Mutual fund SIP : మ్యూచువల్​ ఫండ్ ఎస్​ఐపీ​లో లాభాలే కనిపించడం లేదా? పెట్టుబడి ఆపేయాలా?

మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీల్లో తొలి రెండేళ్లపాటు నష్టాలు వచ్చినా ఆందోళన చెంది పెట్టుబడులు ఆపాల్సిన అవసరం లేదని ఫోన్‌పే షేర్.మార్కెట్ నివేదిక స్పష్టం చేసింది. గత 20 ఏళ్ల నిఫ్టీ 500 టీఆర్​ఐ డేటా ప్రకారం, ప్రారంభంలో బలహీనంగా ఉన్నప్పటికీ 5ఏళ్ల పాటు కొనసాగించిన 10 ఎస్‌ఐపీల్లో 7 రెండంకెల రాబడిని అందించాయి.

Published on: Sep 8, 2026, 05:59:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెండేళ్లుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ వేస్తున్నప్పటికీ పైసా లాభం రాలేదా? పైగా పెట్టిన పెట్టుబడి తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నారా? ఇలాంటి సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలని లేదా ఇన్వెస్ట్​మెంట్​ని ఆపేయాలని భావిస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు అని మార్కెట్​ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మ్యూచువల్​ ఫండ్ ఎస్​ఐపీ ఆపేయాలా?
మ్యూచువల్​ ఫండ్ ఎస్​ఐపీ ఆపేయాలా?

ఫోన్‌పేకి చెందిన 'షేర్.మార్కెట్' సంస్థ విడుదల చేసిన క్రెడిట్ అండ్ రీసెర్చ్ ఐడియాస్ (క్రిస్ప్) జూన్ 2026 మ్యూచువల్ ఫండ్ స్కోర్‌కార్డ్ నివేదిక పెట్టుబడిదారులకు కళ్లు తెరిపించే నిజాలను వెల్లడించింది. గత 20ఏళ్ల నిఫ్టీ 500 టీఆర్​ఐ (టోటల్ ఇండెక్స్ రిటర్న్) రోలింగ్ రిటర్నులను విశ్లేషించిన ఈ నివేదిక ప్రకారం.. మొదట్లో నిరాశపరిచిన ఎస్‌ఐపీలే ఆ తర్వాత ఊహించని స్థాయిలో లాభాలను కురిపించాయని తేలింది.

తొలి రెండేళ్లలో నష్టాలు లేదా అతి తక్కువ లాభాలు ఇచ్చిన ఎస్‌ఐపీల్లో.. ఏకంగా 10లో 7 ఎస్‌ఐపీలు (70 శాతం) ఐదేళ్లు పూర్తియ్యేసరికి ఏటా రెండంకెల వార్షిక రిటర్నులను అందించాయట!

రెండేళ్లలో ఎస్‌ఐపీ రిటర్నులు తగ్గితే భయపడాలా?

స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు అత్యంత సహజం. గత రెండు దశాబ్దాల డేటాను పరిశీలిస్తే.. నిఫ్టీ 500 టీఆర్‌ఐలో రెండేళ్ల ఎస్‌ఐపీ వార్షిక రిటర్నులు 5 శాతం కంటే తక్కువగా నమోదైన సందర్భాలు 25 శాతానికి పైగానే ఉన్నాయి.

ఈ అధ్యయనంలో భాగంగా రెండేళ్ల కాలంలో నష్టాలు లేదా 0 నుంచి 5 శాతం మధ్య మాత్రమే రాబడి ఇచ్చిన 50 సందర్భాలను లోతుగా పరిశీలించారు. వీటిలో 32 సందర్భాల్లో రిటర్నులు అసలు లాభమే లేక (0% లేదా అంతకంటే తక్కువ) ప్రతికూలంగా ఉండగా, 18 సందర్భాల్లో కేవలం 0 నుంచి 5 శాతం మధ్య మాత్రమే స్వల్ప రాబడి వచ్చింది.

షేర్​.మార్కెట్ డేటా..
షేర్​.మార్కెట్ డేటా..

మరో మూడేళ్లు ఓపిక పడితే ఏమైంది?

మ్యూచువల్​ ఫండ్ పెట్టుబడి విషయంలో తొలి రెండేళ్లలో నష్టాల్లో ఉన్నప్పటికీ, ఓపికగా పెట్టుబడిని మరొక మూడేళ్ల పాటు (మొత్తం 5 ఏళ్లు) కొనసాగించిన 32 సందర్భాల్లో ఒక్కటి కూడా ఐదేళ్ల తర్వాత నష్టాల్లో ముగియకపోవడం గమనార్హం. పైగా, ఇందులో దాదాపు 69 శాతం సందర్భాల్లో ఏటా 10 శాతానికి పైగా ఆకర్షణీయమైన రాబడి వచ్చింది.

