Defender EV : చిన్న సైజులో డిఫెండర్ ఈవీ.. 2027లో ఉత్పత్తి ప్రారంభిస్తున్న జేఎల్ఆర్!

టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్​ఆర్) కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఆటోమొబైల్ ప్రియులను ఊరిస్తున్న ఎలక్ట్రిక్ ‘డిఫెండర్ ఈవీ’ ఉత్పత్తిని 2027 చివరి నాటికి ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈఓ పీబీ బాలాజీ వెల్లడించారు.

Published on: Nov 17, 2026, 14:02:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

లగ్జరీ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో రాబోతోంది. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేెఎల్​ఆర్) తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ డిఫెండర్ రాకపై అధికారికంగా స్పష్టతనిచ్చింది. 2027లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ డిఫెండర్ మోడళ్లతో పోలిస్తే, రాబోయే ఎలక్ట్రిక్ డిఫెండర్ పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉండనుంది!

చిన్న సైజులో డిఫెండర్ ఈవీ..
చిన్న సైజులో డిఫెండర్ ఈవీ..

గత కొన్నేళ్లుగా ఈ చిన్న సైజు ఎలక్ట్రిక్ డిఫెండర్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజాగా జేఎల్ఆర్ సంస్థ ఒక నిర్దిష్ట కాలపరిమితిని ఖరారు చేసింది.

2027 చివరి నాటికి ఉత్పత్తి.. డిఫెండర్ 90 కంటే తక్కువ శ్రేణిలో!

2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా జేఎల్ఆర్ సీఈఓ పీబీ బాలాజీ ఈ కీలక విషయాలను పంచుకున్నారు. "2027 చివరి నాటికి బ్రిటన్‌లోని హేల్‌వుడ్ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది," అని పీబీ బాలాజీ స్పష్టం చేశారు. మార్కెట్లో విడుదలైన తర్వాత, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘డిఫెండర్ 90’ మోడల్ కంటే దిగువ శ్రేణిలో ఉన్న ఖాళీని ఈ కొత్త వాహనం భర్తీ చేస్తుంది.

ఈ సరికొత్త డిఫెండర్ ఈవీని సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్' (ఈఎంఏ) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఇదే హేల్‌వుడ్ ప్లాంట్‌లో తయారై విడుదల కానున్న ‘రేంజ్ రోవర్ జీటీ’ కారుకు కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. జేఎల్ఆర్ సంస్థ తలపెట్టిన 15 బిలియన్ నుంచి 18 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ రెండు కొత్త ఎస్‌యూవీలు రూపుదిద్దుకుంటున్నాయి. కాగా, 2024 నుంచి ఇప్పటివరకు కంపెనీ 11.5 బిలియన్ పౌండ్ల నిధులను ఇందుకోసం వెచ్చించింది.

ఆఫ్-రోడ్ సామర్థ్యానికి ఇంజనీరింగ్ సవాల్..

వాస్తవానికి ఈఎంఏ ప్లాట్‌ఫారమ్‌ను కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాల కోసమే జేఎల్ఆర్ తొలుత అభివృద్ధి చేసింది. అయితే మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లకు కూడా వీలు కల్పించేలా 2025లో ఈ ప్లాట్‌ఫారమ్ డిజైన్‌లో మార్పులు చేశారు. అయినప్పటికీ, కఠినమైన కొండలు, గుట్టలపై దూసుకెళ్లే బాడీ-ఆన్-ఫ్రేమ్ తరహా ఆఫ్-రోడర్ వాహనంలో అడుగుభాగాన బ్యాటరీని అమర్చడం అంత సులభమైన పని కాదు.

కారు అడుగున భారీ బ్యాటరీ ప్యాక్ ఉంచడం వల్ల, ప్రస్తుత డిఫెండర్ సస్పెన్షన్ జామెట్రీతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనంలో చక్రాల కదలిక, ఎత్తుపల్లాలకు అనుగుణంగా చక్రాలు సర్దుకునే సామర్థ్యం (ఆర్టిక్యులేషన్) పరిమితమయ్యే ప్రమాదం ఉంది. డిఫెండర్ అసలైన ఆఫ్-రోడ్ వారసత్వానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సాంకేతిక సవాలును అధిగమించేందుకు జేఎల్ఆర్ ఇంజనీర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాబోయే నెలల్లో ఈ కారు పవర్‌ట్రెయిన్, ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

మారుతున్న వినియోగదారుల అభిరుచి.. భారత్‌కు వచ్చే అవకాశం ఎంత?

వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతుండటం, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు పెరుగుతుండటంతో జేఎల్ఆర్ తన ఉత్పత్తి వ్యూహాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తోంది. ఈ కొత్త వ్యూహంలో రాబోయే డిఫెండర్ ఈవీ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. తమ పరిధిలోని ప్రతి బ్రాండ్‌కు అనుగుణంగా స్వచ్ఛమైన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లను అందుబాటులో ఉంచడం ద్వారా కస్టమర్లకు మరిన్ని ఎంపికలు ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా డిఫెండర్ ఎస్‌యూవీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అందువల్ల రాబోయే ఎలక్ట్రిక్ డిఫెండర్‌కు కూడా అమెరికా ప్రధాన మార్కెట్ కానుంది. మరోవైపు భారత మార్కెట్లో లగ్జరీ ఎస్‌యూవీలతో పాటు ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. దేశీయంగా డిఫెండర్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, అంతర్జాతీయ విడుదల తర్వాత ఈ ఎలక్ట్రిక్ డిఫెండర్ భారతీయ రోడ్లపైకి కూడా అడుగుపెట్టడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More