టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల వివాదం: తండ్రికి లక్ష్మీ వేణు విభజన నోటీసు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం ముదిరింది. ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో తనకు సమాన వాటా కావాలంటూ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు అధికారికంగా నోటీసు పంపారు. తన కుమార్తెకు ఆస్తుల్లో చట్టబద్ధమైన హక్కు ఉందని తల్లి మల్లికా శ్రీనివాసన్ సమర్థించారు.
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యాపార కుటుంబాల్లో ఒకటైన టీవీఎస్ (TVS) గ్రూప్‌లో ఆస్తులు, వారసత్వ వివాదం తీవ్రస్థాయికి చేరింది. తమ కుటుంబ విభాగానికి చెందిన ఉమ్మడి ఆస్తులను చట్టబద్ధంగా విభజించాలని కోరుతూ పారిశ్రామికవేత్త లక్ష్మీ వేణు అధికారికంగా నోటీసు పంపారు. వారసత్వ చట్టం ప్రకారం ఆస్తుల్లో తనకు సమాన వాటా రావాలని, తన హక్కులను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని ఆమె ఆరోపించారు. టీవీఎస్ గ్రూప్ ఛైర్మన్ ఎమిరిటస్ వేణు శ్రీనివాసన్, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టాఫే - TAFE) ఛైర్మన్ మల్లికా శ్రీనివాసన్‌ల కుమార్తె లక్ష్మీ వేణు. టీవీఎస్ వ్యవస్థాపకులు టీవీ సుందరం అయ్యంగార్ మునిమనవరాలు కూడా.

ఎవరీ లక్ష్మీ వేణు?
నలభై రెండేళ్ల లక్ష్మీ వేణు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ, యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో డాక్టరేట్ పట్టా పొందారు. చిన్న వయసు నుంచే కుటుంబ వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల తయారీ సంస్థల్లో ఒకటైన 'టాఫే'కు ఆమె ప్రస్తుతం వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టాఫేలో కీలక విభాగమైన టాఫే మోటార్స్ అండ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (టీఎంటీఎల్ - TMTL) డైరెక్టర్‌గానూ ఉన్నారు. బిట్స్ పిలానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం టెక్ స్టార్టప్ నడుపుతున్న మహేష్ గోగినేనిని ఆమె వివాహం చేసుకున్నారు.
లక్ష్మీ వేణు డిమాండ్లు ఏమిటి?
కుటుంబ పెద్దగా తన బాధ్యతలను నిర్వర్తించి, ఆస్తుల విభజనను న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరిపించాలని కోరుతూ తండ్రి వేణు శ్రీనివాసన్‌కు లక్ష్మీ వేణు విభజన నోటీసు జారీ చేశారు. 2005లో సవరించిన హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తనకు న్యాయమైన వాటా పొందే హక్కు ఉందని, ఆస్తుల పంపకాన్ని కోరే స్వతంత్ర అధికారం తనకుందని ఆమె సోమవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 6 కింద కుమార్తెలకు కల్పించిన సమాన హక్కుల ఆధారంగా ఆమె తన వాదనను వినిపిస్తున్నారు.
వీఎస్ ట్రస్ట్ (VS Trust), ఇతర హోల్డింగ్ సంస్థల ద్వారా ఉన్న కుటుంబ ఆస్తులను విభజించాలని ఆమె కోరుతున్నారు. "2020 టీవీఎస్ కుటుంబ ఒప్పందం కింద వేణు శ్రీనివాసన్ విభాగానికి కేటాయించిన వ్యాపారాలు, ఆస్తులు ఇందులో ఉన్నాయి. టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ సంస్థల్లోని వాటాలు కూడా ఇందులోకి వస్తాయి" అని లక్ష్మీ వేణు వివరించారు.
టీవీఎస్ కుటుంబ ఒప్పందం తమ వేణు శ్రీనివాసన్ కుటుంబ అంతర్గత విభజన కాదని ఆమె పేర్కొన్నారు. తమ సొంత కుటుంబంలో ఆస్తుల పంపకం ఇప్పటివరకు మొదలే కాలేదని, ముగియడం అసలే జరగలేదని స్పష్టం చేశారు. కేవలం కంపెనీల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నంత మాత్రాన ఏకపక్ష యాజమాన్య హక్కులు సంక్రమించవని, ఇతర కుటుంబ సభ్యుల చట్టబద్ధమైన హక్కులు రద్దు కావని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తనకు రావాల్సిన వాటాను అన్యాయంగా నిరాకరిస్తున్నారని, తన చట్టబద్ధమైన హక్కులను విస్మరించి తన సోదరుడికే ప్రయోజనాలను కట్టబెడుతున్నారని లక్ష్మీ ఆరోపించారు. ఇది చట్ట ఉల్లంఘనతో పాటు నమ్మకద్రోహం కూడా అని వ్యాఖ్యానించారు. "చట్టంలో గానీ, ఆధునిక భారతదేశంలో గానీ పితృస్వామ్యానికి చోటు లేదు. ఏకపక్ష నిర్ణయాలు లేదా కార్పొరేట్ ఒప్పందాల ద్వారా ఉమ్మడి కుటుంబ ఆస్తిపై కుమార్తెలకు ఉన్న హక్కులను కాలరాయలేరు" అని ఆమె తేల్చిచెప్పారు. కుటుంబ సభ్యులందరి హక్కులను గౌరవిస్తూ, హుందాగా, సామరస్యపూర్వకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కుమార్తెకు అండగా నిలిచిన మల్లికా శ్రీనివాసన్
ఈ వివాదంపై లక్ష్మీ వేణు తల్లి, టాఫే ఎండీ మల్లికా శ్రీనివాసన్ స్పందిస్తూ తన కుమార్తెకు కుటుంబ ఆస్తుల్లో చట్టబద్ధమైన హక్కు ఉందని సమర్థించారు. "సామరస్యపూర్వక పరిష్కారం కోసం చేసిన అభ్యర్థనలు ఇప్పటివరకు అర్థవంతంగా, సకాలంలో ముందుకు సాగకపోవడం దురదృష్టకరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ఒక తల్లిగా నాకు కొడుకు, కూతురు అన్ని విషయాల్లో సమానమే. కుటుంబ ఆస్తుల్లో సుదర్శన్‌తో (లక్ష్మీ సోదరుడు) సమానంగా లక్ష్మికి కూడా న్యాయమైన వాటా ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. భాగస్వాములందరి ప్రయోజనాల దృష్ట్యా పారదర్శకమైన చర్చల ద్వారా, సమానత్వం, స్పష్టత, స్నేహపూర్వక వాతావరణంలో ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని మరోసారి కోరుతున్నాను. మనం హుందాగా, నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతామని ఆశిస్తున్నాను" అని మల్లికా శ్రీనివాసన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


