SIR verification : ‘సర్​’ పేరుతో ఫోన్ కాల్స్- వివరాలిస్తే మోసపోయినట్టే! డబ్బులు ఉఫ్​.. తస్మాత్ జాగ్రత్త

SIR scam alert : సర్ వెరిఫికేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓటర్లను మోసం చేస్తూ రూ. లక్షలు కాజేస్తున్నారు. నకిలీ లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Aug 24, 2026, 05:59:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'అది ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాము, మీ వివరాలు చెప్పండి,' అని మీకు ఫోన్ కాల్ వస్తే.. తస్మాత్ జాగ్రత్త! వారు చెప్పే మాటలు నమ్మి పొరపాటున కూడా వివరాలు చెప్పకండి! ఇటీవల పుణెకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తన సర్ డేటాలో కొన్ని సవరణలు చేయాలని కాలర్ చెప్పడంతో రూ. 4.98 లక్షలు పోగొట్టుకున్నారు. మరొక ఘటనలో బెంగళూరుకు చెందిన 82 ఏళ్ల వ్యక్తి ఇదే తరహా మోసంలో రూ. 3.49 లక్షలు నష్టపోయారు. ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నాయంటూ బెదిరించి, సైబర్ నేరగాళ్లు ఈ తరహా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

‘సర్​’ పేరుతో ఫోన్ కాల్స్- వివరాలిస్తే మోసపోయినట్టే! (Photo: ChatGPT (AI Generated for Representational Purpose Only))
‘సర్​’ పేరుతో ఫోన్ కాల్స్- వివరాలిస్తే మోసపోయినట్టే! (Photo: ChatGPT (AI Generated for Representational Purpose Only))

దేశంలోని అనేక నగరాల్లో సర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఈ రకమైన నకిలీ కాల్స్ బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం.

అసలు ఈ మోసం ఎలా జరుగుతుంది?

తాము ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులమనో, బూత్ లెవెల్ ఆఫీసర్లమనో (బీఎల్​ఓ) చెబుతూ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. మీ ఫారమ్‌లోని వివరాలు రికార్డులతో సరిపోలడం లేదని, మీ సర్ ఫారమ్ తిరస్కరణకు గురైందని నమ్మిస్తారు. ఓటర్ల జాబితా నుంచి మీ పేరు తొలగిపోతుందనే భయాన్ని సృష్టించి తక్షణమే స్పందించేలా చేస్తారు.

అనంతరం సమస్యను పరిష్కరిస్తామంటూ వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్ రీ-వెరిఫికేషన్ లింక్ లేదా ఏపీకే ఫైల్‌ను పంపిస్తారు. ఆ విశ్వసనీయత కోసం నెట్‌బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా నామమాత్రపు ఫీజు చెల్లించమంటారు. మరికొందరు నేరుగా బ్యాంక్ క్రిడెన్షియల్స్, ఓటీపీలు అడుగుతారు. మీరు గమనించే లోపే మీ ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయి.

సురక్షితంగా ఉండటం ఎలా?

సర్ సేవలు పూర్తిగా ఉచితం. అధికారులు ఎప్పుడూ బ్యాంకింగ్ వివరాలు, కార్డ్ వివరాలు, ఓటీపీలు లేదా ఏటీఎం పిన్‌లను అడగరు.

తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌లలో వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దు, ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.

ఎటువంటి సమాధానం ఇచ్చే ముందు, అధికారిక ఈసీఐ వెబ్‌సైట్ లేదా స్థానిక బీఎల్‌వో ద్వారా సమాచారాన్ని స్వయంగా ధృవీకరించుకోండి. కాల్ చేసిన వారు ఇచ్చిన లింక్‌లు లేదా నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు.

ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఆర్థిక వివరాలు పంపిస్తే, వెంటనే మీ బ్యాంకును సంప్రదించి కార్డ్‌లను బ్లాక్ చేయించండి లేదా నెట్‌బ్యాంకింగ్‌ను నిలిపివేయండి.

ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More