స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఎందుకు ముఖ్యం? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రహస్యాలివే
స్టాక్ మార్కెట్లో సరైన సమయంలో కొనుగోలు, విక్రయాలు జరపడానికి టెక్నికల్ అనాలిసిస్ ఎంతగానో తోడ్పడుతుంది. మార్కెట్ ట్రెండ్స్, ట్రేడింగ్ వాల్యూమ్స్ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అందించిన ప్రత్యేక విశ్లేషణ ఇది.
ప్రతి ఇన్వెస్టర్ ఒకే విషయాన్ని కోరుకుంటారు.. స్టాక్‌ను సరైన ధరకు కొనాలి, సరైన సమయంలో అమ్మాలి. మార్కెట్ కదలికలను ఎవరూ 100 శాతం పక్కాగా అంచనా వేయలేరు. కానీ, టెక్నికల్ అనాలిసిస్ (Technical Analysis) ద్వారా మార్కెట్ ట్రెండ్‌ను అర్థం చేసుకుని, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీ ఆర్థిక ప్రదర్శన, బాలన్స్ షీట్లపై దృష్టి పెడితే.. టెక్నికల్ అనాలిసిస్ మాత్రం షేరు ధరల కదలికలు, ట్రేడింగ్ వాల్యూమ్, చారిత్రక డేటాను పరిశీలించి రాబోయే మార్కెట్ దిశను అంచనా వేస్తుంది. కొత్త ఇన్వెస్టర్లకు రకరకాల చార్టులు చూసి ఇది కష్టంగా అనిపించినా, దీని ప్రాథమిక సూత్రం చాలా సులభం.. స్టాక్ ధరలు ట్రెండ్స్ రూపంలో కదులుతాయి. ఆ ట్రెండ్‌ను పట్టుకోగలిగితే పెట్టుబడులపై మంచి ఫలితాలు సాధించవచ్చు.
టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏమిటి?
షేరు లేదా మార్కెట్ ఏ దిశగా పయనిస్తుందో తెలుసుకోవడానికి ధరల కదలికలు (Price Action), ట్రేడింగ్ కార్యకలాపాలను అధ్యయనం చేయడమే టెక్నికల్ అనాలిసిస్. బహిరంగంగా లభించే సమాచారమంతా ఇప్పటికే షేరు ధరలో భాగమై ఉంటుందనేది దీని ప్రధాన సూత్రం. చార్ట్ ప్యాటర్న్, వాల్యూమ్‌ను విశ్లేషించడం ద్వారా కొనుగోలు లేదా విక్రయ అవకాశాలను గుర్తించవచ్చు.
ఇది భవిష్యత్తు రిటర్నులకు గ్యారెంటీ ఇవ్వదు, కానీ మార్కెట్ సెంటిమెంట్‌ను అంచనా వేసి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే సంభావ్యతను పెంచుతుంది.
మార్కెట్ ట్రెండ్స్ ఎందుకు కీలకం?
టెక్నికల్ అనాలిసిస్‌లో అత్యంత ముఖ్యమైన అంశం 'మార్కెట్ ట్రెండ్'. ఒక నిర్దిష్ట సమయంలో షేరు లేదా సూచీ ఏ దిశలో వెళ్తుందో ఇది తెలియజేస్తుంది. ప్రధానంగా ఇవి మూడు రకాలు:
అప్‌ట్రెండ్ (Uptrend): షేరు ధర వరుసగా కొత్త గరిష్టాలను (Higher Highs), అధిక కనిష్టాలను (Higher Lows) నమోదు చేస్తుంది. అంటే మార్కెట్‌పై కొనుగోలుదారుల (Buyers) పట్టు ఉందనడానికి ఇది సంకేతం.
డౌన్‌ట్రెండ్ (Downtrend): షేరు వరుసగా తక్కువ గరిష్టాలను (Lower Highs), తక్కువ కనిష్టాలను (Lower Lows) నమోదు చేస్తుంది. ఇక్కడ అమ్మకందారుల (Sellers) ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సైడ్‌వేస్ ట్రెండ్ (Sideways Trend): స్పష్టమైన పెరిగే లేదా తగ్గే దిశ లేకుండా ఒకే పరిధిలో (Range) ధరలు కదులుతాయి. ఇది కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య సమతుల్యతను సూచిస్తుంది.
