హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.
RGV on AI: ఏఐ దోచుకోవడం లేదు.. మీరే మీ ఉద్యోగాలను అప్పగిస్తున్నారు.. లేఆఫ్స్ చేస్తే ఎందుకు ఏడుపులు: రామ్ గోపాల్ వర్మ
RGV on AI: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ‘ది ఏఐ ట్రూత్ బాంబ్’ పేరుతో చేసిన సుదీర్ఘ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తమ ఉద్యోగాలను లాగేసుకుంటోందంటూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులే.. వాస్తవంగా తమ ఉద్యోగాలను వాటికి అప్పగిస్తున్నారని అనడం గమనార్హం.
RGV on AI: ఏ అంశంపైనైనా తనదైన శైలిలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా అభిప్రాయాలు వెల్లడించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్, ఐటీ రంగాలను కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేఆఫ్స్ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా 'ది ఏఐ ట్రూత్ బాంబ్' పేరుతో ఒక సంచలన పోస్ట్ పెట్టారు.

ఏఐ తమ ఉద్యోగాలను దోచుకుంటోందని గగ్గోలు పెడుతున్న ఉద్యోగుల అసలు తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దొంగచాటుగా ఏఐ వాడుతూ.. మీరే మీ ఉద్యోగాన్ని అప్పగిస్తున్నారు
“ఏఐ మా ఉద్యోగాలను దొంగిలిస్తోంది” అంటూ కంపెనీల ఉద్యోగులు గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ, అసలు నిజం ఏమిటంటే ఉద్యోగులే తమ ఉద్యోగాలను తాము దొంగిలించుకున్నారని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లోని ఉద్యోగులు రహస్యంగా ఏఐని ఎలా వాడుకుంటున్నారో ఆయన ఉదాహరణలతో సహా వివరించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: ఒకప్పుడు సొంతంగా కోడ్ రాసిన ఇంజనీర్, ఇప్పుడు రిక్వైర్‌మెంట్స్‌ను క్లాడ్ (Claude)లో పేస్ట్ చేసి, కేవలం 12 సెకన్లలో ఫంక్షన్ పొందుతున్నాడు. అందులో రెండు వేరియబుల్ పేర్లు మార్చి, తానే రాసినట్లుగా సబ్మిట్ చేస్తున్నాడు.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: క్యాంపెయిన్ ఐడియాల కోసం జీతం తీసుకునే ఎగ్జిక్యూటివ్, బ్రీఫ్‌ను చాట్‌జీపీటీ (ChatGPT)కి ఇచ్చి, అది ఇచ్చే మూడు ఆప్షన్లలో తక్కువగా తెలిసే దాన్ని ఎంచుకుని సోమవారం మీటింగ్‌లో "ఇది నా ఐడియా" అని ప్రెజెంట్ చేస్తున్నాడు.
డేటా అనలిస్ట్: లెక్కలు వేసి విశ్లేషణ చేయాల్సిన అనలిస్ట్, స్ప్రెడ్‌షీట్‌ను ఏఐలో అప్‌లోడ్ చేసి లోపాలను గుర్తించమని, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాయమని ఆదేశించి.. ఆ అవుట్‌పుట్‌పై తన పేరు వేసి పంపుతున్నాడు.
డిజైనర్ & కస్టమర్ సపోర్ట్: లేఅవుట్ల కోసం గంటల తరబడి శ్రమించే డిజైనర్, మిడ్‌జర్నీ (Midjourney)లో 20 ఆప్షన్లు జనరేట్ చేసి, మనిషి చేసినట్లు కనిపించేలా కాస్త మార్పులు చేస్తున్నాడు. ఇక కస్టమర్ సపోర్ట్ లీడ్ ప్రతి రిప్లైని సానుభూతిగా వినిపించేలా ఏఐ ద్వారా మార్చి పంపుతున్నాడు.
అందరూ తలుపులు వేసుకుని, బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేస్తూ, తమ సొంత మెదడుతోనే పని చేస్తున్నట్లు నటిస్తున్నారని వర్మ ఎద్దేవా చేశారు. ఈ పని అందరూ చేస్తున్నా, ఎవరూ ఒప్పుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
కంపెనీలకు గూఢచారులు అక్కర్లేదు.. నంబర్లే నిజం చెప్పేశాయి
ఉద్యోగులు చేస్తున్న ఈ రహస్య వ్యవహారాన్ని కనిపెట్టడానికి కంపెనీలకు గూఢచారులు గానీ, సీసీ కెమెరాలు గానీ అవసరం లేదని ఆర్జీవీ అన్నారు. సంస్థల ఆర్థిక గణాంకాలు, స్ప్రెడ్‌షీట్లే అసలు రహస్యాన్ని బయటపెట్టాయని ఆయన విశ్లేషించారు.
అసలు పనిని ఏఐ చేస్తుంటే, మనుషులు మాత్రం పేరోల్‌లో ఉండి జీతాలు తీసుకుంటున్నారని వర్మ వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల అవుట్‌పుట్ పెరిగింది, నాణ్యత మెరుగుపడింది, డెడ్‌లైన్స్ వేగంగా పూర్తయ్యాయి, లాభాలు ఆకాశాన్ని తాకాయి. ఎందుకంటే ఏఐ 24 గంటలూ పనిచేస్తుంది. దానికి కాఫీ బ్రేకులు అక్కర్లేదు, జబ్బు చేయదు, ఫిర్యాదులు చేయదు, సహోద్యోగులపై చాడీలు చెప్పదు, జీతాల పెంపు అడగదు.. పైసా జీతం లేకుండానే పనిని అందిస్తుంది.
లేఆఫ్స్ వస్తే షాక్ అవ్వడం దేనికి? భవిష్యత్తు ఇదే
ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు లేఆఫ్స్ (ఉద్యోగాల కోత) ప్రకటించినప్పుడు.. “కంపెనీ క్రూరమైనది, టెక్నాలజీ విలన్, మమ్మల్ని ఏఐతో భర్తీ చేశారు” అంటూ ఉద్యోగులు షాక్ అవ్వడమే అసలైన విడ్డూరమని ఆర్జీవీ అన్నారు.
“ఏఐ ఎప్పుడూ ఆఫీసులోకి నడుచుకుంటూ వచ్చి మనుషులను బయటకు గెంటేయలేదు. ఉద్యోగులే రహస్యంగా తమ స్థానాన్ని ఏఐకి అప్పగించి, తాము చేయని పనికి జీతాలు తీసుకుంటూ కూర్చున్నారు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.
చివరగా ఉద్యోగులకు కీలక సూచన చేస్తూ.. “భవిష్యత్తు అనేది ఏఐ వాడకాన్ని రహస్యంగా ఉంచడంలో లేదు. దాన్ని బహిరంగంగా, అపరాధ భావన లేకుండా, అత్యంత దూకుడుగా ఉపయోగించడంలోనే ఉంది. భవిష్యత్తులో ఇంకేం జరిగినా ఒక కఠినమైన వాస్తవం మాత్రం తథ్యం.. ఏఐని ఉపయోగించే వ్యక్తులే, ఏఐని ఉపయోగించని వారి స్థానాలను భర్తీ చేస్తారు” అంటూ రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్‌ను ముగించారు. ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో ఆర్జీవీ విశ్లేషణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ, పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

E-Paper
