Jantar Mantar Protest Live : షబానా అజ్మీ, ప్రకాశ్​ రాజ్​, మరెందరో.. పార్లమెంట్​ మార్చ్​కు ప్రముఖుల మద్దతు!

CJP Protest in Delhi : సోనమ్ వాంగ్​చుక్, సీజేపీ తలపెట్టిన పార్లమెంట్​ మార్చ్​కు అనేక మంది ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. వీరిలో చాలా మంది జంతర్​ మంతర్​కు వెళ్లి మరీ సపోర్ట్​ చేస్తున్నారు.

Published on: Jul 20, 2026, 11:56:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్​ యూజీ పరీక్షల అక్రమాలు, వరుస పేపర్ లీకేజీలపై దేశ రాజధాని దిల్లీలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ), పర్యావరణవేత్త సోనమ్ వాంగ్​చుక్ పిలుపునిచ్చిన 'చలో సంసద్' మార్చ్ ఉధృతంగా సాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు, యువకులు, నిరసనకారులతో దిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాలు జనసముద్రంగా మారాయి.

జంతర్ మంతర్ వద్ద ప్రకాశ్ రాజ్​.. (PTI)
జంతర్ మంతర్ వద్ద ప్రకాశ్ రాజ్​.. (PTI)

పార్లమెంట్​ మార్చ్​ అనేది కేవలం విద్యార్థుల నిరసనగానే కాకుండా, రాజకీయ, సినీ, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి:

చంద్రశేఖర్ ఆజాద్: ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ.

మహువా మోయిత్రా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ.

షబానా అజ్మీ: బాలీవుడ్ దిగ్గజ నటి.

ప్రకాశ్ రాజ్: ప్రముఖ బహుభాషా నటుడు.

వీరితో పాటు విపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎంపీలు సైతం ఇప్పుడు పార్లమెంట్​ మార్చ్​లో పాల్గొనేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.

అనేక మంది ప్రముఖులు ఆన్​లైన్​ వేదికగానూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

ఇలా రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాజిక కార్యకర్తలు నేరుగా రంగంలోకి దిగడంతో ఈ ఆందోళనకు మరింత మైలేజ్ లభించింది. సోమవారం ఉదయం 9 గంటలకల్లా జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి పార్లమెంట్ వైపు మార్చ్‌గా బయలుదేరాలని సీజేపీ శ్రేణులు ముందుగానే పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే దిల్లీకి నిరసనకారులు పోటెత్తారు.

మరోవైపు ప్రముఖ పర్యావరణ వేత్త, విద్యా రంగ సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ సైతం ఈ పార్లమెంట్​ మార్చ్​లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీట్ అక్రమాలకు నిరసనగా గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను గడచిన వారాంతంలో అధికారులు ధర్నా చౌక్ నుంచి 'బలవంతంగా' తరలించారని సీజేపీ ఆరోపించింది. ప్రస్తుతం ఆయన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఆయన తన నిరాహార దీక్షను విరమించలేదు. దేశ విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదా ఈ నీట్ అంశాన్ని పార్లమెంట్‌లో గట్టిగా లేవనెత్తుతామని ఎంపీలు హామీ ఇచ్చేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.

మూతపడ్డ మెట్రో గేట్లు.. ప్రయాణికుల ఇబ్బందులు!

ఈ భారీ నిరసన ప్రదర్శన కారణంగా సెంట్రల్ దిల్లీ పరిధిలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జనపథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్ల గేట్లను కొన్ని గంటల పాటు మూసివేసింది. ఆ తర్వాత ఒక్కో స్టేషన్​ని తెరుస్తూ వచ్చింది.

నిరసనకారులు జంతర్ మంతర్ వైపు రాకుండా అడ్డుకోవడానికే ప్రభుత్వం మెట్రో స్టేషన్లను మూసివేసిందని సీజేపీ ఆరోపించింది. అయితే, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో కాసేపటి తర్వాత డీఎంఆర్‌సీ మరో అప్‌డేట్ ఇచ్చింది. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌ఛేంజ్ సదుపాయంతో పాటు గేట్లను తిరిగి తెరిచినట్లు స్పష్టం చేసింది.

అనుమతి లేదన్న దిల్లీ పోలీసులు

న్యూదిల్లీ జిల్లాలో ఉన్న హై-సెక్యూరిటీ జోన్, పార్లమెంట్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఈ పార్లమెంట్ ముట్టడి ర్యాలీకి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ విద్యార్థులు, నేతలు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం దిల్లీలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More