జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026: ఎస్సీ, ఎస్టీ క్వాలిఫైయింగ్ శాతంలో భారీ జంప్

జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. మరోవైపు మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత గత ఆరేళ్లలోనే అత్యధికంగా 23.4 శాతానికి చేరింది. ఐఐటీ రూర్కీ విడుదల చేసిన పూర్తి నివేదిక వివరాలు ఇవే.

Published on: Oct 6, 2026, 07:42:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఐఐటీ రూర్కీ శనివారం విడుదల చేసిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (జేఐసీ) నివేదిక ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల ఉత్తీర్ణతా శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఎస్సీ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 9.8 పాయింట్లు, ఎస్టీ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 8.1 పాయింట్లు పెరిగాయి. మహిళా అభ్యర్థులు 23.4 శాతంతో గత ఆరేళ్లలో (2021-2026) అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026: ఎస్సీ, ఎస్టీ క్వాలిఫైయింగ్ శాతంలో భారీ జంప్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026: ఎస్సీ, ఎస్టీ క్వాలిఫైయింగ్ శాతంలో భారీ జంప్

మొత్తంగా ఈ ఏడాది 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 15,856 మంది ఎస్సీలు, 6,379 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య వరుసగా 12,499, 5,008గా నమోదైంది.

కేటగిరీల వారీగా ఉత్తీర్ణత గణాంకాలు

ఈ ఏడాది ఎస్సీ అభ్యర్థుల ఉత్తీర్ణతా శాతం 50.16 శాతానికి చేరింది. 2025లో ఇది 40.41 శాతంగా ఉంది. అంటే నమోదు చేసుకున్న ప్రతి ఇద్దరు ఎస్సీ అభ్యర్థుల్లో ఒకరు అర్హత సాధించారు. ఎస్టీ అభ్యర్థుల ఉత్తీర్ణత 33.99 శాతం నుంచి 42.14 శాతానికి పెరిగింది. ఈ వర్గంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరికంటే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు.

ఇతర కేటగిరీల వివరాలు:

సాధారణ కేటగిరీ (General Category): ఉత్తీర్ణతా శాతం 3.2 పాయింట్లు తగ్గి 39.8 శాతానికి చేరింది. అర్హత సాధించిన వారి సంఖ్య గతేడాది 16,154 నుంచి ఈసారి 15,883కు తగ్గింది.

ఓబీసీ-ఎన్సీఎల్ (OBC-NCL): ఉత్తీర్ణత శాతం 0.7 పాయింట్లు తగ్గి 17.5 శాతంగా నిలిచింది. అర్హత సాధించిన అభ్యర్థులు 12,606 నుంచి 12,385కు తగ్గారు.

ఈడబ్ల్యూఎస్ (GEN-EWS): క్వాలిఫై అయిన వారి సంఖ్య 6,291 నుంచి 6,377కు పెరగ్గా, ఉత్తీర్ణత శాతం దాదాపు 21 శాతంగా (గతేడాది 21.6%) నిలకడగా ఉంది.

మహిళల అత్యుత్తమ ప్రతిభ

మహిళల ఉత్తీర్ణతా శాతం 2025లోని 21.7 శాతం నుంచి ఈ ఏడాది 23.4 శాతానికి పెరిగింది. దరఖాస్తు చేసుకున్న 43,112 మంది మహిళల్లో 40,562 మంది రెండు పేపర్లు రాయగా, 10,107 మంది అర్హత సాధించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు క్వాలిఫై అయ్యారు.

ఐఐటీల్లో కేటాయించిన మొత్తం 18,861 సీట్లలో 3,814 సీట్లను (దాదాపు 20.2%) మహిళలు సాధించారు. ఇందులో 37 మంది జెండర్ న్యూట్రల్ పూల్ ద్వారా, 3,777 మంది మహిళా సూపర్ న్యూమరరీ సీట్ల (SSS) ద్వారా ప్రవేశం పొరదారు. ఐఐటీలలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు 2018లో ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల 2017లో 7-9 శాతంగా ఉన్న మహిళల భాగస్వామ్యం 2020 నాటికి 20 శాతానికి చేరి, స్థిరంగా కొనసాగుతోంది.

అన్ని వర్గాల్లోనూ పెరిగిన కట్ ఆఫ్ మార్కులు

ఈ ఏడాది అన్ని కేటగిరీలలో కట్ ఆఫ్ మార్కులు పెరిగినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. మొత్తం 360 మార్కులకు గానూ కట్ ఆఫ్ వివరాలు..

కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL): కట్ ఆఫ్ 74 మార్కుల నుంచి 92 మార్కులకు (18 మార్కులు పెంపు) పెరిగింది.

ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్: కట్ ఆఫ్ 66 నుంచి 82 మార్కులకు పెరిగింది.

ఎస్సీ, ఎస్టీ: కట్ ఆఫ్ 37 నుంచి 46 మార్కులకు పెరిగింది.

ఐఐటీల్లో లభ్యతలో ఉన్న సీట్లకు కనీసం రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులు అర్హత సాధించేలా నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలను సవరించినట్లు జేఐసీ తెలిపింది.

జోసా కౌన్సెలింగ్, చివరి ప్రవేశ ర్యాంకులు

అర్హత సాధించిన 56,880 మందిలో 52,559 మంది జోసా (JoSAA) కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోగా, 4,321 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొనలేదు.

జెండర్ న్యూట్రల్ పూల్‌లో చివరి ఐఐటీ సీటు సాధించిన అభ్యర్థి CRL ర్యాంక్ 28,480 కాగా, మహిళా పూల్‌లో చివరి సీటు సాధించిన ర్యాంక్ 29,824.

కేటగిరీల వారీగా చివరి ప్రవేశ ర్యాంకులు:

జనరల్-ఈడబ్ల్యూఎస్: జెండర్ న్యూట్రల్ - 4,432 | మహిళలు - 5,852

ఓబీసీ-ఎన్సీఎల్: జెండర్ న్యూట్రల్ - 9,002 | మహిళలు - 11,941

ఎస్సీ: జెండర్ న్యూట్రల్ - 4,075 | మహిళలు - 4,874

ఎస్టీ: జెండర్ న్యూట్రల్ - 2,199 | మహిళలు - 2,112

విద్యా సంస్థలు, నిపుణుల అభిప్రాయాలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ర్యాంకులను ఐఐటీలతో పాటు ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐఎం లక్నో, ఐఐపీఈ, ఐఐఎస్టీ, ఆర్‌జీఐపీటీ సంస్థలు కూడా తమ ప్రవేశాలకు ఉపయోగిస్తున్నాయి.

కేవలం ఐఐటీల పైన మాత్రమే ఆశలు పెట్టుకోకుండా దేశంలో మరిన్ని నాణ్యమైన విద్యాసంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామ్‌‌గోపాల్ రావు అభిప్రాయపడ్డారు. అర్హత సాధించిన వారందరికీ ఐఐటీ సీటు దక్కడం సాధ్యం కాదని, కౌన్సెలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకే సీట్ల కంటే ఎక్కువ మందికి అర్హత కల్పిస్తారని స్పష్టం చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ, ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, వసతుల పెంపుతో పాటు డిజిటల్ అవుట్‌రీచ్ ద్వారా ఐఐటీ విద్యను విస్తరించాలని సూచించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More