Maithili Thakur : దేశ రాజకీయాల్లో అరుదైన ఘటన! అధికారంలో ఉన్న సొంత పార్టీపై ఎమ్మెల్యే ఫైర్​..

బీహార్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ స్థితిపై అధికార పార్టీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని ఆసుపత్రి భవనం కూలిపోయే స్థితిలో ఉందని, కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేరని ఆమె ఆరోగ్య మంత్రిని ప్రశ్నించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published on: Feb 10, 2026 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజకీయాల్లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది! బీహార్​ అసెంబ్లీ వేదికగా ఒక మహిళా ఎమ్మెల్యే.. అధికారంలో ఉన్న సొంత పార్టీపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థ దయనీయంగా ఉందంటూ.. బీహార్​ ఆరోగ్యశాఖ మంత్రిని నిలదీశారు. ఆమె.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్​.

బీహార్​ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్​..
బీహార్​ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్​..

అసలేం జరిగింది?

బీహార్​ అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల నడుస్తున్నాయి. ఈ సందర్భంగా క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం)లో ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో తన అలీనగర్​ నియోజకవర్గంలోని కురాసన్ నదియామిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఏ క్షణమైనా కూలిపోయేలా ఉందని ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు.

దీనికి ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే స్పందిస్తూ.. సదరు భవనం ప్రమాదకరంగా ఏమీ లేదని, కేవలం మరమ్మతులు చేస్తే సరిపోతుందని బదులిచ్చారు.

అయితే మంత్రి సమాధానంపై మైథిలీ ఠాకూర్ ఏమాత్రం సంతృప్తి చెందలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మంత్రి చెబుతున్న దానికి భిన్నంగా ఉందని ఆమె బలంగా వాదించారు.

మైథిలీ ఠాకూర్​ అసెంబ్లీలో లేవనెత్తిన ప్రధానాంశాలు..

భవనం పరిస్థితి: ఆసుపత్రి భవనం ఏమాత్రం సురక్షితం కాదని, ప్రస్తుతం వైద్య సేవలను ఒక చిన్న గదిలో నిర్వహిస్తున్నారని మైథిలీ ఠాకూర్​ వివరించారు.

వైద్యుల కొరత: గతంలో ఇక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేవారని, కానీ ప్రస్తుతం ఒక్కరు కూడా అందుబాటులో లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విజ్ఞప్తి: ఇది మంత్రిపై వ్యక్తిగత దాడి కాదని, ప్రజారోగ్యం దృష్ట్యా చేస్తున్న విజ్ఞప్తి అని ఆమె పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా ఆరోగ్య శాఖ బాధ్యతలు చూస్తున్న మంగళ్ పాండే ఈ సమస్యపై వెంటనే స్పందించాలని కోరారు.

దీనికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని వివరించారు.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..

ఈ పూర్తి చర్చకు సంబంధించిన వీడియోను మైథిలీ ఠాకూర్ తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో పోస్ట్ చేయగా, అది కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది.

"ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే నా ప్రాధాన్యత," అని ఆమె రాసుకొచ్చారు.

సొంత పార్టీ మంత్రి అని చూడకుండా, ఎంతో హుందాగా, మైథిలీ ఠాకూర్​ సమస్యను వివరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కేవలం బీహార్ సమస్య మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఇలాగే ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి ప్రజల పక్షాన నిలబడితే ఎలా ఉంటుందో మైథిలీ ఠాకూర్ నిరూపించారని సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

2025 నవంబర్​లో జరిగిన బీహర్​ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్​ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్​పై పోటీ చేశారు మైథిలీ ఠాకూర్​. తన సమీప ప్రత్యర్థిపై దాదాపు 11,500 ఓట్ల తేడాతో గెలిచారు.

మైథిలీ ఠాకూర్​ వయస్సు 25ఏళ్లు.