గ్రీన్ వాహనదారులకు గుడ్ న్యూస్: వాహన కాలపరిమితి మరో 5 ఏళ్లు పెంపు
పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీలు, హైడ్రోజన్, సిఎన్‌జీ వాహనాల కాలపరిమితిని మరో 5 ఏళ్లు పెంచుతూ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌లో సవరణలకు ప్రతిపాదించింది.
పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ముసాయిదాను సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ (EV), హైడ్రోజన్, సహజ వాయువు (CNG) ఆధారంగా నడిచే వాహనాల కాలపరిమితిని (పరిమితి వయస్సు) మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989 సవరణల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ఆగస్టు 10న నోటిఫై చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అధికారిక గెజెట్‌లో తుది నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి.

నేషనల్ పర్మిట్ కాలపరిమితి పొడిగింపు
ప్రస్తుతం ఉన్న రూల్ 88(3) ప్రకారం, మల్టీ-యాక్సిల్ సరుకు రవాణా వాహనాలకు 15 ఏళ్లు, ఇతర సరుకు రవాణా వాహనాలకు 12 ఏళ్ల పాటు నేషనల్ పర్మిట్ చెల్లుబాటు అవుతుంది. ఆ గడువు పూర్తయిన తర్వాత పర్మిట్ రద్దవుతుంది. తాజాగా తీసుకొచ్చిన ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం, గ్రీన్ వాహనాలకు ఈ పరిమితిపై అదనంగా ఐదేళ్ల వెసులుబాటు కల్పించనున్నారు. అంటే 12 ఏళ్ల పర్మిట్ ఉన్న వాహనాలు 17 ఏళ్ల వరకు, 15 ఏళ్ల పర్మిట్ ఉన్న మల్టీ-యాక్సిల్ వాహనాలు 20 ఏళ్ల వరకు నడుపుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
డిజిటల్ పర్మిట్లు.. ఆన్‌లైన్ ప్రక్రియ
రవాణా రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది:
ఈ-పర్మిట్ సౌకర్యం: వాహనదారులు ఒకేసారి గరిష్టంగా 5 ఏళ్ల కాలపరిమితికి నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పొందే వెసులుబాటు ఉంటుంది.
రుసుము వివరాలు: ఏటా రూ. 16,500 చొప్పున నేషనల్ పర్మిట్ ఖాతాలో ఈ రుసుమును నేరుగా జమ చేయాల్సి ఉంటుంది.
డిజిటల్ దరఖాస్తులు: పర్మిట్ దరఖాస్తులు (ఫారమ్ 46), ఆథరైజేషన్ మంజూరు (ఫారమ్ 47) పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే సాగుతాయి.
తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, విడిభాగాల తయారీదారులకు ప్రోత్సాహం
వాహనాల బాడీ బిల్డింగ్ లేని ఛాసిస్‌లకు ఇచ్చే తాత్కాలిక రిజిస్ట్రేషన్ కాలపరిమితిని ఆరు నెలల వరకు నిర్ణయించారు. అనివార్య కారణాలు లేదా వర్క్‌షాప్‌లో బాడీ ఫిట్టింగ్ ఆలస్యమైతే, నమోదు అధికారి ప్రతిసారీ 30 రోజుల చొప్పున ఈ గడువును పొడిగించే అవకాశం ఉంటుంది. అలాగే, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ (DSIR) ఆమోదం పొంది, నూతన ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధి (R&D)లో పాల్గొనే వాహన విడిభాగాల తయారీదారులను కూడా ట్రేడ్ సర్టిఫికేట్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
వాహన్ పోర్టల్‌తో అనుసంధానం
రవాణా పత్రాలను మరింత సరళతరం చేయడానికి 'వాహన్' (VAHAN) పోర్టల్‌తో డాక్యుమెంట్లను అనుసంధానించనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా డీలర్‌షిప్ సర్టిఫికేట్ వివరాలు నమోదు చేయగానే, వాహన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారు సమాచారం ఆటోమేటిక్‌గా ప్రత్యక్షమవుతుంది.
డీలర్లకు సంబంధించిన వివరాల నమోదులో జీఎస్టీ, పాన్ (PAN), ఉద్యమ్ ఆధార్, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (CIN) సమాచారాన్ని పొందుపరుస్తారు. అదేవిధంగా ఫారమ్ 20లో వాహనదారులు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరును, లీజు లేదా రుణాలు ఉంటే ఆ ఖాతా వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇక ఫారమ్ 48లో వాహనం ఇన్సూరెన్స్, పీయూసీ (PUC), ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పెండింగ్ చలాన్లు, పాత పర్మిట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


