ఎట్టకేలకు కుదిరిన India US trade deal- టారిఫ్‌లు 50శాతం నుంచి 18కి తగ్గింపు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఫలితంగా భారతీయ ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి దిగొచ్చాయి.
యావత్ భారత దేశం నెలల తరబడి ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండియా- యూఎస్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన అనంతరం, సోమవారం రాత్రి వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు.
ఫలితంగా భారత వస్తువులపై విధించిన 25శాతం సుంకాలు 18శాతానికి దిగొచ్చాయి.
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలను భారత్ ఆపేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇదే విషయంపై భారత్ మీద విధించిన అదనపు 25శాతం టారిఫ్ని కూడా అమెరికా తొలిగించింది.
మొత్తం మీద చూసుకుంటే భారత్‌పై టారిఫ్‌లు 50శాతం నుంచి 18శాతానికి దిగొచ్చినట్టు.
రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియాపై తొలుత 25శాతం సుంకాలు వేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ.. రష్యా చమురును కొంటున్న ఇండియపై మరో 25శాతం సుంకాలు వేశారు. ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్‌తో సుంకాలు తగ్గొచ్చని అందరు భావించారు. నెలల తరబడి వాయిదా పడిన అనంతరం, ఎట్టకేలకు ఇరుదేశాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది.
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, దీనికి బదులుగా 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధనం, టెక్నాలజీని భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అమెరికా టారిఫ్‌లను తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు.
“ఈ రోజు నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం హర్షణీయం. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున ప్రెసిడెంట్ ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను,” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయడం వల్ల ఇరు దేశాల పౌరులకు ప్రయోజనం చేకూరుతుందని, పరస్పర సహకారానికి ఇదొక గొప్ప అవకాశమని ప్రధాని అన్నారు.
"ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. మా భాగస్వామ్యాన్ని మునుపెన్నడూ లేని స్థాయికి తీసుకెళ్లడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను," అని మోదీ జోడించారు.
ఈ ఒప్పందాన్ని వివరిస్తూ.. "రష్యా నుంచి చమురు కొనడం ఆపివేసి, అమెరికా- వెనిజులా నుంచి మరింత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో సహాయపడుతుంది," అని ట్రంప్ వివరించారు. అలాగే అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలను, వాణిజ్య అడ్డంకులను కూడా భారత్ సున్నాకు తగ్గిస్తుందని ఆయన చెప్పారు.
“ప్రధాని మోదీతో ఉన్న స్నేహం, ఆయనపై ఉన్న గౌరవం మేరకు.. ఆయన విన్నపం మేరకు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాము. దీని ద్వారా అమెరికా విధించే 'రెసిప్రోకల్ టారిఫ్' 25% నుంచి 18%కి తగ్గుతుంది. అదేవిధంగా భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్‌లను సున్నాకు తగ్గిస్తుంది,” అని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
'మోదీ, నేను పనులు పూర్తి చేసే వ్యక్తులం': ట్రంప్
ప్రధాని మోదీతో జరిగిన సంభాషణ గురించి ట్రంప్ స్పందిస్తూ.. మోదీ తన అత్యంత సన్నిహిత మిత్రులలో ఒకరని, ఆయనతో మాట్లాడటం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. మోదీ తన దేశానికి శక్తివంతమైన, గౌరవనీయమైన నాయకుడని కొనియాడారు.
"మేమిద్దరం పనులను చేసి చూపించే వ్యక్తులం. మేము వాణిజ్యంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం వంటి అనేక విషయాలపై చర్చించాము," అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా, భారత్.. 'బై అమెరికన్' (అమెరికా వస్తువులనే కొనండి) విధానానికి కట్టుబడి ఉందని, సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన అమెరికా ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గును కొనుగోలు చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు.
'ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు.. వేచి ఉండండి,' భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సోషల్ మీడియాలో అని పోస్ట్ చేసిన గంటకే ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్‌పై ఈ అధికారిక ప్రకటన వెలువడింది. అంతకుముందు ట్రంప్ భారత్‌కు సంబంధించిన రెండు చిత్రాలను పంచుకున్నారు. ఒకటి ఇండియా గేట్ చిత్రం కాగా, మరొకటి 2025 'న్యూస్ మేకర్స్'గా మోదీ, ట్రంప్ ఇద్దరూ ఉన్న మ్యాగజైన్ కవర్ ఫోటో.
ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
స్టాక్ మార్కెట్లకు ఊరట..!
ఇండియా- యూఎస్ ట్రేడ్ డీల్‌పై ట్రంప్ ప్రకటన అనంతరం గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 600 పాయింట్ల లాభాల్లోకి దూసుకెళ్లింది! అంటే మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభనున్నట్టు ఇది సూచిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


