...
...
Next Story

Stock Market Guide: మార్కెట్ ఇండికేటర్లు అంటే ఏమిటి? పసిగట్టి పెట్టుబడి పెట్టడం ఎలా?

స్టాక్ మార్కెట్ ట్రెండ్స్‌ను అర్థం చేసుకోవడంలో మార్కెట్ ఇండికేటర్లు ఎలా తోడ్పడతాయో కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్) శ్రీకాంత్ చౌహన్ విశ్లేషించారు. సరైన వ్యూహంతో వీటిని ఉపయోగించి ఆశించిన ఫలితాలు ఎలా సాధించవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Updated on: Jul 30, 2026, 14:27:03 IST
Advertisement

స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన కొత్తలో రకరకాల చార్ట్‌లు, సంఖ్యలు, విశ్లేషణలు చూసి ఎవరికైనా గందరగోళంగా అనిపించడం సహజం. ఈ గందరగోళాన్ని దాటుకుని, మార్కెట్ ట్రెండ్స్‌ను పసిగట్టడానికి, మంచి అవకాశాలను గుర్తించడానికి మార్కెట్ ఇండికేటర్లు ఉపకరిస్తాయి. అయితే, వీటిని సరైన రీతిలో ఉపయోగించినప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

మార్కెట్ ఇండికేటర్లు అంటే ఏమిటి? వాటి రకాలు

కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్) శ్రీకాంత్ చౌహన్
కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్) శ్రీకాంత్ చౌహన్

మార్కెట్ సమగ్ర స్థితి, సెంటిమెంట్, ప్రయాణ దిశను తెలియజేసే కొలమానాలు లేదా సమాచార పాయింట్లనే 'మార్కెట్ ఇండికేటర్లు' అంటారు. వీటిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

లీడింగ్ ఇండికేటర్లు (Leading Indicators): ఇవి మార్కెట్ భవిష్యత్తు కదలికలను ముందుగానే అంచనా వేస్తాయి. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI), వినియోగదారుల విశ్వసనీయత సూచీలు దీనికి ఉదాహరణలు.

లాగింగ్ ఇండికేటర్లు (Lagging Indicators): మార్కెట్లో ఒక ట్రెండ్ ఏర్పడిన తర్వాత ఆ మార్పును ఇవి ధ్రువీకరిస్తాయి. స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు, నిరుద్యోగ గణాంకాలు ఈ విభాగానికి చెందుతాయి.

కోఇన్సిడెంట్ ఇండికేటర్లు (Coincident Indicators): మార్కెట్ లేదా ఆర్థిక వ్యవస్థ కదలికలతో పాటే ఇవీ పయనిస్తాయి. పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ విక్రయాలు వీటి పరిధిలోకి వస్తాయి.

ఇండికేటర్లు ఎలా పనిచేస్తాయి?

ఆర్థిక, సాంకేతిక లేదా సెంటిమెంట్ సంబంధిత సమాచారాన్ని సమగ్రపరిచి, మార్కెట్ ట్రెండ్స్‌ను స్పష్టంగా చూపించడం ఇండికేటర్ల పనితీరు ప్రత్యేకత.

రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI): మార్కెట్ కదలికల వేగాన్ని కొలుస్తుంది. ఒక షేరు లేదా సూచీ 'ఓవర్‌బాట్' (అతిగా కొనుగోలు చేశారు) లేదా 'ఓవర్ సోల్డ్' (అతిగా విక్రయించారు) స్థితిలో ఉందో లేదో ఇది చూపుతుంది.

వొలాటిలిటీ ఇండెక్స్ (VIX): దీనిని సాధారణంగా 'భయ సూచీ' (Fear Gauge) అంటారు. భవిష్యత్తులో మార్కెట్లో చోటుచేసుకునే తీవ్రమైన హెచ్చుతగ్గులను ఇది ముందస్తుగా అంచనా వేస్తుంది.

నిర్ణయాల్లో వీటిని ఎలా ఉపయోగించాలి?

సూచికలు ఇచ్చే సమాచారం విలువైనదే అయినప్పటికీ, వాటిని ఉపయోగించేటప్పుడు సమతుల్య విధానం అవసరం.

వివిధ ఇండికేటర్లను కలపడం: ఒకే ఒక ఇండికేటర్‌పై ఆధారపడటం ప్రమాదకరం. ఉదాహరణకు, ఆర్‌ఎస్‌ఐ (RSI) ఒక షేరు ఓవర్‌బాట్ అయిందని చూపించినప్పటికీ, కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగుండి ధరలు పెరుగుతూనే ఉండవచ్చు. అటువంటప్పుడు మూవింగ్ యావరేజెస్ లేదా ఫండమెంటల్ విశ్లేషణను కూడా జోడిస్తే కచ్చితమైన చిత్రం లభిస్తుంది.

లక్ష్యానికి తగిన టూల్స్ ఎంచుకోవడం: స్వల్పకాలిక ట్రేడర్లు RSI, MACD లేదా బోలింగర్ బాండ్స్‌పై దృష్టి పెడతారు. సుదీర్ఘకాల ఇన్వెస్టర్లు GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, కంపెనీల ప్రాథమికాంశాలను చూస్తారు.

రిస్క్ మేనేజ్‌మెంట్: విక్స్ (VIX) సూచీ పెరుగుతుంటే మార్కెట్లో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయని అర్థం. అలాంటి సమయాల్లో స్టాప్-లాస్ స్థాయిలను పటిష్టం చేసుకోవడం మేలు.

డైవర్జెన్స్ గమనించడం: షేరు ధర ఒక కొత్త గరిష్టాన్ని చేరుకుంటున్నప్పుడు, ఆర్‌ఎస్‌ఐ పడిపోతుంటే మార్కెట్ ట్రెండ్ తిరగబడే అవకాశం ఉందని గ్రహించాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు

ఇండికేటర్లు విశ్లేషణకు ఉపయోగపడే పనిముట్లు మాత్రమే తప్ప, భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే మంత్రదండాలు కావు. అతిగా ఇండికేటర్లను ఉపయోగించడం వల్ల ఏ నిర్ణయమూ తీసుకోలేకపోవడం (Analysis Paralysis) వంటి సమస్యలు వస్తాయి. మీ వ్యూహానికి సరిపోయే కొన్ని కీలక సూచికలను మాత్రమే ఎంచుకుని, వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

మార్కెట్ ఇండికేటర్లు ఎంత ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, గుడ్డిగా సూచనలను అనుసరించకూడదు. క్రమశిక్షణతో కూడిన పరిశోధన, స్పష్టమైన వ్యూహానికి అనుబంధంగా వీటిని వాడుకున్నప్పుడే దీర్ఘకాలిక విజయం సాధ్యమవుతుంది.

వ్యాసకర్త:

శ్రీకాంత్ చౌహన్,

హెడ్ - ఈక్విటీ రీసెర్చ్‌,

కోటక్ సెక్యూరిటీస్

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe