బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. కొత్త పార్టీ దిశగా మాజీ ఐపీఎస్ అడుగులు?

తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.

Published on: Jun 5, 2026, 11:10:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం ఆమోదించారు.

తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై (PTI)
తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై (PTI)

మాజీ ఐపీఎస్ అధికారి అయిన కుప్పుసామి అన్నామలై పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది.

తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నెల రోజులకు అన్నామలై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో సినీ నటుడు సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాగా, బీజేపీ మాత్రం ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. గతంలో నాలుగు స్థానాలు ఉన్న బీజేపీ, ఈసారి కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఓట్ల శాతం మాత్రం గతంలోని 2.67 శాతం నుండి స్వల్పంగా 2.97 శాతానికి పెరిగింది.

కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడంతోనే ఆయన అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బల చేకూరింది. అన్నామలై త్వరలోనే సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

"దయచేసి కొద్దిరోజులు వేచి ఉండండి. మరో రెండు రోజుల్లో మనం కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం" అని ఈ వారంలో కొత్త పార్టీ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు అన్నామలై సమాధానమిచ్చారు.

దీనిని బట్టి చూస్తే ఆయన త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More