JEE Mains 2026 : జేఈఈ మెయిన్స్​ సెషన్-2 దరఖాస్తుల సవరణకు అవకాశం.. నేడు కరెక్షన్ విండో ఓపెన్!

JEE Mains 2026 session 2 : జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్లికేషన్లలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 28 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం కల్పించింది.

Published on: Feb 27, 2026, 05:31:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'జేఈఈ మెయిన్స్​ 2026' సెషన్-2 పరీక్షకు సంబంధించి బిగ్​ అప్డేట్​. అప్లికేషన్​ దరఖాస్తుల సవరణ ప్రక్రియ నేడు, ఫిబ్రవరి 27 2026న ప్రారంభంకానుంది. అప్లికేషన్ ఫారమ్‌లలో పొరపాట్లు చేసిన అభ్యర్థులు వాటిని సరిదిద్దుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫిబ్రవరి 27న 'కరెక్షన్ విండో'ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ వివరాలను మార్చుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 అప్డేట్స్​..
జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 అప్డేట్స్​..

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2- గడువు ఎప్పటి వరకు?

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 కరెక్షన్​ విండో ఫిబ్రవరి 28, రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ దరఖాస్తులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవడం ఉత్తమం.

ఈ అవకాశం రెండు రకాల అభ్యర్థులకు వర్తిస్తుంది:

సెషన్-1కు రిజిస్టర్ చేసుకుని, సెషన్-2కు కూడా దరఖాస్తు చేసిన వారు.

కేవలం సెషన్-2 కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్న వారు.

పాత అభ్యర్థులు ఏమేం మార్చుకోవచ్చు?

అక్టోబర్-నవంబర్ 2025లో సెషన్-1 కోసం రిజిస్టర్ చేసుకుని, ఇప్పుడు సెషన్-2 రాస్తున్న విద్యార్థులు ఈ కింది వివరాలను సవరించుకోవచ్చు:

పరీక్ష రాసే పేపర్ (కోర్సు), క్వశ్చన్ పేపర్ మీడియం (భాష).

స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, పరీక్ష రాసే నగరం (అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి).

10వ తరగతి, 12వ తరగతి విద్యా వివరాలు.

జెండర్ (లింగం), కేటగిరీ, ఐడెంటిటీ ప్రూఫ్ వివరాలు (ఆధార్ కార్డు కాకుండా వేరే డాక్యుమెంట్ వాడి ఉంటే).

చేసే మార్పులను బట్టి అదనపు ఫీజు చెల్లించాల్సి రావచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2- కొత్తగా దరఖాస్తు చేసిన వారికి పరిమితులు..

ఫిబ్రవరి 1 నుంచి 25 మధ్య కేవలం సెషన్-2 కోసం మాత్రమే మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారు కొన్ని వివరాలను మార్చడానికి వీలుండదు. ముఖ్యంగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, శాశ్వత చిరునామా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్, ఫోటోగ్రాఫ్‌లను మార్చలేరు.

అయితే వీరు తమ పేరు లేదా తల్లిదండ్రుల పేర్లు, విద్యార్హతలు, పుట్టిన తేదీ, కేటగిరీ, సంతకం, పరీక్ష రాసే పేపర్ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అడ్రస్‌లో మార్పులు చేస్తే దానికి అనుగుణంగా ఎగ్జామ్ సిటీ, మీడియం మార్చుకునే వీలుంటుంది.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2- తదుపరి ప్రక్రియ ఏంటి?

కరెక్షన్ విండో ముగిసిన తర్వాత, ఎన్టీఏ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన 'అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్'ను విడుదల చేస్తుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డులు (హాల్ టికెట్లు) జారీ అవుతాయి. ఇందులో పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం, కేటాయించిన సెంటర్ వివరాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రయాణ ఏర్పాట్లను ముందే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో చేరేందుకు నిర్వహిస్తున్న పరీక్షే ఈ జేఈఈ మెయిన్స్​. ప్రతియేటా ఈ పరీక్ష రెండుసార్లు ఉంటుంది. ఇందులో మంచి ర్యాంకు సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్​డ్​కి క్వాలిఫై అవుతారు. అందులో మంచి ర్యాంకు సాధించిన వారు ప్రముఖ ఐఐటీల్లో సీటు పొందుతారు.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 పరీక్ష ఏప్రిల్​ 2 నుంచి 9 వరకు జరుగుతుంది. రెండు షిఫ్టుల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 3-6) పరీక్షను నిర్వహిస్తారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న- దరఖాస్తులో మార్పులు చేసిన ప్రతిసారీ అదనపు ఫీజు చెల్లించాలా?

సమాధానం- అన్ని మార్పులకు ఫీజు ఉండదు. అయితే, మీరు మీ కేటగిరీని (ఉదాహరణకు జనరల్​ నుంచి ఓబీసీ/ఎస్​/ఎస్​టీకి లేదా వైస్ వెర్సా) మార్చినా, లేదా అదనంగా మరిన్ని పేపర్లు (బీఆర్క్​ లేదా బీప్లానింగ్​) రాయాలని నిర్ణయించుకున్నా, ఆ వ్యత్యాసానికి తగిన అదనపు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజులో మార్పు లేకపోతే ఎటువంటి అదనపు రుసుము ఉండదు.

ప్రశ్న- కరెక్షన్ విండో ముగిసిన తర్వాత ఏవైనా తప్పులు గుర్తిస్తే సరిదిద్దుకోవచ్చా?

సమాధానం- లేదు. ఫిబ్రవరి 28, రాత్రి 11:50 గంటల తర్వాత ఎన్టీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణలకు అవకాశం ఇవ్వదు. ఇది ఆఖరి అవకాశం. కాబట్టి సబ్మిట్ చేసే ముందు 'ప్రివ్యూ' ఆప్షన్ ద్వారా అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More