Jaspal Rana: షాకింగ్.. మను భాకర్ గురువు, ద్రోణాచార్య అవార్డీ జస్పాల్ రాణా అకాల మరణం.. భారత షూటింగ్ రంగానికి తీరని లోటు!
Jaspal Rana: భారత షూటింగ్ దిగ్గజం, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా (49) దిల్లీలో కన్నుమూశారు. మ్యూనిచ్ టోర్నీ నుంచి వస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్టార్ షూటర్ మను భాకర్‌ను ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ గా నిలిపిన కోచ్ జస్పాల్.
Jaspal Rana: భారత షూటింగ్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశానికి ఎన్నో అంతర్జాతీయ పతకాలు అందించిన లెజెండరీ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) గురువారం రాత్రి దిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 49 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు.

జస్పాల్ రాణా మరణం
జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ISSF) ప్రపంచకప్ ముగించుకుని భారత షూటింగ్ బృందంతో కలిసి స్వదేశానికి తిరిగి వస్తుండగా జస్పాల్ రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విమానంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, దిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ శస్త్రచికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో జస్పాల్ రాణా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధ్యక్షుడు కాలికేష్ నారాయణ్ సింగ్ దేవ్ ధృవీకరించారు.
మను భాకర్ ‘మెంటార్’
జస్పాల్ రాణా కేవలం ఒక కోచ్ మాత్రమే కాదు, ఆధునిక భారత షూటింగ్ రంగానికి ఒక బలమైన పునాది లాంటి వ్యక్తి. ఒకప్పుడు షూటింగ్ అంటే కేవలం ఒక హాబీగా ఉన్న రోజుల్లో.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచి దేశంలో ఈ క్రీడపై యువతకు ఆసక్తి పెరిగేలా చేశారు.
జస్పాల్ రాణా కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన ఘట్టం మను భాకర్ (Manu Bhaker) ను తీర్చిదిద్దడం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్ర నిరాశ ఎదురై, మానసికంగా కుంగిపోయిన మను భాకర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చింది రాణానే. సాంకేతిక లోపాలను సవరించడమే కాకుండా, ఒలింపిక్స్ ఒత్తిడిని ఎలా జయించాలో ఆమెకు నేర్పించారు. దాని ఫలితమే 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ సాధించిన రెండు చారిత్రక పతకాలు.
ద్రోణాచార్య అవార్డు
మను భాకర్‌తో పాటు దేశం గర్వించదగ్గ యువ షూటర్లు సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా, చింకీ యాదవ్‌లను కూడా జస్పాల్ రాణానే అగ్రశ్రేణి క్రీడాకారులుగా మలిచారు. షూటింగ్ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2020లో ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య అవార్డు’తో సత్కరించింది.
అభినవ్ బింద్రా భావోద్వేగ ట్వీట్
జస్పాల్ రాణా అకాల మరణం పట్ల భారత తొలి ఒలింపిక్ వ్యక్తిగత స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సంతాపం ప్రకటిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
"జస్పాల్ రాణా మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. జస్పాల్ నా సహచర క్రీడాకారుడు. భారత షూటింగ్ రంగానికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన తరం మాది. షూటింగ్ రేంజ్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ దేశం గర్వపడేలా చేయడం ఆయన నైజం. ఇది మన క్రీడారంగానికి తీరని లోటు" అని బింద్రా పోస్టు చేశాడు.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: జస్పాల్ రాణా ఏ క్రీడకు చెందినవారు?
జవాబు: జస్పాల్ రాణా భారతదేశానికి చెందిన ప్రముఖ లెజెండరీ పిస్టల్ షూటర్, హై-పర్‌ఫార్మెన్స్ కోచ్.
ప్రశ్న: మను భాకర్ కోచ్ ఎవరు?
జవాబు: స్టార్ ఒలింపిక్ షూటర్ మను భాకర్‌కు జస్పాల్ రాణా సుదీర్ఘకాలం పాటు పర్సనల్ కోచ్‌గా, గైడ్‌గా వ్యవహరించారు. ఆమె ఒలింపిక్ పతకాలు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ప్రశ్న: జస్పాల్ రాణాకు ద్రోణాచార్య అవార్డు ఎప్పుడు వచ్చింది?
జవాబు: ఎందరో యువ క్రీడాకారులను అంతర్జాతీయ విజేతలుగా తీర్చిదిద్దినందుకు గానూ భారత ప్రభుత్వం 2020లో ఆయనను 'ద్రోణాచార్య అవార్డు'తో గౌరవించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


