E20 fuel damage : ఈ20 ఫ్యూయల్ వల్ల మీ కారు పాడైపోతే.. ఇన్సూరెన్స్ రాదు!
Insurance claim on E20 damage : ఏప్రిల్ 2023 కంటే ముందు కొనుగోలు చేసిన పాత కార్లలో ఈ20 ఇంధనం (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) వాడటం వల్ల ఇంజన్ దెబ్బతింటే, ఆ బీమా క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లోంబార్డ్ స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో పాత కార్లు, బైక్‌లు వాడుతున్న వాహనదారులకు ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లోంబార్డ్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన, ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేని పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాడటం వల్ల ఏవైనా నష్టాలు లేదా ఇంజన్ రిపేర్లు వస్తే.. వాటికి సంబంధించిన కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.

ఇలాంటి కేసులను వాహనదారుడి "అజాగ్రత్త" లేదా "నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని వాడటం" కిందికి పరిగణించవచ్చని ఐసీఐసీఐ లోంబార్డ్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఈ20 ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే ఇంధనం ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో పాత వాహనదారుల ఆందోళనలపై కంపెనీ ఈ కీలక వివరణ ఇచ్చింది.
"మీ వాహనానికి సరిపడని ఇంధనాన్ని అందులో పోయడం అనేది క్లియర్‌గా కస్టమర్ అజాగ్రత్త లేదా తప్పుడు వినియోగం కిందికే వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కోణంలోనే క్లెయిమ్‌లను పరిశీలిస్తాయి. కాబట్టి ఇలాంటి నష్టాలకు క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ," అని ఐసీఐసీఐ లోంబార్డ్ తన బ్లాగ్‌లో స్పష్టంగా పేర్కొంది.
ఇంధన మార్పుల వల్ల జరిగే నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా లేదా అనేది సాధారణంగా పాలసీదారులకు క్లెయిమ్ చేసుకునే సమయం వచ్చేదాకా తెలియదు. ఇదొక గందరగోళమైన విషయంగా మిగిలిపోవడంతో వాహనదారుల్లో అభద్రతాభావం పెరుగుతోందని కంపెనీ అంగీకరించింది.
పాత వాహనాలకు ఈ20 ఇంధనం ఎందుకు ముప్పో తెలుసా?
భారతీయ ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలు ఏప్రిల్ 2023 నుంచే ఈ20 ఇంధనానికి అనుకూలమైన వాహనాల విక్రయాలను ప్రారంభించాయి. అంటే దానికి ముందు కొనుగోలు చేసిన కోట్లాది కార్లు, బైక్‌లు అధిక ఇథనాల్ మిశ్రమంతో నడిచేలా డిజైన్ చేయలేదు.
దేశవ్యాప్తంగా ఈ20 ఇంధన పంపిణీ దాదాపు పూర్తయింది. మరోవైపు హై-ఆక్టేన్ కలిగిన ఎక్స్పీ95 వంటి ప్రీమియం పెట్రోల్ ధరలు సామాన్యుడికి భారం అవుతున్నాయి. దీనివల్ల పాత వాహనాల యజమానులకు ఇష్టం లేకపోయినా, ఇంజన్ పాడవుతుందనే భయం ఉన్నా.. బంకుల్లో దొరికే ఈ20 పెట్రోల్‌నే వాడాల్సి వస్తోంది. ప్రస్తుతం సాధారణ పెట్రోల్ లేదా ఈ10 ఇంధనం దొరకడం చాలా కష్టంగా మారిందని ఐసీఐసీఐ లోంబార్డ్ తెలిపింది.
సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ స్వచ్ఛంగా మండుతుందనేది నిజమే అయినా, ఇంజన్ లోపల దాని పనితీరు వేరుగా ఉంటుంది. ఇథనాల్‌లో లీటరుకు లభించే శక్తి తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ కొద్దిగా తగ్గుతుంది.
అయితే మైలేజ్ తగ్గడం అనేది చాలా చిన్న సమస్య.
