Kia India Price Hike : కస్టమర్లకు గట్టి షాకిచ్చిన కియా! భారీగా పెరగనున్న కార్ల ధరలు..
Cars price hike news : భారత మార్కెట్లో కియా కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. పెరుగుతున్న ముడిసరుకు, నిర్వహణ ఖర్చుల భారం వల్ల జులై 1, 2026 నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. పూర్తి వివరాలు..
సొంత కారు కొనాలనుకునే వారికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘కియా ఇండియా’ గట్టి షాకిచ్చింది. దేశీయ మార్కెట్లో లభిస్తున్న తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ధరల పెంపు నిర్ణయం జులై 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. వాహనాల మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా 2 శాతం వరకు ఉంటుందని కియా పేర్కొంది.

కియా నుంచి కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లపై ఇది అదనపు భారం కానుంది.
కియా కార్ల ధరల పెంపు- కారణం ఏంటి?
కార్ల తయారీకి అవసరమయ్యే ముడిసరుకు ధరలు భారీగా పెరగడం, కంపెనీ నిర్వహణ ఖర్చులు ఎక్కువవ్వడం వల్లే ఈసారి ధరల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదని కియా ఇండియా స్పష్టం చేసింది. పెరిగిన ఖర్చుల భారాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకే ఈ స్వల్ప ధరల పెంపును చేపట్టినట్లు వెల్లడించింది.
గత కొన్ని నెలలుగా భారతదేశంలో వాహనాల ధరలను సవరిస్తున్న ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో ఇప్పుడు కియా కూడా చేరింది. కేవలం బడ్జెట్ కార్ల తయారీ సంస్థలే కాకుండా, లగ్జరీ కార్ల బ్రాండ్లు సైతం ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడాన్ని ప్రధాన కారణంగా చూపుతూ వరుసగా ధరలను పెంచుకుంటూ పోతున్నాయి.
ఇటీవలే ప్రముఖ కార్ల సంస్థ మారుతీ సుజుకీ జూన్ 2026 నుంచి అమల్లోకి వచ్చేలా తన వివిధ మోడళ్లపై గరిష్టంగా రూ. 30,000 వరకు ధరలను పెంచింది. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా సైతం ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై రూ. 12,800 వరకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ బివైడి కూడా తన అన్ని మోడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.
ఇక దేశీయ దిగ్గజం టాటా మోటార్స్.. త్వరలోనే తమ కార్ల ధరలను పెంచనుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
రేస్‌లో కియా ఒక్కటే కాదు!
నిజానికి భారత ఆటోమొబైల్ రంగంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా ధరల సవరణలు జరిగాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి.
ఆ సమయంలో మారుతీ సుజుకీ కొన్ని నిర్దిష్ట మోడళ్లపై 4 శాతం వరకు ధరలను పెంచగా, హ్యుందాయ్ సంస్థ 3 శాతం వరకు అదనపు భారాన్ని మోపింది. అదే సమయంలో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీలు, కమర్షియల్ వాహనాల ధరలను 2.5 శాతం వరకు పెంచింది.
ఇదే బాటలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన వాహనాల శ్రేణిపై 2 శాతం వరకు, రెనాల్ట్ ఇండియా కూడా 2 శాతం వరకు ధరలను పెంచాయి. లగ్జరీ కార్ల విభాగంలో ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా సంస్థలు తమ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచగా, టాటా మోటార్స్ సంస్థ ఇంధన ఆధారిత (ఐసీఈ) ప్యాసింజర్ వాహనాలపై సగటున 0.5 శాతం మేర ధరలను పెంచింది. ఈ వరుస ధరల పెంపుల నేపథ్యంలో, ఇప్పుడు కియా ఇండియా కూడా తన కార్ల ధరలను పెంచుతూ జులై నుంచి కస్టమర్లకు కొత్త ధరల షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


