19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. న్యూ ఇయర్ షాక్

2026 నూతన సంవత్సరం వేళ వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ. 111 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహ వినియోగదారులకు మాత్రం పాత ధరలే కొనసాగుతున్నాయి.

Published on: Jan 1, 2026, 09:20:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్/న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026 మొదటి రోజే వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో, 19 కిలోల వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరిగిన ధరలు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.

19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. న్యూ ఇయర్ షాక్ (PTI)
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. న్యూ ఇయర్ షాక్ (PTI)

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 111 మేర అదనపు భారం పడింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వాడే వారికి ఈ పెంపు భారంగా మారనుంది.

ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి:

ప్రభుత్వ రంగ చమురు సంస్థల తాజా సవరణ తర్వాత వివిధ నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ కొత్త ధరలు (రూపాయల్లో) ఇలా ఉన్నాయి:

  1. ఢిల్లీ: అంతకుముందు రూ. 1,580.50 ఉండగా, ఇప్పుడు రూ. 1,691.50కి చేరింది.
  2. ముంబై: పాత ధర రూ. 1,531.50 నుంచి రూ. 1,642.50కి పెరిగింది.
  3. కోల్‌కతా: రూ. 1,684 నుంచి రూ. 1,795కి ఎగబాకింది.
  4. చెన్నై: అత్యధికంగా రూ. 1,739.50 నుంచి రూ. 1,849.50కి చేరింది.
  5. హైదరాబాద్: నగరంలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,912.50కి పెరిగింది. (గతంలో ఇది రూ. 1,801.50 గా ఉండేది).

గృహ వినియోగదారులకు ఊరట

వ్యాపార అవసరాలకు వాడే గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సామాన్యుడి వంటింట్లో వాడే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వీటి ధరలను చివరిసారిగా ఏప్రిల్ 8, 2025న సవరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 ఉండగా, హైదరాబాద్‌లో రూ. 905 వద్ద స్థిరంగా ఉంది.

గత నెలను పరిశీలిస్తే..

గతేడాది అంటే 2025 డిసెంబర్‌లో కమర్షియల్ గ్యాస్ ధరలను చమురు సంస్థలు స్వల్పంగా తగ్గించాయి. అప్పట్లో ఢిల్లీ, కోల్‌కతాలో రూ. 10.. ముంబై, చెన్నైలలో రూ. 11 చొప్పున ధరలు తగ్గాయి. అయితే, కొత్త ఏడాది ఆరంభంలోనే ఏకంగా రూ. 111 పెంచి ఆ ఉపశమనాన్ని ఆవిరి చేసేశాయి.

ఈ ధరల పెంపు వల్ల బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More