ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న కొద్దీ ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందికి రక్షణ కల్పించడంతో పాటు, ఏఐ వల్ల పోతున్న ఉద్యోగాల లెక్కలను నమోదు చేసేందుకు దేశంలోని ఐటీ రంగానికి ఉమ్మడి విధానం అవసరమని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. కంపెనీల ఇష్టానుసారం కాకుండా ముందస్తు నోటీసు, పరిహారం, అంతర్గత బదిలీలు, కొత్త నైపుణ్యాల శిక్షణ (రీస్కిల్లింగ్) వంటి అంశాలకు కనీస ప్రమాణాలు నిర్దేశించాలని ఉద్యోగ ప్రతినిధులు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్లతో పాటు బెంగళూరు, పుణె, చెన్నై వంటి నగరాల్లో పనిచేసే లక్షలాది మంది టెకీలు ఏఐ మార్పులతో తమ కెరీర్‌పై ప్రభావం ఎలా ఉంటుందన్న డైలమాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐటీ రంగాల్లోకి కొత్తగా అడుగుపెట్టే ఇంజినీరింగ్ విద్యార్థులపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ఏఐ రావడంతో ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న విషయం తెలిసిందే. సాంకేతికత వేగంగా మారుతున్న వేళ, ఉద్యోగుల జీవనోపాధికి భరోసా కల్పించే వ్యవస్థ అవసరమనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
ఏఐ లేఆఫ్స్‌పై ప్రత్యేక విధానం కోసం డిమాండ్..
సామూహిక తొలగింపులు, బలవంతపు రాజీనామాలు, అన్యాయమైన ఉపాధి పద్ధతులపై 'నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్' (నైట్స్) ప్రభుత్వ అధికారులను సంప్రదించింది. ఏఐ కారణంగా పోతున్న ఉద్యోగాల కోసం ప్రత్యేక విధాన రూపకల్పన చేయాలని కోరుతోంది! ఏఐ వల్ల ఎన్ని పోస్టులు రద్దయ్యాయి, ఎంతమందిని ఇతర విభాగాలకు మార్చారు, ఎంతమందికి కొత్త ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చారు అనే వివరాలను కంపెనీలు తప్పనిసరిగా నమోదు చేసి వెల్లడించేలా ఈ ప్రతిపాదన రూపొందించారు.
ఉద్యోగులను తొలగించే ముందు అంతర్గత బదిలీల అవకాశాలను పరిశీలించడం, న్యాయమైన పరిహారం ఇవ్వడం, ప్రత్యామ్నాయ ఉపాధి దొరికేలా తోడ్పడటం వంటి కనీస నిబంధనలు ఇందులో ఉంటాయి.
{{/usCountry}}ఉద్యోగులను తొలగించే ముందు అంతర్గత బదిలీల అవకాశాలను పరిశీలించడం, న్యాయమైన పరిహారం ఇవ్వడం, ప్రత్యామ్నాయ ఉపాధి దొరికేలా తోడ్పడటం వంటి కనీస నిబంధనలు ఇందులో ఉంటాయి.
{{/usCountry}}"కంపెనీలు కొత్త సాంకేతికతను స్వీకరించవచ్చు కానీ, అది ఉద్యోగుల జీవనోపాధిపై చూపే ప్రభావానికి కూడా జవాబుదారీగా ఉండాలి. సరైన మద్దతు లేకుండా ఉద్యోగులను వదిలేసేలా సాంకేతిక పురోగతి ఉండకూడదు," అని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా పేర్కొన్నారు.
