Budget 2026 : ఈ ఆదివారమే బడ్జెట్- మరి స్టాక్ మార్కెట్లు ఓపెన్‌లో ఉంటాయా?
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ అనేది ఆదివారం వచ్చింది. మరి ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఓపెన్‌లో ఉంటాయా? ఉంటే, ఎలాంటి స్ట్రాటజీని అనుసరించాలి? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రతియేటా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి కూడా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026ని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి ఫిబ్రవరి 1 అనేది ఆదివారం వచ్చింది. బడ్జెట్ అనేది దేశంతో పాటు స్టాక్ మార్కెట్లకు కూడా చాలా కీలకమైన విషయం. ఈ నేపథ్యంలోనే, సాధారణంగా ఆదివారం నాడు సెలవులో ఉండే స్టాక్ మార్కెట్లకు ఈసారి పనిచేస్తాయా? అన్న సందేహాలు ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఎన్‌ఎస్‌ఈ, బీఎస్ఈలు స్పందించాయి. ఫిబ్రవరి 1, ఆదివారం, బడ్జెట్ 2026 నాడు స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని అధికారికంగా ప్రకటించాయి.
బడ్జెట్ 2026- స్టాక్ మార్కెట్ సమయాలు..
యూనియన్ బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్‌ఎస్‌ఈ సర్క్యులర్ ప్రకారం.. ఆ రోజు, మార్కెట్లు సాధారణ సమయాల్లోనే (ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు) పనిచేస్తాయి. ప్రీ-ఓపెన్ మార్కెట్ ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై 9:08కి ముగుస్తుంది.
బడ్జెట్ రోజున ట్రేడింగ్ ఎలా చేయాలి?
బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవ్వడం సాధారణమైన విషయం. అందుకే, ఈ వోలటైల్ సెషన్‌లో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ హితేష్ టైలర్ మాట్లాడుతూ.. "బడ్జెట్ ఆదివారం ఉండటం, ఇండియా విక్స్ 14.45కు పెరగడం వల్ల మార్కెట్‌లో భారీ ఇంట్రాడే స్వింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఆప్షన్ ప్రీమియంలు ఖరీదుగా ఉన్నందున, బడ్జెట్ ప్రసంగం తర్వాత ఉండే 'వోలటైలిటీ క్రష్'ను లాభంగా మార్చుకోవాలి," అని తెలిపారు.
హితేష్ టైలర్ సూచించిన 'ఐరన్ కాండర్' వ్యూహం:
25,700 కాల్ ఆప్షన్, 25,000 పుట్ ఆప్షన్‌లను అమ్మాలి.
రక్షణ కోసం 25,900 కాల్- 24,800 పుట్ ఆప్షన్‌లను కొనుగోలు చేయాలి. ఇది నిఫ్టీ 25,000 నుంచి 25,700 మధ్య ఉన్నంతవరకు గరిష్ట లాభాన్ని ఇస్తుంది. ఈ పొజిషన్లను జనవరి 30, శుక్రవారం మధ్యాహ్నమే తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు.
వ్యూహం ఫలితాలు (ఫిబ్రవరి 3 ఎక్స్‌పైరీ నాటికి):
నిఫ్టీ 25,000 – 25,700: గరిష్ట లాభం.
25,701 – 25,900: లాభం తగ్గుతూ వస్తుంది.
25,900 పైన: గరిష్ట నష్టం (పరిమితం అవుతుంది).
24,801 – 24,999: లాభం పెరుగుతూ వస్తుంది.
24,800 కంటే తక్కువ: గరిష్ట నష్టం (పరిమితం అవుతుంది).
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ విశ్లేషణ ప్రకారం.. సాధారణంగా బడ్జెట్ ప్రసంగం ముగిశాక అనిశ్చితి తొలగిపోయి విక్స్ పడిపోతుంది. గత 15 ఏళ్లలో, 2020లో మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుతం విక్స్ తక్కువగానే ఉన్నందున, మార్కెట్ రేంజ్ పెరిగే అవకాశం ఉందని, తద్వారా 'లాంగ్ స్ట్రాడిల్' వ్యూహాలు కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
క్రమశిక్షణతో కూడిన రిస్క్ మేనేజ్మెంట్, వ్యూహాత్మక ఆప్షన్ ట్రేడింగ్ ద్వారానే ఈ సెషన్‌లో విజయం సాధించవచ్చని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