మార్కెట్ దిశకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకుండా ట్రెండ్‌ను గుర్తించడం ఉపయోగపడుతుంది. అందుకే మార్కెట్‌లో "ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్" (ట్రెండే నీ మిత్రుడు) అనే నానుడి బాగా ప్రాచుర్యం పొందింది.
వాల్యూమ్ ప్రాధాన్యత ఎంత?
ధరల కదలికలకు ట్రేడింగ్ వాల్యూమ్ (Trading Volume) మద్దతు ఉన్నప్పుడే ఆ మార్పుకు బలం చేకూరుతుంది. ఒక నిర్దిష్ట సమయంలో ఎన్ని షేర్లు ట్రేడ్ అయ్యాయో చెప్పేదే వాల్యూమ్.
ఉదాహరణకు, ఒక షేరు కీలకమైన నిరోధక స్థాయిని (Resistance Level) భారీ వాల్యూమ్‌తో దాటితే (Breakout), ఇన్వెస్టర్లలో గట్టి విశ్వాసం ఉందని అర్థం. తక్కువ వాల్యూమ్‌తో ధరలు పెరిగితే ఆ ర్యాలీ ఎక్కువ కాలం నిలకడగా ఉండకపోవచ్చు.
సాధారణంగా వాడే టెక్నికల్ టూల్స్
మూవింగ్ యావరేజెస్ (Moving Averages): ఇవి రోజువారీ ధరల తీవ్రమైన హెచ్చుతగ్గులను తగ్గించి, మొత్తం ట్రెండ్ స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.
సపోర్ట్, రెసిస్టెన్స్ (Support & Resistance): సపోర్ట్ అనేది పడిపోతున్న ధరలకు కొనుగోలుదారుల ఆసక్తి లభించే స్థాయి. రెసిస్టెన్స్ అనేది ధరలు పెరుగుతున్నప్పుడు అమ్మకాల ఒత్తిడి పెరిగే స్థాయి.
ట్రెండ్‌లైన్స్ (Trendlines): చార్ట్‌లో ప్రధాన గరిష్టాలు లేదా కనిష్టాలను కలుపుతూ గీసే గీతలు ట్రెండ్ దిశను స్పష్టంగా చూపిస్తాయి.
రెండు విశ్లేషణల కలయికే ఉత్తమం
ఫండమెంటల్ అనాలిసిస్‌తో కలిపి వాడినప్పుడే టెక్నికల్ అనాలిసిస్ సరైన ఫలితాలనిస్తుంది. ఫండమెంటల్స్ మంచి కంపెనీలను ఎంచుకోవడానికి (ఏ షేరు కొనాలి?) సహాయపడితే, టెక్నికల్ అనాలిసిస్ ఏ సమయంలో ఎంట్రీ ఇవ్వాలి లేదా నిష్క్రమించాలి (ఎప్పుడు కొనాలి/అమ్మాలి?) అనేది చెప్తుంది.
ఇన్వెస్టర్లు చేసే సాధారణ పొరపాట్లు
కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఒకే ఇండికేటర్‌పై ఆధారపడటం లేదా ప్రతి చార్ట్ ప్యాటర్న్ ఖచ్చితమైన ఫలితాన్నిస్తుందని భావించడం పెద్ద పొరపాటు. అలాగే స్వల్పకాలిక కదలికల ఆధారంగా తరచూ ఓవర్‌ట్రేడింగ్ చేస్తుంటారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్ లేకుండా, భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాలకు దారితీస్తాయి.
టెక్నికల్ అనాలిసిస్ అనేది మార్కెట్ కదలికలన్నింటినీ ముందే ఊహించడం కాదు. ట్రెండ్స్‌ను అర్థం చేసుకుంటూ ఆతురుత లేకుండా క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. సరైన ఫండమెంటల్స్, ఓపిక, రిస్క్ మేనేజ్‌మెంట్ తోడైతే టెక్నికల్ అనాలిసిస్ ప్రతి ఇన్వెస్టర్‌కు ఒక అద్భుతమైన ఆయుధంగా మారుతుంది.
వ్యాసకర్త:
శ్రీకాంత్ చౌహాన్,
హెడ్ - ఈక్విటీ రీసెర్చ్,
కోటక్ సెక్యూరిటీస్
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


