జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026: రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు.. ఐఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకోండిలా

దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23న ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated on: Apr 22, 2026, 13:19:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఇంజనీరింగ్ చదవాలనుకునే ప్రతి విద్యార్థి కల ఐఐటీలో సీటు సాధించడం. ఆ కలను సాకారం చేసుకునే దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపు (ఏప్రిల్ 23, 2026) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఈ పరీక్షా నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) చేపట్టింది.

ఐఐటీ బాంబే సహా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సిందే
ఐఐటీ బాంబే సహా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సిందే

ముఖ్యమైన తేదీలు గమనించండి

ఐఐటీల్లో చేరాలనుకునే అభ్యర్థులు మే 2, 2026 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి మే 4, 2026 వరకు గడువు ఇచ్చారు. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB 2026) పర్యవేక్షణలో ఏడు జోనల్ ఐఐటీలు సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.

అర్హత ఎవరికంటే..?

జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 2,50,000 మంది అభ్యర్థులు (అన్ని కేటగిరీలతో కలిపి) మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. ఐఐటీల్లో బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందడానికి ఈ పరీక్షలో సాధించిన మార్కులే ప్రామాణికం.

పరీక్షా విధానం ఇలా..

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

  • పేపర్-1: ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.
  • పేపర్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.

అభ్యర్థులు కచ్చితంగా ఈ రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్క పేపర్ రాసి రెండోది వదిలేస్తే అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోరు.

దరఖాస్తు చేసుకునే విధానం (Step-by-Step):

అభ్యర్థులు ఈ క్రింది విధానంలో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు:

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in సందర్శించండి.
  2. హోమ్ పేజీలో కనిపించే 'JEE Advanced 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
  3. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
  4. అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  5. నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  6. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఐఐటీలు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. గత కొన్ని ఏళ్లుగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే వంటి అగ్రశ్రేణి సంస్థల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఈసారి కూడా అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని వృథా చేయకుండా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏది?

దరఖాస్తు చేయడానికి మే 2, 2026 చివరి తేదీ. దరఖాస్తు రుసుమును మే 4 వరకు చెల్లించవచ్చు.

జేఈఈ మెయిన్స్ రాసిన వారంతా అడ్వాన్స్‌డ్ రాయవచ్చా?

లేదు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఏ ఐఐటీ నిర్వహిస్తోంది?

2026 సంవత్సరానికి గాను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి? రెండు రాయడం తప్పనిసరా?

పరీక్షలో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావడం తప్పనిసరి.

పూర్తి సమాచారం కోసం బ్రోచర్ క్లిక్ చేయండి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More