పండుగ ముందస్తు జోరు: కార్ల విక్రయాల్లో మారుతీ, టాటా, మహీంద్రా దూకుడు

పండుగల సీజన్ సమీపిస్తుండటంతో దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త కళ సంతరించుకుంది. 2026 ఆగస్టు నెలలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు భారీగా కార్ల విక్రయాలు నమోదు చేశాయి. గత ఏడాది జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం, జీడీపీ వృద్ధి పుంజుకోవడం వాహన విక్రయాలకు పెద్ద ఊతాన్ని ఇచ్చాయి.

Published on: Sep 2, 2026, 15:40:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండుగల వాతావరణం మొదలవ్వడంతో దేశీయ వాహన రంగంలో కొనుగోళ్ల సందడి నెలకొంది. 2026 ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు) హోల్‌సేల్ విక్రయాలు భారీ వృద్ధిని సాధించాయి. గత ఏడాది పండుగ సమయంలో ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూల ప్రభావం, సాధారణ రుతుపవన వర్షాలు, బలమైన ఆర్థిక వృద్ధి కలిసి ప్యాసింజర్ వాహన తయారీ కంపెనీలకు మంచి ఫలితాలను అందించాయి.

పండుగ ముందస్తు జోరు: కార్ల విక్రయాల్లో మారుతీ, టాటా, మహీంద్రా దూకుడు
పండుగ ముందస్తు జోరు: కార్ల విక్రయాల్లో మారుతీ, టాటా, మహీంద్రా దూకుడు

దూసుకెళ్లిన మారుతీ, టాటా, మహీంద్రా

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 2026 ఆగస్టులో మొత్తం 2,19,220 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 21.3 శాతం వృద్ధి. అయితే పనిదినాలు తక్కువగా ఉండటం వల్ల జులై నెలతో పోలిస్తే విక్రయాలు 9.2 శాతం తగ్గినట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలో 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆగస్టులో 59,257 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ 39,399 యూనిట్లను మాత్రమే అమ్మగా, ప్రస్తుతం స్కార్పియో-ఎన్, బీఈ 6, ఎక్స్‌ఈవి 9ఎస్‌, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ వంటి ఎస్‌యూవీ మోడళ్లకు విపరీతమైన ఆదరణ లభించింది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం ఆగస్టులో 67,753 యూనిట్లను విక్రయించి 56 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. దేశీయ విక్రయాలు 59 శాతం పెరగ్గా, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలు ఏకంగా 94 శాతం పెరిగి 16,549 యూనిట్లకు చేరుకున్నాయి. హ్యుందాయ్ సంస్థ 8.8 శాతం వృద్ధి నమోదు చేయగా, టయోటా కిర్లోస్కర్ ఆగస్టు నెలలో 32,842 యూనిట్ల విక్రయాలతో 4 శాతం స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. అయితే 2026 జనవరి-ఆగస్టు కాలానికి టయోటా మొత్తం విక్రయాలు 10 శాతం పెరిగి 2,66,696 యూనిట్లకు చేరాయి.

జీడీపీ వృద్ధి, పండుగ డిమాండ్ ఊతం

ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి బలంగా ఉండటం ఆటో రంగానికి కలిసి వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) జీడీపీ వృద్ధి రేటు అంచనాలకంటే ఎక్కువగా 7.8 శాతంగా నమోదు కావడం విక్రయాల జోరుకు బలమైన పునాది వేసింది. 2025 ఆగస్టు నెలలో జీఎస్టీ 2.0 నిబంధనల ప్రకటనకు ముందు కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబించడంతో అప్పట్లో విక్రయాలు తక్కువగా నమోదయ్యాయి. ఆ లో-బేస్ ప్రభావం వల్ల కూడా ఈ ఏడాది వృద్ధి శాతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండనుంది?

ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాహన కంపెనీలు ధరలు పెంచినప్పటికీ విక్రయాలు పుంజుకోవడం గమనార్హం. అయితే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వృద్ధి వేగం కొంత మందగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"గత ఏడాది తరహాలోనే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా మొదటి, రెండో అర్ధభాగాల్లో వృద్ధి రేట్లు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది" అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ అభిప్రాయపడ్డారు.

నిర్మల్ బాంగ్ ఆటో విశ్లేషకుడు యష్ అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "వినియోగదారుల ఉత్సాహం తగ్గడం వల్ల కాకుండా, గత ఏడాది నమోదు చేసిన అధిక గణాంకాల (హై బేస్) వల్లే ద్వితీయార్థంలో వృద్ధి వేగం కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ముడిసరుకుల ధరల భారాన్ని తట్టుకోవడానికి కంపెనీలు మళ్లీ ధరలు పెంచుతాయనే ఆలోచనతో వినియోగదారులు ముందే కొనుగోళ్లు జరుపుతున్నారని ఆయన వివరించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More