Mahindra cars : అతి తక్కువ ధరకే మహీంద్రా ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు- BaaS ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..

మహీంద్రా తమ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్ అంతటికీ 'బాటరీ-యాస్-ఏ-సర్వీస్' (బీఏఏఎశ్) సౌకర్యాన్ని విస్తరించింది. బీఈ 6 స్పోర్టెక్, ఎక్స్ఈవీ 9ఎస్‌, ఎక్స్ఈవీ 9ఈ మోడళ్లు ఇప్పుడు రూ. 11.45 లక్షల ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

Published on: Aug 29, 2026, 05:59:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలను మరింత వేగవంతం చేసేందుకు స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కొనుగోలును సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తూ 'బాటరీ-యాస్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ను పూర్తి శ్రేణికి వర్తింపజేసింది. ఇప్పటివరకు కేవలం పరిమిత మోడళ్లకే ఉన్న ఈ ప్లాన్‌ను ఇకపై ‘బీఈ 6 స్పోర్టెక్’, ‘ఎక్స్ఈవీ 9ఎస్‌’, 'ఎక్స్ఈవీ 9ఈ' మోడళ్లలోని అన్ని వేరియంట్లలోనూ అందిస్తున్నట్లు ప్రకటించింది.

మహీంద్రా ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు..
మహీంద్రా ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు..

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలంటే బ్యాటరీ వ్యయం కారణంగా ప్రారంభ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈవీల విస్తరణకు పెద్ద నెగిటివ్​గా మారింది. అయితే మహీంద్రా తీసుకొచ్చిన ఈ 'డ్యూయల్ లోన్' విధానం వల్ల వాహనం కొనుగోలు ధర ఒక్కసారిగా తగ్గి, సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల ధరకు సరిసమాన పోటీని ఇస్తోంది.

రూ. 11.45 లక్షలకే ప్రీమియం ఎస్‌యూవీ!

ఈ బీఏఏఎస్ ప్లాన్ ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ ధరల్లో భారీ మార్పు వచ్చింది:

బీఈ 6 స్పోర్టెక్: ఈ మోడల్ ప్రారంభ ధరను రూ. 11.45 లక్షలుగా నిర్ణయించారు.

ఎక్స్​ఈవీ 9ఎస్: మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 12.65 లక్షల నుంచి లభిస్తుంది.

ఎక్స్​ఈవీ 9ఈ: ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ ప్రారంభ ధరను రూ. 13.90 లక్షలుగా అందుబాటులోకి తెచ్చారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ ప్రకటించిన ధరలు కేవలం వాహనానికి మాత్రమే వర్తిస్తాయి. బ్యాటరీ కోసం వినియోగదారులు ప్రత్యేకంగా మరో లోన్ లేదా ఫైనాన్స్ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

కిలోమీటరుకు రూ. 3.75 మాత్రమే!

ఈ విధానంలో కస్టమర్లు వాహనానికి, బ్యాటరీకి విడివిడిగా రుణాలు తీసుకుంటారు. మహీంద్రా లెక్కల ప్రకారం, రోజుకు సగటున 60 కిలోమీటర్లు ప్రయాణించే వినియోగదారుడికి బ్యాటరీ వినియోగ ఖర్చు కిలోమీటరుకు రూ. 3.75 చొప్పున పడుతుంది.

దానికి అనుగుణంగా బ్యాటరీ నెలవారీ ఈఎంఐ రూ. 6,975 నుంచి ప్రారంభమవుతుంది. ఇది వాడిన దాన్ని బట్టి చెల్లించే 'పే-పర్-యూజ్' విధానం కాదని, నెలవారీ ప్లాన్ ఆధారిత ఈఎంఐ అని సంస్థ తెలిపింది. వినియోగదారుడు చెల్లించే డౌన్ పేమెంట్, ఎంచుకునే లోన్ కాలపరిమితి, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఈఎంఐ మొత్తంలో మార్పులు ఉంటాయి.

ఈ వ్యయాలు అదనం..

సంస్థ ప్రకటించిన ముందస్తు ధరల్లో వాహన ఛార్జర్ వ్యయం, రోడ్డు పన్ను, ఇన్సూరెన్స్, టీసీఎస్, ఇతర ప్రభుత్వ చట్టబద్ధమైన పన్నులు కలవవు. వీటిని కొనుగోలుదారుడే విడిగా చెల్లించాలి. వీటితో పాటు వాహన ఛార్జింగ్‌కు అయ్యే విద్యుత్ బిల్లు, రెగ్యులర్ సర్వీసింగ్ ఖర్చులు బ్యాటరీ ఈఎంఐ పరిధిలోకి రావు. ఫైనాన్స్ భాగస్వాముల నిబంధనలకు లోబడి, కేవలం వ్యక్తిగత రవాణా కోసం వాహనం కొనేవారికి మాత్రమే ఈ బీఏఏఎస్ సౌకర్యం లభిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More