...
...
Next Story

CNG cars : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్​ఎన్జీ vs టాటా నెక్సాన్ ఐసీఎన్జీ.. ఏది బెస్ట్?

భారతీయ మార్కెట్లో కాంపాక్ట్ సీఎన్జీ ఎస్‌యూవీ పోరు రసవత్తరంగా మారింది. కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్‌ఎన్జీ, ఇప్పటికే ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ఐసీఎన్జీ మోడళ్ల ఇంజిన్ పవర్, మైలేజ్, ఫీచర్లు, ధరల సమగ్ర పోలిక ఇక్కడ చూడండి..

Published on: Oct 16, 2026, 07:31:02 IST
Advertisement

పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి తప్పించుకోవడానికి భారతీయ వాహనదారులు ఇప్పుడు సీఎన్జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సీఎన్జీ అనగానే పవర్ తక్కువగా ఉంటుందనే భావన ఉండేది, కానీ నేటి ఆధునిక టర్బో సీఎన్జీ ఇంజిన్లు ఆ అపోహను తిరగరాస్తున్నాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా ఇటీవల సరికొత్త 'ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్​ఎన్జీ' ని రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న 'టాటా నెక్సాన్ ఐసీఎన్జీ' కి ఇది గట్టి పోటీగా నిలుస్తోంది. మరి ఈ రెండు పాపులర్ టర్బో సీఎన్జీ ఎస్‌యూవీల్లో ఏది కొనుగోలు చేయడం ఉత్తమమో విశ్లేషిద్దాం.

ఇంజిన్ పర్ఫార్మెన్స్, మైలేజ్ పోలిక..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్​ఎన్జీ vs టాటా నెక్సాన్ ఐసీఎన్జీ..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్​ఎన్జీ vs టాటా నెక్సాన్ ఐసీఎన్జీ..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్‌ఎన్జీలో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ ఎంపీఎఫ్‌ఐ ఇంజిన్‌ను అందించారు. ఇది 111 పీఎస్ పవర్, 200 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రీ-కాలిబ్రేట్ చేసిన టర్బోఛార్జర్, ఈసీయూ మ్యాపింగ్ కారణంగా సీఎన్జీ మోడ్‌లో కూడా పవర్ తగ్గకపోవడం దీని ప్రత్యేకత. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ అధికారిక లెక్కల ప్రకారం ఇది కేజీ సీఎన్జీకి 24.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మరోవైపు, టాటా నెక్సాన్ ఐసీఎన్జీలో 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ రేవోట్రాన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 100 పీఎస్ పవర్, 170 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా లభిస్తుంది. నెక్సాన్ మైలేజ్ కేజీ సీఎన్జీకి 24 కిలోమీటర్లుగా నమోదైంది. పవర్, టార్క్ విషయంలో నెక్సాన్ కంటే ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ స్పష్టమైన ఆధిక్యంలో నిలుస్తోంది.

ఫీచర్లు, ఇంటీరియర్ హంగులు..

క్యాబిన్ ఫీచర్ల విషయానికి వస్తే రెండూ అధునాతన సాంకేతికతతో నిండి ఉన్నాయి. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్​ఎన్జీ లో 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ ఆడియో, నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు స్టీరింగ్ మోడ్‌లు పొందుపరిచారు.

ఈ రెండు ఎస్‌యూవీలు కూడా ఆధునిక ‘ట్విన్ సిలిండర్’ సాంకేతికతతో వస్తున్నాయి. బూట్ ఫ్లోర్ కింద రెండు చిన్న సిలిండర్లను అమర్చడం వల్ల పైభాగంలో ప్రయాణికులు తమ లగేజ్ ఉంచుకోవడానికి తగినంత స్థలం దక్కుతుంది.

లగేజ్ కెపాసిటీ పరంగా చూస్తే, టాటా నెక్సాన్ ఐసీఎన్జీలో 321 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ లభిస్తుండగా, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ సీఎన్జీలో దాదాపు 270 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది.

ధరలు - ఏది ఎంచుకోవాలి?

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్‌ఎన్జీ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండగా, టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ప్రారంభ ధర రూ. 8.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. నెక్సాన్ ప్రారంభ ధర తక్కువగా ఉండటంతో పాటు ఆటోమేటిక్ ఆప్షన్ కోరుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అయితే అధిక పవర్, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్ కోరుకునే వారికి మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్‌ఎన్జీ పర్ఫెక్ట్ ఎంపిక అని చెప్పవచ్చు!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks