New SUVs in India : 2 నెలలు.. 3 క్రేజీ ఎస్‌యూవీలు- టాటా, కియా, నిస్సాన్ నుంచి కొత్త మోడల్స్!
Upcoming SUVs in India : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. వచ్చే రెండు నెలల్లో మారుతీ, హ్యుందాయ్‌లకు పోటీగా టాటా సియెర్రా ఈవీ, నిస్సాన్ టెక్టాన్, కియా సైరోస్ ఈవీ మోడళ్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను చూసేయండి..
గత ఆరు నెలలుగా సరికొత్త మోడళ్ల లాంచ్‌లతో భారతీయ ఆటోమొబైల్ రంగం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా, రెనాల్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు వరుస పెట్టి కొత్త కార్లను మార్కెట్లోకి వదిలాయి. అయితే ఈ జోరు ఇక్కడితో ఆగిపోవడం లేదు! వచ్చే రెండు నెలల్లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ మరిన్ని సరికొత్త మోడళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే 'మాస్-మార్కెట్ ఎస్‌యూవీ' విభాగంలో మూడు క్రేజీ కార్లు భారత రోడ్లపైకి రాబోతున్నాయి.

మొబైల్ మార్కెట్ లాగే కార్ల మార్కెట్లోనూ భారీ అంచనాలున్న ‘టాటా సియెర్రా ఈవీ’ జూన్ 30న అధికారికంగా విక్రయానికి రానుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే, అంటే జులై 9, 2026న నిస్సాన్ ఇండియా తన సరికొత్త ‘టెక్టాన్’ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇది పాపులర్ రెనాల్ట్ డస్టర్ కారుకు రీబ్యాడ్జ్ వర్షన్‌గా వస్తోంది. ఇక ఆగస్టు 2026లో కియా ఇండియా తన ఎలక్ట్రిక్ శ్రేణిని మరింత విస్తరిస్తూ ‘సైరోస్ ఈవీ’ని లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ మూడు మోడళ్లలో ఉన్న ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు చూద్దాము.
టాటా సియెర్రా ఈవీ..
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్త టాటా సియెర్రా ఈవీ మోడల్.. కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ కార్ల మధ్యలో నిలవనుంది. కంపెనీకి చెందిన అడ్వాన్స్‌డ్ 'Acti.ev+' ప్లాట్‌ఫారమ్‌పై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హారియర్ ఈవీ లాగే 65కేడబ్ల్యూహెచ్, 75కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పంచుకునే అవకాశం ఉంది. ఈ సియెర్రా ఈవీ కారు రియర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుందని టాటా సంస్థ ఇప్పటికే ధృవీకరించింది.
సాధారణ ఇంధన (ఐసీఈ) కార్లతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ వర్షన్‌లో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, సరికొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, గాలి నిరోధకతను తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన అలాయ్ వీల్స్, ప్రత్యేకమైన ‘.ev’ బ్యాడ్జింగ్‌ను అందించారు. కారు లోపలి లేఅవుట్ సాధారణ మోడల్ లాగే ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనానికి సరిపోయేలా కొన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను క్యాబిన్ లోపల జోడించారు.
నిస్సాన్ టెక్టాన్..
కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్ల ప్రకారం.. నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీని ఆ బ్రాండ్‌కు చెందిన అంతర్జాతీయ ఫ్లాగ్‌షిప్ మోడల్ 'పాట్రోల్' ఎస్‌యూవీ డిజైన్ స్ఫూర్తితో రూపొందించారు. దీని ముందు భాగంలో క్రోమ్ స్ట్రిప్స్‌తో కూడిన వెడల్పైన గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్-టోన్ బంపర్ ఉండబోతున్నాయి. అయితే, కారు పక్క భాగం మాత్రం ఉబ్బెత్తుగా ఉండే వీల్ ఆర్చ్‌లు, డోర్ హ్యాండిల్స్ అమరికతో దాదాపు రెనాల్ట్ డస్టర్ లాగే కనిపిస్తుంది. ఇవి కాకుండా సరికొత్త డిజైన్ కలిగిన అలాయ్ వీల్స్, వెనుక వైపు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, సింగిల్-టోన్ టెయిల్ గేట్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సాంకేతిక పరంగా నిస్సాన్ టెక్టాన్ తన ఇంజన్, ఫీచర్లు, విడిభాగాలను రెనాల్ట్ డస్టర్‌తో పంచుకోనుంది. ఇందులో 100 హార్స్‌పవర్ ఇచ్చే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 163 హార్స్‌పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. భవిష్యత్తులో ఇందులో ఒక హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా నిస్సాన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కియా సైరోస్ ఈవీ..
సాధారణ పెట్రోల్/డీజిల్ సైరోస్ కారు లాగే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కియా సైరోస్ ఈవీని కూడా కంపెనీ 'కే1' ప్లాట్‌ఫారమ్‌పైనే డిజైన్ చేసింది. ఇది చూడటానికి మంచి ఎత్తుతో కూడిన 'టాల్‌బాయ్' స్టాన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోడల్ కాబట్టి దీనికి సరికొత్త డిజైన్ గ్రిల్, కారు ముందు భాగంలో ఛార్జింగ్ సాకెట్ ఫ్లాప్, భిన్నమైన అలాయ్ వీల్స్‌ను ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అత్యంత ఆధునికమైన వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్), వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) ఫీచర్లను అందిస్తున్నారు. దీని ద్వారా కారు బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు లేదా వేరే ఈవీ కార్లకు ఛార్జింగ్ ఇచ్చుకోవచ్చు.
ఈ కారు పవర్‌ట్రెయిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీలో వాడే 42కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లనే ఈ కియా సైరోస్ ఈవీలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ మూడు ఎస్‌యూవీల రాకతో భారత కార్ల మార్కెట్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
మరి వీటిల్లో మీరు దేని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? మీరు దేనిని కొంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


