం, సెప్టెంబర్ 12కి మార్చే అవకాశం ఉందని ఫోర్బ్స్ నివేదించింది. గతంలో 2015లో కూడా ఇలాంటి సందర్భంలో యాపిల్ ప్రీ-ఆర్డర్ తేదీలను శనివారానికి మార్చింది.
నివేదికల ప్రకారం షెడ్యూల్ (అంచనా) ఇలా ఉంది:
సెప్టెంబర్ 9: ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ ఈవెంట్
సెప్టెంబర్ 11 లేదా 12: ప్రీ-ఆర్డర్ల ప్రారంభం
సెప్టెంబర్ 18: రిటైల్ స్టోర్లలో లభ్యత, డెలివరీలు ప్రారంభం
భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు?
భారత్‌లో లాంచ్ తేదీ గురించి యాపిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల కాలంలో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారతదేశంలోనూ దాదాపు ఒకే సమయంలో విడుదల చేస్తోంది. భారత్ కూడా తొలి విడత లాంచ్ జాబితాలో ఉంటే దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా అమెరికాతో పాటు సెప్టెంబర్ 18 నాటికి తమ ఐఫోన్లను అందుకునే అవకాశం ఉంది. అయితే స్టాక్ లభ్యత, వేరియంట్లను బట్టి డెలివరీ సమయాల్లో మార్పులు ఉండవచ్చని గుర్తుపెట్టుకోవాలి.
సెప్టెంబర్ 9నే ఎందుకు ఎంచుకోవచ్చు?
యాపిల్ గత ఐదు సంవత్సరాలుగా సెప్టెంబర్‌లోనే తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌లను శుక్రవారాల్లో విడుదల చేస్తూ వస్తోంది. ఐఫోన్ 17 సెప్టెంబర్ 19, 2025న రాగా, ఐఫోన్ 16 సెప్టెంబర్ 20, 2024న, ఐఫోన్ 15 సెప్టెంబర్ 22, 2023న విడుదలయ్యాయి. సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ చేయడం ద్వారా ఇతర ప్రత్యర్థి కంపెనీల ఫోన్ లాంచ్‌ల నుంచి మీడియా దృష్టిని తమ వైపునకు తిప్పుకోవడానికి యాపిల్‌కు ఇది వ్యూహాత్మకంగా కలిసొస్తుందని ఫోర్బ్స్ పేర్కొంది. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు జరగనున్న ఐఎఫ్‌ఏ బెర్లిన్ టెక్ వేడుక ముగిసిన వెంటనే ఈ ఈవెంట్ ఉండటం గమనార్హం.
స్టాండర్డ్ ఐఫోన్ 18 సంగతేంటి?
సాధారణ ఐఫోన్ 18 మోడల్‌ను మాత్రం యాపిల్ ఈసారి సెప్టెంబర్ సైకిల్ నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. స్టాండర్డ్ ఐఫోన్ 18ను 2027 వసంతకాలంలో (స్ప్రింగ్) మార్కెట్లోకి తీసుకురావొచ్చని, కేవలం ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్, ఫోల్డెబుల్ ఐఫోన్‌లు మాత్రమే సెప్టెంబర్ 2026 ఈవెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


