Tech Layoff : 21ఏళ్ల పాటు ‘ప్రాణం పెట్టి’ పని చేసిన ఉద్యోగిపై దిగ్గజ కంపెనీ వేటు!
Xbox layoffs news : ప్రముఖ గేమింగ్ కంపెనీ ఎక్స్బాక్స్కి లేఆఫ్స్ సెగ తగిలింది. 3వేలకుపైగా ఉద్యోగాలు తమ జాబ్స్ని కోల్పోయారు. సంస్థతో 21ఏళ్ల పాటు పనిచేసిన ఒక వ్యక్తి సైతం వీరిలో ఉన్నారు. పాటు ప్రాణం పెట్టి పని చేసిన చోట, ఇప్పుడు తనని లేఆఫ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత అందిపుచ్చుకునే రేసులో నిలిచేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు ఒకవైపు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఇతర విభాగాలలో ఖర్చులను తగ్గించుకునేందుకు సిబ్బందిని ఇంటికి పంపించేస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ కాస్ట్ కటింగ్ డ్రైవ్‌లో భాగంగా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి సుమారు 4,800 మందిని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఎక్స్‌బాక్స్ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్!
మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం దాని అనుబంధ గేమింగ్ బ్రాండ్ 'ఎక్స్‌బాక్స్' (Xbox) ను కోలుకోలేని దెబ్బతీసింది. ఎక్స్‌బాక్స్ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరగడం ఇదే మొదటిసారి. మొత్తం తొలగింపుల్లో దాదాపు 3,200 ఉద్యోగాలు కేవలం గేమింగ్ విభాగం నుంచే ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నాలుగు ప్రధాన గేమింగ్ స్టూడియోలను విక్రయించడానికి లేదా వాటిని విడిగా మార్చడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది.
21 ఏళ్ల సర్వీస్ ఉన్నా తప్పని వేటు!
ఈ లేఆఫ్స్ ప్రభావం కేవలం కొత్తగా చేరిన వారిపైనే కాకుండా, దశాబ్దాలుగా కంపెనీని నమ్ముకున్న సీనియర్లపై కూడా పడింది. ఎక్స్‌బాక్స్ విభాగంలో సుమారు 21 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి మాథ్యూ లెక్లెయిర్ కూడా ఈ లేఆఫ్స్ బారిన పడ్డారు. ఆయన తన లింక్డ్‌ఇన్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"రెండు దశాబ్దాలకు పైగా నా రక్తాన్ని, చెమటను ధారపోసి ఎక్స్‌బాక్స్ కోసం ఎన్నో అద్భుతమైన ప్రొడక్ట్స్ అందించాను. కానీ నా 21 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. అవును, నేను కూడా ఈ లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయాను," అని సియాటెల్‌కు చెందిన మాథ్యూ లెక్లెయిర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంతటి బాధాకరమైన వార్తను పంచుకుంటూనే, "ఇంతకీ ప్రస్తుతం ఎవరైనా ఉద్యోగాలు ఇస్తున్నారా?" అంటూ ఒక స్మైలీ ఎమోజీని జతచేశారు.
ఐఐ రేసులో నిలిచేందుకేనా?
మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం చాట్ జీపీటీ వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతలను విస్తరించడంపైనే పూర్తి దృష్టి పెట్టింది. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ పవర్ వంటి ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం మైక్రోసాఫ్ట్ పదుల బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చులను తట్టుకోవడానికి వీలుగానే ఇతర సాంప్రదాయ విభాగాల్లో బడ్జెట్ కోతలు విధిస్తోంది.
మరోవైపు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ స్పందిస్తూ సిబ్బందికి అంతర్గత లేఖ రాశారు.
"ఈ నిర్ణయం ఎంతో బాధాకరమైనదని నాకు తెలుసు. ఎక్స్‌బాక్స్‌ను నిర్మించడంలో తమ సృజనాత్మకతను ఉపయోగించిన వారిపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. సంస్థను కొనుగోలు చేసినప్పుడు కొందరు మా వద్దకు వచ్చారు, మరికొందరు ఈ రంగాన్ని ప్రేమించి ఇక్కడ చేరారు. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రతిభను లేదా అంకితభావాన్ని తక్కువ చేసి చూపేవి కావు," అని ఆశా శర్మ పేర్కొన్నారు.
ఈ తొలగింపుల్లో భాగంగా 1,600 మందిని తక్షణమే విధుల్లోంచి లేఆఫ్ చేయగా, మిగిలిన వారిని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి దశలవారీగా పంపించనున్నారు.
ఉద్యోగుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తోందా?
ఈ లేఆఫ్స్ నేపథ్యంలో ఉద్యోగుల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. మనుషుల స్థానంలో కృత్రిమ మేధస్సును వాడుతున్నారా అనే అనుమానాలపై మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమీ కోల్‌మన్ స్పష్టత ఇచ్చారు. ఉద్యోగం కోల్పోయిన వారి స్థానంలోకి ఏఐని తీసుకురావడం లేదని, అయితే కంపెనీలో పనులు జరిగే విధానాన్ని ఆటోమేషన్ పూర్తిగా మారుస్తోందనే విషయాన్ని కస్టమర్లు, సిబ్బంది గమనించాలని ఆమె పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


