E20 fuel : మహీంద్రా కస్టమర్లకు బిగ్ రిలీఫ్- ఈ20 పెట్రోల్ వాడినా.. కార్లు సేఫ్!
Mahindra E20 petrol compatibility : భారత మార్కెట్లో ఇంధనంగా మారుతున్న ‘ఈ20 పెట్రోల్’పై వాహనదారుల్లో నెలకొన్న అనుమానాలకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా స్పష్టతనిచ్చింది. తమ పెట్రోల్ కార్లన్నీ ఈ20 ఇంధనంతో నడవడానికి సురక్షితమైనవేనని స్పష్టం చేసింది.
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్) ఇంధనాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే, ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడటం వల్ల కార్ల ఇంజన్లు పాడైపోతాయా? మైలేజ్ తగ్గిపోతుందా? అనే ఆందోళనలు సోషల్ మీడియా వేదికగా వాహనదారుల్లో విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' కస్టమర్ల సందేహాలను నివృత్తి చేస్తూ అధికారికంగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

మా కార్లన్నీ సేఫ్.. కస్టమర్ కేర్ క్లారిటీ
సోషల్ మీడియాలో ఒక కస్టమర్ అడిగిన ప్రశ్నకు మహీంద్రా కస్టమర్ కేర్ విభాగం స్పందిస్తూ తమ ఇంజన్ల సామర్థ్యంపై పూర్తి భరోసానిచ్చింది.
"మహీంద్రా పెట్రోల్ ఇంజన్లను ప్రస్తుత ఇంధన ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందించడం జరిగింది. మా వాహనాలన్నీ ఈ20 పెట్రోల్‌తో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అత్యంత సురక్షితంగా నడుస్తాయి," అని మహీంద్రా స్పష్టం చేసింది.
ఈ ప్రకటనతో మహీంద్రా కార్ల యజమానులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.
ఏప్రిల్ 1, 2025 తర్వాత వచ్చిన కార్లకు మరింత ప్లస్!
కంపెనీ ఇచ్చిన వివరణ ప్రకారం.. వాహనాలు తయారైన కాలం ఆధారంగా చిన్న మార్పులు ఉంటాయి. ఏప్రిల్ 1, 2025 తర్వాత తయారైన మహీంద్రా కొత్త వాహనాల ఇంజన్లను ప్రత్యేకంగా ఈ20 ఇంధనానికి అనుకూలంగా ట్యూన్ చేశారు. దీనివల్ల ఈ సరికొత్త మోడళ్లలో పికప్, ఇంధన సామర్థ్యం మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీ పేర్కొంది.
పాత వాహనాల పరిస్థితి ఏంటి?
మరి ఏప్రిల్ 1, 2025 కంటే ముందు కొనుగోలు చేసిన పాత మహీంద్రా కార్ల పరిస్థితి ఏంటనే దానికి కూడా కంపెనీ సమాధానమిచ్చింది. పాత మోడల్ కార్లను కూడా ఈ20 పెట్రోల్‌తో సురక్షితంగా నడపవచ్చని, ఇంజన్‌కు ఎలాంటి ప్రమాదం జరగదని తేల్చి చెప్పింది. అయితే, డ్రైవింగ్ చేసే విధానం, రోడ్డు పరిస్థితులను బట్టి పికప్ లేదా మైలేజీలో స్వల్ప వ్యత్యాసాలు కనిపించవచ్చని వివరించింది.
సాధారణంగా ఈ10 పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 పెట్రోల్‌లో ఎనర్జీ కంటెంట్ స్వల్పంగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మైలేజీలో స్వల్ప తగ్గుదల కనిపించడం సహజమేనని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేస్తున్న ఇథనాల్ చర్చ!
ఈ20 పెట్రోల్ చుట్టూ జరుగుతున్న చర్చపై ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో టయోటా, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా స్పందించాయి. ఈ ఇంధనం పూర్తిగా సురక్షితమేనని కంపెనీలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమర్థించాయి.
ఇటీవల టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో సమస్యకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అది ఈ20 పెట్రోల్ వల్ల రాలేదని, కలుషితమైన ఇంధనం వాడటం వల్లే జరిగిందని టయోటా స్పష్టం చేసింది. వాహనదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కార్ల తయారీ కంపెనీలన్నీ ప్రస్తుతం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


