జియో ఐపీఓ సందడి: రిలయన్స్ షేర్ హోల్డర్లకు జాక్‌పాట్ లభించేనా?

దేశంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ అక్టోబర్ 21న మార్కెట్ ముందుకు రానుంది. ఈ మెగా ఐపీఓ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వాటాదారుల సంపద ఏ విధంగా పెరగనుంది? నిపుణులు ఏమంటున్నారో చూడండి.

Published on: Oct 7, 2026, 15:42:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. ముకేశ్ అంబానీకి చెందిన ప్రముఖ డిజిటల్, టెలికాం దిగ్గజం 'జియో ప్లాట్‌ఫార్మ్స్' తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమైంది. అక్టోబర్ 21న ప్రాథమిక మార్కెట్‌లోకి రానున్న ఈ ఐపీఓ ద్వారా దాదాపు ₹37,700 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఒక్కో షేరు ధరను ₹1,300 నుంచి ₹1,450 మధ్య నిర్ణయించే అవకాశముందని సమాచారం. భారతదేశంలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌గా నిలవనుండటంతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వాటాదారులు దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

జియో ఐపీఓ సందడి: రిలయన్స్ షేర్ హోల్డర్లకు జాక్‌పాట్ లభించేనా?
జియో ఐపీఓ సందడి: రిలయన్స్ షేర్ హోల్డర్లకు జాక్‌పాట్ లభించేనా?

రిలయన్స్ వ్యాల్యూ అన్‌లాకింగ్

ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ విస్తృత వ్యాపారాల నీడలోనే జియో డిజిటల్, టెలికాం సేవలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఐపీఓకు రావడం వల్ల జియో అసలు విలువ ఎంతనేది మార్కెట్‌లో స్పష్టమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోకు ఉన్న విస్తృతమైన కస్టమర్ బేస్, 5జీ నెట్‌వర్క్, క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అవకాశాలకు స్వతంత్రంగా లభించే విలువ.. ఆర్‌ఐఎల్ మొత్తం సమ్-ఆఫ్-ది-పార్ట్స్ (SOTP) వ్యాల్యుయేషన్‌ను మరింత పెంచుతుందని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకురాలు సీమా శ్రీవాస్తవ తెలిపారు. ఇది హోల్డింగ్ కంపెనీకి ఉండే డిస్కౌంట్‌ను తగ్గించి, ఆర్‌ఐఎల్ షేరు ధరకు బలమైన మద్దతుగా నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు.

సమకూరే నిధులతో అప్పుల తగ్గుదల

జియో ప్లాట్‌ఫార్మ్స్ ప్రణాళిక ప్రకారం ఈ ఐపీఓ ప్రధానంగా కొత్త షేర్ల జారీ (Fresh Issue) రూపంలో సాగనుంది. దీని ద్వారా లభించే ₹37,700 కోట్ల నిధులు నేరుగా జియో ఖాతాకే చేరతాయి. టెలికాం విస్తరణతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. దీనివల్ల జియో ప్లాట్‌ఫార్మ్స్ ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందని, భవిష్యత్తు లాభదాయకత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఆర్‌ఐఎల్ వాటాదారులకు ప్రత్యేక కోటా

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత వాటాదారులకు ఈ ఐపీఓలో ప్రత్యేక రిజర్వేషన్ విభాగం (Shareholder Category) కింద దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది. దీనికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ పరిమాణ వివరాలు ఆర్‌ఐఎల్ దాఖలు చేసే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ద్వారా అధికారికంగా వెల్లడికానున్నాయి.

దీర్ఘకాలిక కోణంలో రిలయన్స్ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఐపీఓ ద్వారా లభించే వ్యాల్యూ అన్‌లాకింగ్ ప్రయోజనాన్ని పొందుతూనే, పోర్ట్‌ఫోలియోలో ఒకే గ్రూప్ షేర్లపై పరిమితికి మించి భారం పడకుండా జాగ్రత్త పడాలని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ రవి సింగ్ స్పష్టం చేశారు. కేవలం స్వల్పకాలిక లాభాల కోసమే కాకుండా, కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ప్రాతిపదికగా తీసుకోవాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.

(గమనిక: ఈ విశ్లేషణ కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More