ఎంతమంది ఉద్యోగులపై ప్రభావం పడింది, పోస్టులు ఎందుకు తొలగించారు, ఉద్యోగాలను సాంకేతికత ఎంతవరకు భర్తీ చేస్తోంది వంటి విషయాలపై ఉద్యోగులకు, ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందాలని సలుజా చెప్పారు. ఏఐ లేదా ఆటోమేషన్ వల్ల పోస్టులు తొలగించే ముందే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లేదా సంస్థలోని ఇతర పాత్రల్లోకి మార్చేందుకు నిజమైన ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. సరైన ముందస్తు నోటీసు, న్యాయమైన పరిహార ప్యాకేజీ, బకాయిల చెల్లింపులు జరగాలన్నారు. కొన్ని ఆన్‌లైన్ కోర్సులకే పరిమితం కాకుండా, కొత్త పనులు చేసుకునేలా అర్థవంతమైన రీస్కిల్లింగ్ అవకాశాలు కల్పించాలని నొక్కిచెప్పారు.
నమ్మకమైన డేటా అవసరం.. మెరుగైన ఎగ్జిట్ ప్యాకేజీల నిరీక్షణ
రాబోయే 18 నుంచి 24 నెలల్లో టెక్నాలజీ రంగంలోని 30 శాతం ఉద్యోగాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని 'టీమ్‌లీజ్ డిజిటల్' అంచనా వేసింది. మరో 45 శాతం ఉద్యోగాల్లో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుండగా, మిగిలిన 25 శాతం ఉద్యోగాలు ఏఐ, డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అధిక విలువ కలిగిన పనుల వైపు మళ్లవచ్చని తెలిపింది.
మైక్రోసాఫ్ట్, కాన్వా సంస్థలు కల్పించిన తరహా ఎగ్జిట్ ప్యాకేజీల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద అర్హులైన ఉద్యోగులకు పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక నెల మూల వేతనం, ఆరోగ్య బీమా, కెరీర్ మార్పునకు సహాయం అందించారు.
ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయినప్పుడు పరిహారం, రీడిప్లాయ్‌మెంట్ లేదా రీస్కిల్లింగ్‌కు సంబంధించి కనీస అవసరాలను నిర్దేశించే స్పష్టమైన ఉమ్మడి విధానం ప్రస్తుతం ఐటీ రంగంలో లేదని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ తెలిపారు. ముందస్తు సమాచారం, న్యాయమైన పరిహారం, సంస్థలో ఇతర అవకాశాలు, కంపెనీ ఖర్చుతో రీస్కిల్లింగ్ వంటి కనీస రక్షణలు అవసరమని ఆమె కోరారు. ఏఐ వల్ల తొలగించిన పోస్టులు, అంతర్గతంగా బదిలీ అయిన వారు, కొత్త పాత్రలకు శిక్షణ పొందిన వారి వివరాలను కంపెనీలు భద్రపరచాలని సూచించారు.
జాతీయ స్థాయి స్పందన కోసం పిలుపు!
ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా వ్యవహరించే బదులు, ఈ అంశంపై జాతీయ స్థాయిలో స్పందన అవసరమని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ ఫ్లోరిషింగ్' (ఐహెచ్ఎఫ్) వ్యవస్థాపకుడు రవి వెంకటేశన్ అన్నారు. నాస్కామ్ వంటి పరిశ్రమ సంఘం తన సభ్యులతో చర్చించి, ఐటీ ఉద్యోగుల తగ్గింపు వివరాల వెల్లడికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తగిన విధాన నిర్ణయం తీసుకోవడానికి ఈ పరిణామాలపై నమ్మకమైన డేటా, ఆధారాలు సమాజానికి అవసరమని రవి వెంకటేశన్ చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది పట్ల కంపెనీల బాధ్యతలను నిర్వచించేలా, కొత్త ఉపాధిలోకి మారేందుకు ప్రభుత్వ పాత్రను స్పష్టం చేసేలా జాతీయ భద్రతా వలయం ఉండాలని కోరారు. ఒక్కో కంపెనీ నిబంధనలకు వదిలేయకుండా జాతీయ విధానం ద్వారానే న్యాయమైన పరిహారం అందాలని వాదించారు. కొత్త ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేందుకు కంపెనీలు, ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు పంచుకోవాలో తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHOR
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.