జియో ఐపీఓ వేడుక: అనంత్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ అంబానీ
జియో ఐపీఓ లిస్టింగ్ వేడుకలో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రయాణాన్ని అనంత్ అంబానీ గుర్తు చేసుకున్నారు. చోర్వాడ్ నుంచి అడెన్ పెట్రోల్ పంప్ వరకు ఆయన పడిన కష్టాలను వివరిస్తున్న సమయంలో ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
జియో ఐపీఓ లిస్టింగ్ వేడుక అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. రిలయన్స్ పరిశ్రమల వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయ్ అంబానీ శ్రమతో కూడిన ప్రయాణాన్ని ఆయన మనవడు అనంత్ అంబానీ వేదికపై ఆవిష్కరించారు. తండ్రి ఆశయాలను, పడిన కష్టాలను తన కొడుకు నోటి వెంట వింటున్న సమయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లంబడి నీళ్లు తిరిగాయి.

చోర్వాడ్ నుంచి జామ్‌నగర్ వరకు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ
గుజరాత్‌లోని చిన్న గ్రామమైన చోర్వాడ్‌లోని ఒక సాధారణ ఇంట్లో ధీరూభాయ్ కన్న కలలను అనంత్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఏడెన్ (యెమెన్)లోని పెట్రోల్ పంపులో ఒక సాధారణ ఉద్యోగిగా ధీరూభాయ్ పనిచేసిన రోజులను గుర్తుచేశారు.
"ఓ సామాన్య భారతీయుడు కూడా అసాధారణ కలలు కనవచ్చని ఆయన నిరూపించారు" అని ఆనంత్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఆయన వద్ద డబ్బుగానీ, ఎటువంటి రాజకీయ వ్యాపార సంబంధాలు గానీ లేవని చెప్పారు.
అనంతరం తన తండ్రి ముకేశ్ అంబానీ లక్ష్యాలను ఆనంత్ వివరించారు. ఏ రంగంలోనూ భారత్ ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోకూడదనే ముకేశ్ పట్టుదలే జామ్‌నగర్‌లోని ఎడారి లాంటి బీడు భూములను ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా మార్చిందని కొనియాడారు. భారతీయ ప్రతిభ వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేసిన ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు.
ఈశా నాటిన విత్తనం.. ఆకాశ్ కన్న కల
దేశంలోని ప్రతీ పౌరుడి చేతికీ డిజిటల్ విప్లవాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో 'జియో' ఆవిర్భవించిందని ఆనంత్ వెల్లడించారు. ఈ మహత్తర ఆలోచనకు ఈశా అంబానీ తొలి బీజం వేయగా, ఆకాశ్ అంబానీ దాన్ని సొంత లక్ష్యంగా మలుచుకుని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లులు ఆప్యాయంగా ఇచ్చే ఆశీర్వాదాల నుంచే 'జియో' అనే పేరు పుట్టుకొచ్చిందని గుర్తుచేశారు.
కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు
సామాన్యుల జీవితాల్లో జియో తెచ్చిన సాంకేతిక మార్పులను అనంత్ ఉదాహరణలతో వివరించారు. బడులు మూతపడిన సమయంలో డిజిటల్ విద్య ద్వారా పిల్లల చదువులు ఆగకుండా సాగాయని గుర్తుచేశారు. ఇళ్లకు దూరంగా ఉండే కొడుకు వంట చేస్తుంటే, వీడియో కాల్ ద్వారా కూరగాయలను చూస్తూ తల్లి సూచనలు ఇవ్వడం, ఇంటి నుంచే ఆలయాల దివ్య దర్శనాలు చేసుకోవడం జియో ద్వారానే సాధ్యమయ్యాయని చెప్పారు.
ఒక చిన్న పట్టణానికి చెందిన చిన్నారి మొబైల్ ద్వారా కోట్లాది మందిని చేరుకుని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడం, వేలాది మైళ్ల దూరంలో సరిహద్దుల్లో ఉండే సైనికుడు భార్యాపిల్లలతో వీడియో కాల్‌లో మాట్లాడటం వంటి దృశ్యాలను ఆనంత్ తన ప్రసంగంలో ఆవిష్కరించారు. ముంబైకి చెందిన ఒక నిపుణుడైన వైద్యుడు రాజస్థాన్‌లోని పాలి గ్రామంలో అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగికి డిజిటల్ సాంకేతికత ద్వారా ప్రాణరక్షణ కల్పించిన తీరును వివరించారు.
మూడు తరాల ప్రయాణాన్ని, సాధించిన విజయాలను కొడుకు అనంత్ వివరిస్తుంటే ముకేశ్ అంబానీ కళ్లు చెమర్చాయి. తాత వేసిన పునాది, తండ్రి విస్తరించిన సామ్రాజ్యం, నవతరం అందిపుచ్చుకున్న డిజిటల్ విప్లవం.. ఇవన్నీ ఒకే వేదికపై ఆవిష్కృతమై సభలోని వారందరినీ ఆకట్టుకున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


