Crime news : పోకిరి లెవల్ ట్విస్ట్! భర్త మరణంతో అందరి ముందు కన్నీళ్లు- తనే చంపించేసి..
Priyanka Purohit : మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక మసాలా వ్యాపారి హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారని కెమెరా ముందు కన్నీరుమున్నీరైన భార్యే, ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు.
Woman kills husband : మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. 28 ఏళ్ల మసాలా వ్యాపారి పురోహిత్ దేవకృష్ణ ఏప్రిల్ 7వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటన జరిగిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన అతని భార్య ప్రియాంక పురోహిత్.. తమ ఇంట్లో దొంగరు దూరారని, తన భర్తను చంపేశారని చెప్పుకుని విలవిల్లాడిపోయింది. ఆమె సృష్టించిన సీన్ చూసి అంతా నిజమేనని నమ్మారు. "దుండగులు ఇంట్లోకి చొరబడి నా నోరు మూసేశారు. నగలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. నా చేతులు, కాళ్లు కట్టేసి నా కళ్ల ముందే నా భర్తను అంతం చేశారు," అంటూ ఆమె బావురుమంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఆమెను చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్! ప్రియుడితో పక్కాగా ప్లాన్ చేసి, ఆ మహిళే తన భర్తను చంపించింది!

హత్యకు అసలు కారణం ఇదేనా?
పోలీసుల లోతైన దర్యాప్తులో ప్రియాంక చెప్పిన కథ అంతా కట్టుకథ అని తేలింది. తన భర్త దేవకృష్ణ రంగు తక్కువని, అతను తనకు ఏమాత్రం సరిపోడని ఆమె తరచూ వేధించేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని దేవకృష్ణ సోదరి జ్యోతి వెల్లడించారు. "నువ్వు నల్లగా ఉన్నావు.. నాకు తగవు.. నా స్థాయికి తగ్గ వ్యక్తివి కాదు" అంటూ దేవకృష్ణను ప్రియాంక అవమానించేదని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. 2020 నుంచే ఆమె ప్రవర్తనపై తమకు అనుమానం ఉందని, నిరంతరం ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ భర్తను నిర్లక్ష్యం చేసేదని వారు పేర్కొన్నారు.
లక్ష రూపాయల సుపారీ.. ప్రియుడితో ప్లాన్
ప్రియాంక తన ప్రియుడు కమలేష్‌తో కలిసి భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం సురేంద్ర భాటి అనే కాంట్రాక్ట్ కిల్లర్‌కు లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రూ. 50,000 అడ్వాన్స్‌గా కూడా చెల్లించింది.
పథకం ప్రకారం: హత్య జరిగిన రాత్రి కావాలనే ఇంటి తలుపులు తీసి ఉంచింది.
ఘాతుకం: దేవకృష్ణ నిద్రిస్తున్న సమయంలో సురేంద్ర ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో అతడిని హతమార్చాడు.
దొంగతనం కలరింగ్: ఇది దొంగతనంగా నమ్మించేందుకు ఇంట్లోని సామాన్లన్నీ చిందరవందరగా పడేశారు. సుమారు రూ. 3.5 లక్షల విలువైన నగలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, పోలీసులు ఇంటిని సోదా చేయగా, దొంగతనానికి గురైనట్టు చెప్పిన నగలు ఇంట్లోనే దొరకడంతో ప్రియాంక డ్రామా అడ్డం తిరిగింది.
న్యాయం కావాలంటున్న వృద్ధురాలు..
తమ కళ్ల ముందే కొడుకును పొట్టనబెట్టుకున్న కోడలికి, ఆమెకు సహకరించిన వారికి ఉరిశిక్ష పడాలని దేవకృష్ణ తల్లి ఖీంచీ బాయి డిమాండ్ చేస్తున్నారు. "నా కొడుకును చంపిన వారికి మరణశిక్ష తప్ప ఏదీ తక్కువ కాదు. మాకు న్యాయం కావాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి చోటుచేసుకుంది.
2. భర్తను చంపడానికి భార్య ఎంత సుపారీ ఇచ్చింది?
నిందితురాలు ప్రియాంక తన భర్తను చంపేందుకు ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌తో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో రూ. 50,000 ముందుగానే చెల్లించింది.
4. కుటుంబ సభ్యులు ఆమెపై చేసిన ఆరోపణలు ఏంటి?
దేవకృష్ణ రంగు తక్కువని ప్రియాంక అతడిని తరచూ వేధించేదని, ఆమెకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని మృతుని సోదరి ఆరోపించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


