కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడు?.. 8వ పే కమిషన్ భేటీ షెడ్యూలు ఇదీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు జీతాల పెంపు, కరువు భత్యం (డీఏ) సవరణ అంశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. జూలై 2026 విడత డీఏ పెంపుపై కేంద్ర మంత్రివర్గం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది.

Published on: Sep 2, 2026, 08:27:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అఖిల భారత పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (AICPI-IW) ఆధారంగా ఏడాదికి రెండుసార్లు డీఏను సవరిస్తారు. జనవరి నుంచి జూన్, జూలై నుంచి డిసెంబరు కాలానికిగానూ ఈ లెక్కలు వేస్తారు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్రం డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి (2 శాతం పెంపు) పెంచింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను కూడా 60 శాతానికి సవరించింది.

కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడు?.. 8వ పే కమిషన్ భేటీ షెడ్యూలు ఇదీ
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడు?.. 8వ పే కమిషన్ భేటీ షెడ్యూలు ఇదీ

ప్రస్తుతం జూలై 2026 నుంచి వర్తించే రెండో విడత పెంపుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ డీఏ 3 శాతం పెరిగితే, అది 60 శాతం నుంచి 63 శాతానికి చేరుకుంటుంది. అయితే, కేంద్ర క్యాబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు దీనిపై పూర్తి స్పష్టత రాదు.

8వ వేతన సంఘం సంప్రదింపుల హోరు

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబరు 3న జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ తాత్కాలిక సంఘం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, ఇతర భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి నివేదిక సిద్ధం చేస్తుంది. ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, పెన్షన్లు, సేవా పరిస్థితుల మెరుగుదలపై ఈ కమిషన్ సిఫార్సులు చేయనుంది.

ఇటీవలే జైపూర్‌లోని హెచ్‌సీఎమ్ రిపా (HCM RIPA) వద్ద కీలక సమావేశం ముగిసింది. ఇందులో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని తమ అభిప్రాయాలను, డిమాండ్లను కమిషన్‌కు వివరించారు.

రాబోయే వేతన సంఘం సమావేశాల షెడ్యూల్

  • 8వ వేతన సంఘం రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించనుంది.
  • సెప్టెంబరు 9న పుదుచ్చేరిలో సంప్రదింపులు
  • సెప్టెంబరు 16 నుంచి 18 వరకు ఛండీగఢ్‌లో భేటీలు
  • అక్టోబరు 7, 8 తేదీల్లో బెంగళూరులో సమావేశాలు
  • ఈ కమిషన్ తన తుది సిఫార్సుల నివేదికను 2027 మే-జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జీతాల పెంపు

ఉద్యోగుల మూల వేతనం సవరణకు 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అత్యంత కీలకం. గతంలో 6వ వేతన సంఘం 1.86, 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేశాయి. అయితే, 8వ వేతన సంఘంలో అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సాధించేందుకు బీపీఎంఎస్ (BPMS), ఎన్సీ జేసీఎం (NC JCM), ఏఐడీఈఎఫ్ (AIDEF) వంటి ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కమిషన్ ఇచ్చే సిఫార్సులు, దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఉద్యోగుల భవిష్యత్తు జీతభత్యాలు ఖరారవుతాయి.

మరిన్ని తాజా వివరాల కోసం ఉద్యోగులు 8వ పే కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://8cpc.gov.in ను సందర్శించవచ్చు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More