Stock market : ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. 15 నిమిషాల్లో రూ. 13 లక్షల కోట్లు ప్లస్!
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్- అమెరికా ట్రేడ్ డీల్ ఖరారవ్వడం ఇందుకు కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అతి భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2648 పాయింట్లు వృద్ధి చెంది 85,314 వద్ద ఓపెన్ అయ్యింది. నిఫ్టీ50 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద సెషన్‌ని మొదలుపెట్టింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 వద్ద ఓపెన్ అయ్యింది.

ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ మొదటి 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13లక్షల కోట్లు పెరిగింది! బీఎస్ఈ మార్కెట్ క్యాపిటల్ రూ. 468.32 లక్షల కోట్లకు చేరింది. ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ కోసం స్టాక్ మార్కెట్ ఎంత ఎదురుచూసిందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ ఎందుకు ముఖ్యం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు భారత ఎగుమతులను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ టారిఫ్‌లు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. తొలుత 25శాతం సుంకాలు విధించిన ట్రంప్, రష్యా చమురు అంశంలో భారత్‌పై మరో 25శాతం సుంకాలు విధించారు. ఫలితంగా చాలా నెలల పాటు భారత్ 50శాతం సుంకాలను ఎదుర్కొంటూ వస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు ఏడాది కాలంగా పెరగడపోవడానికి, ఎఫ్ఐఐలు భారీ మొత్తంలో సెల్లింగ్ చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ టారిఫ్‌లు. అందుకే ఈ సుంకాల భారం తగ్గాలన్నా, స్టాక్ మార్కెట్లు పెరగాలన్నా ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ జరగాల్సిందే అని నిపుణులు చెబుతూ వచ్చారు.
వాస్తవానికి ఈ వాణిజ్య ఒప్పందం నెలల ముందే జరుగుతుందని అందరు ఊహించారు. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి కీలక్ ప్రకటన చేశారు. ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్ కుదిరినట్టు, ఫలితంగా భారత్‌పై ప్రస్తుతం ఉన్న 50శాతం సుంకాలను 18శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ప్రకటనను స్టాక్ మార్కెట్లు అత్యంత సానుకూలంగా తీసుకున్నాయి. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్ సెషన్లో అతి భారీ లాభాలతో ఓపెన్ అయ్యాయి
లాభాలే.. లాభాలు..
బీఎస్ఈ సెన్సెక్స్ 30లో అన్ని స్టాక్స్ లాభాల్లో దూసుకెళుతున్నాయి. కొన్ని అయితే అతి భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్ 7శాతం, బజాజ్ ఫినాన్స్ 6శాతం, ఎటర్నల్ 6శాతం, ఇన్ఫోసిస్ 4శాతం, రిలయన్స్ 4శాతం మేర లాభాలను చూస్తున్నాయి.
బంగారం, వెండి కూడా..
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రభావం బంగారం, వెండీ ధరలపైనా పడింది! గత కొన్ని రోజులుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న లోహాలు.. మంగళవారం భారీగా పెరిగాయి.
ఎంసీఎక్స్ గోల్డ్ 3శాతం పెరిగి రూ. 1,48,310 (10గ్రాములు)కి చేరింది. ఎంసీఎక్స్ సిల్వర్ అయితే ఏకంగా 6శాతం అప్పర్ సర్క్యూట్ హిట్ చేసింది. ప్రస్తుతం కేజీకి రూ. 2,50,436 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాడ్ గోల్డ్ 4.2శాతం పెరిగి ఔన్సుకు 4,855 డాలర్లకు చేరింది.
రూపాయి కూడా..
యూఎస్- అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా రూపాయి భారీగా బలపడింది (1.2శాతం). డాలర్‌తో పోల్చితే రూపాయి ప్రస్తుతం 90.40 వద్ద ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


