Kia Seltos Hybrid : కియా సెల్టోస్​ హైబ్రిడ్ ఇదిగో! మైలేజ్, ఇండియా లాంచ్ అప్డేట్స్..

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా '2026 ప్యారిస్ మోటార్ షో' వేదికగా సెకండ్ జనరేషన్ 'సెల్తోస్ హైబ్రిడ్' ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇ-ఎలాక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ (e-AWD) టెక్నాలజీ, 178 బిహెచ్‌పి పవర్ మరియు అత్యాధునిక ఇంటీరియర్‌తో వస్తున్న ఈ కారు 2027 నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

Published on: Oct 13, 2026, 11:21:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్లోబల్ ఆటోమొబైల్ రంగాన్ని ఆకర్షిస్తున్న '2026 ప్యారిస్ మోటార్ షో' వేదికగా ప్రముఖ వాహనాల తయారీ సంస్థ 'కియా' తమ పాపులర్ ఎస్‌యూవీ 'సెల్టోస్'కి చెందిన హైబ్రిడ్ వర్షన్‌ను ఆవిష్కరించింది. ఇక ప్రస్తుతం ఐసీఈ (పెట్రోల్, డీజిల్) ఇంజిన్ రూపంలో భారత రోడ్లపై ఆదరణ పొందుతున్న సెల్టోస్, ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ ద్వారా 2027 నాటికి దేశీయ విపణిలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది.

కియా సెల్టోస్ హైబ్రిడ్ ఇదిగో..
కియా సెల్టోస్ హైబ్రిడ్ ఇదిగో..

ఐరోపా మార్కెట్లో గ్లోబల్ బ్రాండ్ హోదాను మరింత బలోపేతం చేసేందుకు కియా ఇప్పటికే విక్రయిస్తున్న స్పోర్టేజ్, నిరో, కే4 ఎలక్ట్రిఫైడ్ వాహనాల సరసన ఈ కొత్త ఎస్‌యూవీని నిలబెట్టింది. బ్రాండ్ చరిత్రలోనే తొలిసారిగా కచ్చితమైన టార్క్ డిస్ట్రిబ్యూషన్, మెరుగైన ట్రాక్షన్ అందించే 'ఈ-ఏడబ్ల్యూడీ' (ఎలక్ట్రిక్ ఆల్ వీల్ డ్రైవ్) వ్యవస్థను ఇందులో పొందుపరచడం ఈ వాహన ప్రత్యేకత.

కియా సెల్టోస్ హైబ్రిడ్- పవర్‌ఫుల్ ఇంజిన్, మైలేజ్ లెక్కలు..

కియా సెల్టోస్ హైబ్రిడ్ వాహనంలో 102 బీహెచ్​పీ పవర్, 141 ఎన్​ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి తోడుగా 129 బీహెచ్​పీ పవర్, 388 ఎన్​ఎం టార్క్ అందించే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు. ఇవి రెండూ కలసి మొత్తంగా 178 బీహెచ్​పీ అసాధారణమైన పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజిన్ శక్తిని చక్రాలకు చేరవేసేందుకు 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డీసీటీ) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

గ్లోబల్ ప్రమాణాల (డబ్ల్యూఎల్​టీపీ) ప్రకారం ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ లీటరుకు 14.71 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. స్వల్ప దూరాల ప్రయాణాలకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పైనే నడిచే సదుపాయం కూడా ఉంది. అయితే ఐరోపాలో ప్రదర్శించిన మోడల్‌లో ఈ-ఏడబ్ల్యూడీ వ్యవస్థ ఉన్నప్పటికీ, భారతదేశానికి రాబోయే సెల్టోస్ హైబ్రిడ్ మోడల్ మాత్రం దేశీయ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

కియా సెల్టోస్ హైబ్రిడ్- కొత్త క్యాబిన్ లేఔట్, అధునాతన ఫీచర్లు..

ప్యారిస్‌లో ప్రదర్శించిన టాప్-ఎండ్ ‘ఎక్స్-లైన్’ వేరియంట్ ఇంటీరియర్‌లో కియా పలు ఆకర్షణీయమైన మార్పులు చేసింది. హైబ్రిడ్ బ్యాటరీ ప్యాక్‌ను బూట్ స్పేస్ కింద భాగంలో అమర్చడం వల్ల ఈ కారులో స్పేర్ వీల్ ఉండదు.

వాహన క్యాబిన్‌లో ప్రధాన మార్పు గేర్ సెలెక్టర్ వద్ద జరిగింది. సెంటర్ కన్సోల్‌లో ఉండే గేర్ లీవర్‌ను తొలగించి స్టీరింగ్ కాలమ్‌పై ఉన్న స్లాట్‌కు మార్చారు. దీనివల్ల రెండు సీట్ల మధ్య బోలెడంత స్థలం అందుబాటులోకి వచ్చి అదనపు కప్ హోల్డర్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లభించింది. ఆల్-బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్, హెడ్-అప్ డిస్‌ప్లే, కూలింగ్/వెంటిలేటెడ్ సదుపాయం ఉన్న ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కియా సెల్టోస్ హైబ్రిడ్- భారత్‌లో లాంచ్ ఎప్పుడు? పోటీ ఎవరితో?

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధిక మైలేజ్ ఇచ్చే మైల్డ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు కొనుగోలుదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక భారత మార్కెట్లో ఇప్పటికే విక్రయమవుతున్న సోరెంటో, కార్నివాల్ హైబ్రిడ్ మోడళ్ల వరుసలో ఈ సెల్టోస్ హైబ్రిడ్ చేరనుంది.

2027లో భారత రోడ్లపైకి రానున్న ఈ ఎస్‌యూవీ, ఇప్పటికే ఆదరణ పొందుతున్న టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, విక్టోరిస్, రాబోయే హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More