అసలైన ముప్పంతా కారు లోపల ఉండే ఇంజన్ విడిభాగాలకే. ఇథనాల్ అనేది లోహాలను, రబ్బరును కరిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనికి అనుకూలంగా లేని పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడటం వల్ల ఇంధన పైపులు దెబ్బతింటాయి, రబ్బరు సీల్స్ పాడవుతాయి. ఇంజన్ భాగాలు నెమ్మదిగా అరిగిపోతాయి. ఈ నష్టం ఒక్కరోజులో బయటపడదు, లోపల లోపలే నెమ్మదిగా పెరుగుతుంది. అందువల్ల క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో వివాదాలు తలెత్తే అవకాశం ఎక్కువ.
క్లెయిమ్ ఎందుకు తిరస్కరిస్తారు? పాలసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?
గతేడాది ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన దాని ప్రకారం.. వాహనంలో ఈ20 ఇంధనం వాడినంత మాత్రాన మీ టోటల్ ఇన్సూరెన్స్ పాలసీ రద్దు కాదు. కానీ, అంత మాత్రాన ఈ20 ఇంధనం వల్ల జరిగిన ప్రతి నష్టానికి క్లెయిమ్ ఇస్తామని అర్థం కాదని ఐసీఐసీఐ లోంబార్డ్ మెలిక పెట్టింది.
సాధారణ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు 'కన్సీక్వెన్షియల్ డ్యామేజ్' (అంటే కాలక్రమేణా నిదానంగా జరిగే నష్టం) కు వర్తించవు. ప్రమాదాల వల్ల ఒకేసారి జరిగే నష్టాలకు మాత్రమే సాధారణ పాలసీలు రక్షణ ఇస్తాయి.
చాలామంది కస్టమర్లు ఇంజన్ ప్రొటెక్షన్ కవర్లు తీసుకుంటారు. కానీ అవి సాధారణంగా ఇంజన్‌లోకి నీరు చేరినప్పుడు లేదా ఆయిల్ లీకేజీ అయినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఇంధన రసాయనాల వల్ల జరిగే నష్టాలకు ఇవి వర్తించవు. అందువల్ల కస్టమర్లు తమ పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదువుకోవాలి.
ఒకవేళ మీ కారు ఈ20 ఇంధనానికి అనుకూలమైనది కాకపోతే, కార్ల కంపెనీలు కూడా వారంటీ లేదా క్లెయిమ్‌లను తిరస్కరించవచ్చు. అందుకే ఒకసారి మీ కారు మ్యాన్యువల్ బుక్ చూడటం లేదా డీలర్‌ను సంప్రదించడం మంచిది. దీనికి తాత్కాలిక పరిష్కారంగా.. పాత వాహనాలలో ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ వాడటం కొంతవరకు మేలు చేస్తుంది. ప్రీమియం ఇంధనాలలో ఇథనాల్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి, పాత ఇంజన్లపై భారం తగ్గుతుంది. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా, ఇంజన్ లైఫ్ పెంచడానికి సహాయపడుతుంది.
ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
మరోవైపు, దేశంలో ఇథనాల్ ఇంధన వాడకాన్ని మరింత ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 వంటి అధిక ఇథనాల్ శాతం కలిగిన పెట్రోల్ వేరియంట్లపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. అంటే 22%, 25%, 27%, 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఇక నుంచి ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ ఉండదు.
పశ్చిమాసియా లో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఏకంగా రూ. 7.5 వరకు పెరిగాయి. ఈ తరుణంలో వినియోగదారులు ఇథనాల్ కలిపిన చౌకైన ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారేలా ప్రోత్సహించడానికి కేంద్రం ఈ సుంకాల మినహాయింపును ప్రకటించింది.
అంతేకాదు, ఇటీవలే ఈ85ని లాంచ్ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఈ100కి చెందిన నిబంధనలకు ఆమోద ముద్రవేసంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


