Argentina vs England : మెస్సి మ్యాజిక్- ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లోకి అర్జెంటీనా..
Fifa world cup 2026 : లియోనెల్ మెస్సి మ్యాజిక్‌తో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లోకి అర్జెంటీనా దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. మ్యాచ్ హైలైట్స్ మీకోసం..
లియోనెల్ మెస్సి మరోసారి తన అసాధారణ ఆటతీరుతో అర్జెంటీనాను గెలిపించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో రెండు అద్భుతమైన అసిస్ట్‌లతో జట్టుకు 2-1 తేడాతో విజయాన్ని అందించాడు. దీనితో వరుసగా రెండోసారి అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మ్యాచ్ ముగుస్తుందనగా అర్జెంటీనా ఆటగాళ్లు చెలరేగిపోయారు. చివరి నిమిషాల్లో లియోనెల్ మెస్సి సృష్టించిన అద్భుతం ఇంగ్లాండ్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకుంది. ఒక దశలో ఓటమి అంచుల్లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్, మెస్సి మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్ విశేషాలు ఇప్పుడు చూద్దాము.
ఇంగ్లాండ్ ఆధిక్యం.. అర్జెంటీనా మైండ్ గేమ్!
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ జట్టు పటిష్టమైన ప్రదర్శన కనబరిచింది. అర్జెంటీనా డిఫెన్స్‌ను ముప్పతిప్పలు పెడుతూ దాడులు చేసింది. ఈ క్రమంలోనే 55వ నిమిషంలో ఆంథోనీ గోర్డాన్ సూపర్ గోల్‌తో ఇంగ్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. గోల్ కొట్టిన ఉత్సాహంలో ఇంగ్లాండ్ సంబరాలు చేసుకుంటుంటే, అర్జెంటీనా మాత్రం వ్యూహాన్ని మార్చింది. పట్టుదలగా ఆడుతూ బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇంగ్లాండ్‌ను రక్షణ శ్రేణిలోకి నెట్టేస్తూ నిరంతరం దాడులు చేయడం ప్రారంభించింది.
వ్యూహం మార్చిన టూచెల్.. దెబ్బకొట్టిన స్కలోని!
ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ కోచ్ థామస్ టూచెల్ రక్షణాత్మక ధోరణి అవలంబించారు. వచ్చిన ఆధిక్యాన్ని కాపాడుకోవాలనే వ్యూహం.. ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇదే సమయంలో అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని చేసిన మార్పులు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. రోడ్రిగో డి పాల్, గొంజాల్లో మోంటియల్, లౌటారో మార్టినెజ్‌లను మైదానంలోకి దించి జట్టులో సరికొత్త ఉత్తేజాన్ని నింపారు. ఈ తాజా శక్తితో అర్జెంటీనా దాడుల తీవ్రతను పెంచింది.
చివరి 5 నిమిషాల్లో మెస్సి విశ్వరూపం!
మ్యాచ్ చివరి ఘట్టానికి చేరుకుంటున్న కొద్దీ ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. 85వ నిమిషంలో మెస్సి అందించిన పాస్‌ను అందుకున్న ఎంజో ఫెర్నాండెజ్, బాక్స్ వెలుపల నుంచి ఒక మెరుపు లాంటి షాట్‌తో బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది.
అక్కడితో అర్జెంటీనా ఆగలేదు. మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లోకి ప్రవేశించిన వేళ, అందరూ ఎక్స్‌ట్రా టైమ్ అనుకుంటున్న సమయంలో మెస్సి మరో మ్యాజిక్ చేశాడు! సాధారణంగా తన ఎడమ కాలితో మాయ చేసే మెస్సి, ఈసారి ఇంగ్లాండ్ డిఫెండర్లను ముగ్గులోకి దించుతూ కుడికాలితో అద్భుతమైన క్రాస్ ఇచ్చాడు. దూసుకొచ్చిన బంతిని లౌటారో మార్టినెజ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. అంతే, స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.
"కీలక క్షణాల్లో ఒత్తిడిని అధిగమించి ఆడటమే అర్జెంటీనా బలం. ఈ విజయం మా జట్టు పోరాట పటిమకు నిదర్శనం," అని మ్యాచ్ అనంతరం ఆ జట్టు సభ్యులు చెప్పారు.
రికార్డుకు అడుగు దూరంలో..
రెఫరీ లాంగ్ విజిల్ వేయగానే మెస్సి మైదానంలో మోకాళ్లపై కూర్చుని గాల్లోకి చేతులు ఊపుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 1962లో బ్రెజిల్ తర్వాత, వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు అర్జెంటీనా ఇప్పుడు కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది.
జులై 20న జరిగే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


