Budget 2026 : ట్రేడర్స్, ఇన్వెస్టర్స్‌కి అలర్ట్! ఈ రోజు ఓపెన్లోనే స్టాక్ మార్కెట్లు..
కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఫిబ్రవరి 1 ఆదివారం నాడు భారత స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల కోసం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడింగ్ సెషన్లను ప్రకటించాయి. మార్కెట్ ఒడిదుడుకులపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా ఆదివారం వచ్చిందంటే దలాల్ స్ట్రీట్ నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఈసారి సీన్ మారనుంది. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఫిబ్రవరి 1, ఆదివారం నాడు స్టాక్ మార్కెట్లు ఓపెన్‌లో ఉండనున్నాయి. ఈ మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశాయి.

గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. 2026లో కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడం గమనార్హం. 1999 తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెడుతుండటం ఇదే తొలిసారి. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు బడ్జెట్‌ను సమర్పించారు. అప్పుడు కూడా మార్కెట్లు పనిచేశాయి.
"కేంద్ర బడ్జెట్ సమర్పణ దృష్ట్యా, ఫిబ్రవరి 01, 2026న స్టాండర్డ్ మార్కెట్ సమయాల ప్రకారం (ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు) లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాము," అని ఎన్ఎస్ఈ తన సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే, ఆ రోజు సెటిల్మెంట్ హాలిడే కావడంతో 'టీ+0' సెటిల్మెంట్ సౌకర్యం అందుబాటులో ఉండదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది.
కమోడిటీ మార్కెట్ పరిస్థితి ఏంటి?
స్టాక్ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్ కూడా ఆదివారం ఉదయం సెషన్‌లో ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఎంసీఎక్స్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. బడ్జెట్ సందర్భంగా ఫిబ్రవరి 1న ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ జరుగుతుంది.
కమోడిటీ మార్కెట్ సమయాలు:
స్పెషల్ సెషన్: ఉదయం 08:45 – 08:59 గంటల వరకు
ట్రేడింగ్ సెషన్: ఉదయం 09:00 – సాయంత్రం 05:00 గంటల వరకు
క్లయింట్ కోడ్ మాడిఫికేషన్ సెషన్: సాయంత్రం 05:15 గంటల వరకు
ట్రేడింగ్ వ్యూహంపై నిపుణుల హెచ్చరిక..
బడ్జెట్ రోజున ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
"భారత మార్కెట్లకు బడ్జెట్ రోజు అనేది అత్యంత అస్థిరతతో కూడిన సమయం. ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది," అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా విశ్లేషించారు.
శుక్రవారం మార్కెట్ ముగింపు ఇలా..
బడ్జెట్ 2026కి ముందు చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు భారత మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 297 పాయింట్లు పడి 82,270 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 98 పాయింట్లు కోల్పోయి 25,321 వద్దకు చేరింది.
మెటల్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు వెనక్కి తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు మార్కెట్‌కు కొంత అండగా నిలిచాయి.

E-Paper












