Kerala southwest monsoon : 3 కూడా కాదు! జూన్ 4 తర్వాతే కేరళలోకి రుతుపవనాలు?
kerala southwest monsoon delay : నైరుతు రుతుపవనాల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. మే 26, జూన్ 1వ తేదీలు మిస్ అయిన అనంతరం రుతుపవనాలు జూన్ 3న కేరళను తాకే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా మిస్ అయ్యేలా ఉంది.
2026 నైరుతి రుతపవనాలు.. దేశంలోకి వచ్చేందుకు మొండికేస్తున్నాయి! వాస్తవానికి మే 26నే రుతపవనాలు కేరళను తాకాల్సి ఉంది. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా అలా జరగలేదు. అనంతరం, జూన్ 3న మాన్సూన్ కేరళలోకి వచ్చే అవకాశం ఉందని ఐఎండీ (భారత వాతావరణశాఖ) అంచనా వేసింది. కానీ ఇప్పుడు, 3వ తేదీన కూడా రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. జూన్ 4 తర్వాతే అవి కేరళను తాకొచ్చని సమాచారం.

అంతేకాదు, బలమైన గాలి వ్యవస్థలు లోపించడం వల్ల ప్రారంభంలో ఈ రుతుపవనాల విస్తరణ చాలా నెమ్మదిగా, బలహీనంగా ఉండవచ్చని ఐఎండీ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. దీనికి తోడు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు బలపడుతుండటంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం (90% ఎల్పీఏ) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
కేరళలో బలహీనంగా రుతుపవనాల ప్రారంభం !
భారత వాతావరణ శాఖ ఉపయోగించే గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (జీఎఫ్ఎస్) కంప్యూటర్ మోడల్స్ ప్రకారం.. దక్షిణ భారతదేశంపై రుతుపవనాలు బలోపేతం కావడానికి అవసరమైన ఎగువ-స్థాయి తూర్పు గాలులు జూన్ 5-6 తర్వాతే పూర్తిగా స్థిరపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం పశ్చిమ దిశ నుంచి వస్తున్న ‘వెస్ట్రన్ డిస్ట్రబెన్స్’ వాతావరణ వ్యవస్థ పూర్తిగా దాటిపోతేనే ఈ గాలులు పుంజుకుంటాయి. అప్పటివరకు కేరళ తీరంలో రుతుపవనాల కదలికలు మందకొడిగానే సాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జూన్ 1 (సోమవారం) నుంచి గాలుల వేగం క్రమంగా పెరుగుతున్నప్పటికీ, రుతుపవనాల పూర్తి స్థాయి విస్తరణకు మరికొంత సమయం పట్టవచ్చు.
రుతుపవనాల ప్రకటనకు ఐఎండీ నిబంధనలు..
- కేరళలో నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయని ప్రకటించడానికి ఐఎండీ మూడు ప్రధాన నిబంధనలను ఒకేసారి పరిగణనలోకి తీసుకుంటుంది:
- కేరళలోని నిర్దేశిత వాతావరణ కేంద్రాలలో కనీసం 60శాతం శాతం చోట్ల నిరంతరాయంగా వర్షాలు కురవాలి.
- అరేబియా సముద్రంపై పశ్చిమ గాలులు నిర్దిష్ట వేగంతో వీయాలి.
- తగినంత మొత్తంలో దట్టమైన మేఘావృతం ఉండాలి.
వర్షపాతం అంచనాలను తగ్గించిన ఐఎండీ..
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఆందోళన వ్యక్తం చేసింది.
తొలి అంచనా: మొదట దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 92 శాతం వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
తాజా సవరణ: ఎల్ నినో తీవ్రత పెరుగుతుండటంతో గత వారం ఈ అంచనాను 90 శాతానికి తగ్గించారు. ఐఎండీ నిబంధనల ప్రకారం 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని 'డెఫిషియంట్' (కరవు పరిస్థితులు) గా పరిగణిస్తారు.
ప్రస్తుతం ఉత్తర, మధ్య భారత దేశంలో ఎండ తీవ్రత, తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతున్నందున, ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ వర్షాలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుత వెదర్ మోడల్స్ ప్రకారం రుతుపవనాలు నెమ్మదిగా ప్రారంభమై, ఆ తర్వాత క్రమంగా పుంజుకునే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


