ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగంలో తీవ్ర ఉత్కంఠ: అందని సిగ్నల్స్.. మిషన్ సక్సెస్‌పై సందిగ్ధత!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి! రాకెట్ నింగిలోకి దూసుకెళ్లినప్పటికీ, ఉపగ్రహాల స్థితిగతులకు సంబంధించిన డేటా అందకపోవడంతో శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్‌పై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే.. ఉపగ్రహాల నుంచి కీలకమైన టెలిమెట్రీ డేటా అందడం లేదని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. మూడో దశలో డీవియేషన్ కనిపించిందని, డేటాలను ఎనలైజ్ చేస్తున్నామని వివరించారు. దీనివల్ల అసలు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయా లేదా అన్నది ఇప్పటికీ సందిగ్ధంగానే మారింది.

ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62.. అసలేం జరిగింది?
నిర్ణీత సమయం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు శ్రీహరికోట వేదికగా మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఇందులో 'అన్వేష' (ఈఓఎస్-ఎన్1) భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు మరో 14 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ప్రయోగం ముగిసిన తర్వాత శాస్త్రవేత్తల ముఖాల్లో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువగా కనిపించింది. మిషన్ ఫలితం గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని ఇస్రో సంకేతాలిచ్చింది.
పీఎస్‌ఎల్వీ- సీ62 లాంచ్‌కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి:
ప్రస్తుత పరిస్థితిపై ఇస్రో ఒక సంక్షిప్త ప్రకటన చేస్తూ.. "ఈరోజు మేము పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్‌ను ప్రయోగించాం. ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని (డేటా) విశ్లేషిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాము," అని పేర్కొన్నారు.
అందని సమాచారం.. ఎక్కడ పొరపాటు?
సాధారణంగా రాకెట్ నుంచి ఉపగ్రహాలు విడిపోయి నిర్ణీత కక్ష్యలోకి చేరినప్పుడు గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందుతాయి. దీనినే 'టెలిమెట్రీ డేటా' అంటారు. అయితే ఈసారి ఆ సమాచారం అందకపోవడంతోనే సమస్య మొదలైంది. పీఎస్‌ఎల్వీ-సీ62 మోసుకెళ్లిన 15 ఉపగ్రహాలు వాటి నిర్దేశిత 'పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్'లోకి చేరాయా లేదా అన్నది ధృవీకరించడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇస్రో ప్రతిష్టకు సవాల్‌గా మారిన మిషన్!
2026 సంవత్సరంలో భారత్ చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. 2025లో చేపట్టిన ఓ పీఎస్‌ఎల్వీ మిషన్ కూడా సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ ఈ 64వ ప్రయోగంతో ఘనంగా కమ్‌బ్యాక్ చేయాలని ఇస్రో భావించింది.
ఈ మిషన్‌లో ఇస్రో వాణిజ్య విభాగం 'న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్' (ఎన్ఎస్ఐఎల్) ద్వారా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను పంపడంతో పాటు.. స్పెయిన్‌కు చెందిన స్టార్టప్ రూపొందించిన చిన్న రీ-ఎంట్రీ క్యాప్సూల్‌ను కూడా ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సి ఉంది.
ఫ్లైట్ డేటాపై పూర్తిస్థాయి విశ్లేషణ ముగిసిన తర్వాతే ఈ మిషన్ భవితవ్యంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోట్లాది మంది భారతీయులు ఇప్పుడు ఇస్రో నుంచి వచ్చే ఆ ఒక్క శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


