Off road SUVs : అడ్వెంచర్ లవర్స్ గెట్ రెడీ! ఇండియాలో లాంచ్ అవుతున్న టాప్-5 ఆఫ్ రోడ్ ఎస్‌యూవీలు ఇవే..
Upcoming off road SUVs in india : భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల హవా పెరగనుంది. మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్, నెక్ట్స్-జెన్ ఫార్చ్యూనర్, హ్యుందాయ్ కొత్త ఆఫ్-రోడర్, టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే సహా 5 పవర్‌ఫుల్ మోడళ్లు లాంచ్ కాబోతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆఫ్-రోడ్, లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ రంగానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ లుక్స్, ఎంతటి కఠినమైన రహదారులనైనా సులువుగా దాటేసే సామర్థ్యం ఉన్న వాహనాల కోసం అడ్వెంచర్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే రాబోయే కొన్నేళ్లలో ఇండియన్ మార్కెట్ మరింత రసవత్తరంగా మారనుంది!

మహీంద్రా, టయోటా, హ్యుందాయ్, జేఎస్‌డబ్ల్యూ వంటి దిగ్గజ కంపెనీలు భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలను సిద్ధం చేస్తున్నాయి. నెక్ట్స్-జెన్ ఫార్చ్యూనర్ నుంచి సరికొత్త ల్యాండ్ క్రూజర్ మోడల్ వరకు.. రాబోయే రోజుల్లో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న టాప్ 5 ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల వివరాలు ఇవే:
1. మహీంద్రా థార్..
ఆఫ్-రోడింగ్ ప్రేమికులకు 'మహీంద్రా థార్' ఒక డ్రీమ్ కార్. కంపెనీ తన పాపులర్ టూ-డోర్ థార్ మోడల్‌ను కొత్త అప్‌డేట్స్‌తో త్వరలోనే లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల వచ్చిన 'థార్ రాక్స్' తరహాలోనే దీనికి కూడా కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, సీ-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు రానున్నాయి.
క్యాబిన్ లోపల వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు తోడయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
2. జేఎస్‌డబ్ల్యూ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ..
జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీతో ప్యాసింజర్ వాహనాల విభాగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘చెరీ జెటోర్ ట్రావెలర్ సీ-డీఎం’ మోడల్ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంటోంది.
అట్రాక్టివ్ బాక్సీ డిజైన్‌తో రానున్న ఈ కారులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించనున్నారు. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా దీని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను డిజైన్ చేస్తున్నారు. భారత మార్కెట్లో ఈ తరహా టెక్నాలజీతో రాబోతున్న తొలి ఎస్‌యూవీలలో ఇదొకటి కానుంది.
3. నెక్ట్స్-జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్..
ఇండియన్ మార్కెట్లో ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌ని ఏలుతున్న టయోటా ఫార్చ్యూనర్ త్వరలోనే కొత్త అవతారంలోకి మారనుంది. ఆల్-న్యూ నెక్ట్స్ జనరేషన్ ఫార్చ్యూనర్‌ను 2027 ప్రథమార్ధంలో విడుదల చేసేందుకు టయోటా ప్లాన్ చేస్తోంది. పూర్తి కొత్త డిజైన్ భాష, లగ్జరీ క్యాబిన్‌తో ఇది అలరించనుంది.
ఇందులో 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, లెవెల్-2 అడాస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఉన్న పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లనే టోయోటా ఇందులోనూ కొనసాగించనుంది.
4. హ్యుందాయ్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ..
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ కూడా ఇండియా కోసం ఒక పక్కా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. పూర్తి సమాచారాన్ని ఇంకా బయటపెట్టనప్పటికీ, లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్, జిమ్నీలకు పోటీగా రగ్గడ్ డిజైన్‌తో ఇది రానుంది. దీనిని పెట్రోల్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లలో తీసుకొచ్చే అవకాశం ఉంది.
హైబ్రిడ్ వెర్షన్‌లో వెనుక చక్రాలకు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా పవర్ అందించే ‘ఆల్-వీల్ డ్రైవ్’ సిస్టమ్‌ను కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ఇది 2028 నాటికి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
5. టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే..
టయోటా తన ప్రతిష్టాత్మక 'ల్యాండ్ క్రూజర్' సిరీస్‌లో సామాన్యులకు అందుబాటులో ఉండేలా 'ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే'ని భారత్‌కు తీసుకొస్తోంది. ఇది ఫార్చ్యూనర్ కంటే క్రింది విభాగంలో కొలువుదీరనుంది. అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం దీనిని ల్యాడర్-ఫ్రేమ్ చాసిస్‌పై తయారు చేస్తున్నారు.
గ్లోబల్ మోడల్‌లో 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లను అందించనున్నారు. భవిష్యత్తులో హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు కూడా రానున్నాయి. భారత మార్కెట్లో 2028 చివరలో ఈ ఎస్‌యూవీ లాంచ్ కానుంది.
ఈ సరికొత్త ఎస్‌యూవీల రాకతో భారత ఆఫ్-రోడ్ కార్ల మార్కెట్ మరింత క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


