DC vs RR : దిల్లీ చేతిలో రాజస్థాన్ ఘోర పరాజయం.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
RR vs Delhi : దిల్లీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డీసీ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. కాగా ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, దిల్లీ జట్ల ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో చూడండి..
ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతోంది! ఆదివారం రాత్రి దిల్లీలో జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) పై దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్‌ల హాఫ్ సెంచరీల సహాయంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్.. ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అందించిన అద్భుత భాగస్వామ్యం, చివర్లో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి!

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఉండగా, దిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లకు చేరుకుంది. ఈ రెండు జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు ఎలా అర్హత సాధిస్తుంది?
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం:
రెండు మ్యాచ్‌లు గెలిస్తే: రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లలో లక్నో సూపర్ జాయింట్స్, ముంబై ఇండియన్స్‌పై ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలోనూ విజయం సాధిస్తే ఆర్ఆర్ ఖాతాలో 14 మ్యాచ్‌లకు గాను 16 పాయింట్లు చేరుతాయి. అయితే, ఇదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో గెలిచి, చెన్నై సూపర్ కింగ్స్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిచి, గుజరాత్ టైటాన్స్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే.. ఈ మూడు జట్లు కూడా 16 పాయింట్లతోనే నిలుస్తాయి. అలాంటి పరిస్థితి వస్తే నెట్ రన్ రేట్ ఆధారంగా ఏ జట్టు ప్లేఆఫ్స్ వెళ్తుందనేది నిర్ణయిస్తారు.
ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే: ఒకవేళ రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు ఆర్ఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇతర జట్లు కూడా 14 పాయింట్ల వద్దే నిలిస్తే, అక్కడ కూడా నెట్ రన్ రేట్ కీలకం కానుంది.
దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ సమీకరణాలు ఏంటి?
రాజస్థాన్‌పై గెలిచిన తర్వాత దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ సమీకరణం చాలా స్పష్టంగా ఉంది. దిల్లీ జట్టు గ్రూప్ స్టేజ్‌లో తమ చివరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ ఖచ్చితంగా, భారీ రన్ రేట్‌తో గెలవాలి. అలా గెలిచినప్పటికీ, దిల్లీ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ అనేది పూర్తిగా మిగిలిన జట్ల మ్యాచ్ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా నెట్ రన్ రేట్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
10 జట్లల్లో ప్రస్తుతం ఆర్సీబీ మాత్రమే ప్లేఆఫ్స్ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంది.
ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏమన్నాడంటే..
"నిజానికి 14 ఓవర్ల వరకు మేము చాలా మంచి పొజిషన్ లో ఉన్నాము. కానీ నేను అవుట్ అయిన తర్వాత, మేము ఆ ఇన్నింగ్స్‌ను సరిగ్గా ముగించలేకపోయాము. ఈ పిచ్‌పై మా స్కోరు కనీసం 220-230 పరుగులు ఉండాల్సింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే, మా ప్రదర్శన అస్సలు బాలేదు, మేము ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదు," అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