ఇక తొలి రెండేళ్లలో 0 నుంచి 5 శాతం మధ్య అతి స్వల్ప రాబడి ఇచ్చిన 18 సందర్భాల్లోనూ.. ఐదేళ్ల కాల పరిమితి పూర్తయ్యేసరికి రిటర్నులు 5 శాతాన్ని మించాయి. ఇందులో ఏకంగా 72 శాతం సందర్భాల్లో వార్షికంగా రెండంకెల లాభాలు అందాయి.

దీనిని నివేదిక “స్లింగ్‌షాట్ ఎఫెక్ట్” అని అభివర్ణించింది. అంటే, మార్కెట్ పతనమైనప్పుడు లేదా మందగించినప్పుడు మనం క్రమం తప్పకుండా చేసే ఎస్‌ఐపీలు.. తక్కువ ఎన్‌ఏవీ వద్ద ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి ఉపకరిస్తాయి. మార్కెట్ తిరిగి పుంజుకున్నప్పుడు ఈ తక్కువ ధరకు కొన్న యూనిట్లే విపరీతమైన లాభాలను తెచ్చిపెడతాయి.

దీర్ఘకాలం పెట్టుబడితో రిస్క్ తగ్గుతుందా?

ఖచ్చితంగా తగ్గుతుంది! సమయమే అసలైన భద్రతా కవచంగా పనిచేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

5 ఏళ్ల కాలమితి: ఐదేళ్ల మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ వ్యవధిలో అసలు మూలధనానికి నష్టం వాటిల్లే అవకాశం చారిత్రకంగా కేవలం 1 శాతం మాత్రమే ఉంది.

7 నుంచి 10 ఏళ్ల కాలమితి: ఎస్‌ఐపీని 7 లేదా 10 ఏళ్ల పాటు కొనసాగించినప్పుడు అసలు డబ్బు నష్టపోయే ప్రమాదం అసలు సున్నా (0%) కి పడిపోయింది.

10 ఏళ్ల రిటర్నులు: 10 ఏళ్ల పాటు కొనసాగిన ఎస్‌ఐపీలలో దాదాపు 65 శాతం సందర్భాల్లో ఏటా 10% నుంచి 15% రాబడి రాగా, మరో 26 శాతం సందర్భాల్లో 15% నుంచి 20% వరకు రాబడి లభించింది. అంటే దాదాపు 90 శాతం సందర్భాల్లో 10 ఏళ్ల ఎస్‌ఐపీలు రెండంకెల వార్షిక రాబడినే అందించాయి.

స్థిరత్వంలో మెరిసిన ఫండ్ హౌస్‌లు ఇవే!

మార్కెట్ ట్రెండ్స్‌తో పాటు వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల పర్ఫార్మెన్స్ స్థిరత్వాన్ని కూడా ఈ స్కోర్‌కార్డ్ అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్, నిప్పాన్ ఫండ్ హౌస్‌లు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురికాకుండా, అత్యంత స్థిరమైన ప్రదర్శనను కనబరిచినట్లు నివేదిక వెల్లడించింది.

ముఖ్యంగా కోటక్ ఫండ్ హౌస్ అద్భుత ప్రతిభ చాటింది. దాని 10 ప్రధాన ఫండ్లలో 7 అత్యంత స్థిరమైన పనితీరును, మరొక 2 ఫండ్లు మోస్తరు స్థిరత్వాన్ని ప్రదర్శించాయని నివేదిక పేర్కొంది. 'మోమెంటమ్', 'వాల్యూ' స్టైల్స్ ఆధారంగా పనిచేసే ఫండ్లు మెరుగైన స్థిరత్వాన్ని చూపగా, 'క్వాలిటీ' స్టైల్ ఫండ్లు కాస్త వెనుకబడ్డాయి.

"మార్కెట్ ఒడుదొడుకుల వల్ల ఎస్‌ఐపీల స్వల్పకాలిక మందగమనం చూసి పెట్టుబడిదారులు కంగారుపడటం సహజమే. అయితే గత రెండు దశాబ్దాల డేటా చూస్తే.. ఎస్‌ఐపీ ప్రారంభంలో వచ్చే ఫలితాలు దాని అంతిమ రాబడిని నిర్ణయించలేవని స్పష్టమవుతోంది. పెట్టుబడి కాలపరిమితిని పెంచినప్పుడే కాంపౌండింగ్ అసలైన శక్తి బయటపడుతుంది," అని ఫోన్‌పే మ్యూచువల్ ఫండ్స్ హెడ్ నీలేష్ డీ నాయక్ తెలిపారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More